'ఇది టీ కప్పులో తుఫాను'
ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అకాల మరణంతో ఏర్పడిన రాజకీయ వ్యాకులత నుంచి జమ్ముకశ్మీర్ ఇంకా బయటపడలేదు. మొన్నటివరకు పీడీపీ- బీజేపీ సంకీర్ ప్రభుత్వం కొనసాగగా.. మొహమూద్ మరణం, ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీను ముఖ్యమంత్రిని చేసేందుకు పీడీపీ ఏకపక్ష ప్రయత్నాలు.. దోస్తీపై బీజేపీని పునరాలోచనలో పడేశాయి. దీంతో కొత్త పొత్తులు ఉద్భవిస్తాయనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో తెరపైకి వచ్చిందే బీజేపీ- నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) కూటమి.
ఎన్సీ అధినేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా శనివారం మీడియాతో మాట్లాడుతూ 'ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలంటూ బీజేపీ ప్రతినిధులెవరైనా వస్తే తప్పక ఆహ్వానిస్తామని, పార్టీ వర్కింగ్ కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం' అన్నారు. గతంలోనూ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ బీజేపీతో కలిసి సంకీర్ణంలో కొనసాగిన దరిమిలా ఫారూఖ్ ప్రకటన రాజకీయవర్గాల్లో మరింత ఆసక్తిని రేపింది.
కాగా, 'ఇదంతా టీ కప్పులో తుఫాను' అని కొట్టిపారేశారు ఫారూఖ్ తనయుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున ట్వీట్లు చేశారు. ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం చెప్పబోనని, బీజేపీ- ఎన్సీల కలయికా అలాంటిదేనని ఒమర్ పేర్కొన్నారు. ఇతర పార్టీలవాళ్లొచ్చి మాట్లాడతామంటే వారిని ఆహ్వానించడం పార్టీ అధినేతగా ఫారూఖ్ విధి. అందుకే ఆయనలా మాట్లాడారేతప్ప బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఉద్దేశం ఎన్సీకి లేదు అని తేల్చిచెప్పారు. మొత్తం 87 సభ్యులు గల జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో పీడీపీకి 27మంది, బీజేపీకి 25 మంది నేషనల్ కాన్ఫెన్స్ కు 15 మంది సభ్యుల బలం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలన కొనసాగుతోంది.