Stormwater
-
చిగురిస్తున్న ఆశలు
సింగూర్‌లో పెరిగిన నీటి మట్టం 3టీఎంసీలకు చేరిన వరదనీరు రైతుల్లో ఆనందం పుల్కల్:పూర్తిగా అడుగంటిపోయిన సింగూర్ ప్రాజెక్ట్‌లోకి గతవారం రోజులుగా వరదనీరు వచ్చి చేరుతోది. దీంతో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. 30టీఎంసీల సామర్ధ్యం గల ప్రాజెక్టులో వర్షాలు కురియని కారణంగా గత రెండేళ్లుగా నీటిమట్టం అడుగంటిపోయింది. ఈ పరిస్థితుల్లో వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు కురవలేదు. దీంతో ఇటీవల వరుసగా కురుస్తున్న చిరుజల్లులతోపాటు ఎగువ ప్రాంతమైన జహీరాబాద్, బీదర్‌లో భారీవర్షాలు కురవడంతో సింగూర్ ప్రాజెక్ట్‌లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. గత పదిరోజుల్లోనే ఏకంగా మూడు టీఎంసీల నీరు ప్రాజెక్ట్‌లోకి వచ్చింది. ప్రతిరోజు 3500 క్యూసెక్కుల నీరు ఎగువనుండి వచ్చి చేరుతోంది. ఇప్పటి వరకు పూర్తిగా అడుగంటిపోయిన సింగూర్‌ప్రాజెక్ట్ గత 15రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతోపాటు రాష్ర్ట ప్రభుత్వం కూడా సింగూర్ ప్రాంత రైతులకు సాగునీరందించాలని నిర్ణయం తీసుకుంది. అందుకనుగుణంగానే ప్రాజెక్ట్ ఎడమ కాల్వ ద్వారా 35వేల ఎకరాలకు సాగునీరందించేందుకు గాను అవసరమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే దాదాపు 85శాతం పనులు పూర్తయ్యాయి. ప్రధానంగా గత ఐదేళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఎత్తిపోతల పథకం పనులు ఇటీవలే పూర్తిచేశారు. గత వారంలో భారీనీటిపారుల శాఖ మంత్రి హరీశ్‌రావు డ్రై ట్రయల్‌రన్ నిర్వహించి పరీక్షించారు. దీంతో సింగూర్ ప్రాజెక్ట్ నిండినట్లయితే ఈ ఖరీఫ్ నుంచే అందోల్, పుల్కల్, మునిపల్లి మండలాల పరిధిలోని 35 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు అవసరమైన కాల్వలను తవ్వారు. ప్రభుత్వం ఆశించిన మాదిరిగానే వర్షాలు భారీగా కురియడంతో పూర్తిగా అడుగంటిపోయిన సింగూర్ ప్రాజెక్ట్‌లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. రానున్న రెండు నెలల్లో ఇదే స్థాయిలో వర్షాలు కురిసినట్లయితే ప్రాజెక్ట్ సామర్థ్యం 30 టీఎంసీలకు గాను కనీసం 25టీఎంసీల వరకు నీరు వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 31జేజిపి22: సింగూర్ ప్రాజెక్ట్‌లో పెరిగిన నీటిమట్టం -
ముంపు.. వెంటాడే ముప్పు
మునగపాక, న్యూస్‌లైన్ : వర్షాలు, వరదలతో జనజీవనం అతలాకుతలమైంది. వాన తగ్గి, వరద ముప్పు తప్పినా ఆ భయం ప్రజల్ని పీడకలలా వెంటాడుతోంది. అయితే కొన్ని ప్రాం తాలను మాత్రం వరద నీరు ఇప్పటికీ వీడలేదు. ప్రజలకు ముంపు నీటితో బాధలు ఇం కా తప్పడం లేదు. మండలంలోని చూచుకొండ, గ ణపర్తి, యాదగిరిపాలెం గ్రామాల్లో వరదనీరు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఆయా గ్రామాల కాలనీల్లో చేరిన నీరు బయటకు పోయే మార్గం లేక కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు. చూ చుకొండ పీఏసీఎస్ ఎదురుగా వరదనీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో రా కపోకలకు ఇబ్బందులు తప్పడంలేదు. చూచుకొండ ఎస్సీ కాలనీ, చూచుకొం డకు వెళ్లే రోడ్డుపై కూడా ఇం కా వరదనీరు తగ్గలేదు. దీంతో వరద నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. యాదగిరిపాలెంలో ఆవ కాలువ నుంచి వచ్చే వరదనీరు తగ్గకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లపు ఆనందపురంలోనూ వరదనీటి ఉధృతి కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల్లోని సాగునీటి కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. -
జలదిగ్బంధంలో జగన్నాథపురం
జగన్నాథపురం (కోటనందూరు), న్యూస్‌లైన్ : వెదుళ్ల గడ్డకు వచ్చిన వరదనీరు జగన్నాథపురం గ్రామాన్ని ముంచెత్తింది. విశాఖ జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షానికి వెదుళ్లగెడ్డలోకి భారీగా వరదనీరు చేరింది. గత ఏడాది నీలం తుఫాన్‌కు జగన్నాథపురం వద్ద వెదుళ్లు గెడ్డకు గండ్లు పడ్డాయి. ఆ గండ్లకు ఇంతవరకు ఇరిగేషన్ అధికారులు మరమ్మతులు చేపట్టలేదు. శనివారం అర్ధరాత్రి సమయానికి వెదుళ్లగెడ్డలో వరదనీరు భారీగా రావడంతో గండ్ల గుండా వరదనీరు గ్రామంలోకి ప్రవేశించింది. ఎస్సీ, బీసీ కాలనీలతోపాటు గ్రామంలోని అధిక ప్రాంతాన్ని వరద ముంచెత్తడంలో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. వరదనీరు ఆదివారం గ్రామంలో నిలిచిపోవడంతో తాగునీటికి సైతం గ్రామస్తులు ఇబ్బందిపడ్డారు. వరదనీరు గ్రామం మీదుగా పంటపొలాల్లోకి ప్రవహించడంతో వరినాట్లు దెబ్బతినడంతోపాటు వరినారు కొట్టుకుపోయింది. గతేడాది నీలం తుఫాన్‌కు వెదుళ్లగెడ్డ ముంచెత్తడంతో ఈగ్రామం తీవ్రంగా నష్టపోయింది. మరల అలాగే జరిగిందని గ్రామస్తులు వాపోయారు. పది నెలలక్రితం పడిన గండ్లను పూడ్చకపోవడం వల్లే ఇప్పుడు ఇలా ఇబ్బందులుపడి నష్టపోవాల్సి వచ్చిందని గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు వెదుళ్లగెడ్డకు నీలం తుఫాన్ సమయంలో పడ్డ గండ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని ఇరిగేషన్‌శాఖ డీఈ కృష్ణారావు తె లిపారు. జగన్నాథపురం ముంపుపై స్థానికులు ఆదివారం జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్ ద్వా రా ఫిర్యాదు చేశారు. పరిస్థితిని సమీక్షించాలని ఇరిగేషన్‌శాఖ ఎస్ఈ కాశీవిశ్వేశ్వరరావు సిబ్బం దిని ఆదేశించారు. దీనిపై జగన్నాథపురం వచ్చి న డీఈ గ్రామంలో వరదనీటిని, వెదుళ్లుగెడ్డ గం డ్లను పరిశీలించారు. స్థానిక నేతలు డి. చిరంజీవిరాజు, గొర్లి రామచంద్రరావు, ఎర్రా చినసత్యనారాయణ, మాతిరెడ్డి బాబులుతో ఆయన చర్చించారు. ఆనంతరం డీఈ కృష్ణారావు విలేకరులతో మాట్లాడుతూ వెదుళ్లగడ్డ గండ్ల శాశ్వత మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా వాటికి తాత్కాలిక మరమ్మతులు చేపడతామన్నారు.