కీలక అధికారికి ఉద్వాసన
వైట్‌హౌస్ ప్రధాన వ్యూహ నిపుణుడు స్టీఫెన్ బానన్‌ను జాతీయ భద్రతా మండలి పదవి నుంచి తొలగించారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. భద్రతా మండలి సభ్యులు, వాళ్ల విధుల విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక ప్రెసిడెన్షియల్ మెమొరాండం జారీ చేసిన ఆయన.. అందులో బానన్ పేరు పూర్తిగా పక్కన పెట్టేశారు. జాతీయ భద్రతా సలహాదారు మెక్ మాస్టర్ మొత్తం అన్ని సమావేశాల ఎజెండాలు సిద్ధం చేయాలని అందులో తెలిపారు. అంతేకాదు, హోం లాండ్ సెక్యూరిటీ సలహాదారు టామ్ బాసెర్ట్ను కూడా ఆయన కొంవరకు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే బానన్‌కు జాతీయ భద్రతామండలిలో స్థానం కల్పించారు. వైట్‌హౌస్ సీనియర్ సలహాదారులకు కూడా ఇది చాలా అరుదైన అవకాశం. అయితే ఇప్పుడు ఆయనను ఎందుకు పక్కన పెట్టారన్న విషయమే అర్థం కావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో జాతీయ భద్రతా మండలిని సుసాన్ రైస్ పనిచేయించారని, ఇప్పుడు తాను దాన్ని మళ్లీ ఆపేస్తున్నానని బానన్ చెప్పినట్లు తెలుస్తోంది. అది సరిగా పనిచేసేలా చూసేందుకు జనరల్ మెక్ మాస్టర్ తిరిగి వచ్చారన్నారు. అయితే.. బానన్‌ను అక్కడి నుంచి తప్పించం అవమానం ఏమీ కాదని, ఆయనకు మరింత పెద్ద బాధ్యత అప్పగించే అవకాశం ఉందని అమెరికన్ మీడియా వర్గాలు అంటున్నాయి.