‘ఉత్తర కొరియాపై మా సహనం ముగిసింది’
పాన్మన్జామ్: ఉత్తర కొరియా విషయంలో తమ ‘వ్యూహాత్మక సహన శకం ముగిసింది’ అని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అన్నారు. ఇష్టానుసారం అణు కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఉత్తర కొరియా విషయంలో తాము చాలా ఆగ్రహంతో, అసహనంతో ఉన్నామని తెలిపారు. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఉన్న డిమిలిటేరైజడ్ జోన్ బోనిఫాస్ను పెన్స్ సందర్శించారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉత్తర కొరియా చేస్తున్న అణుకార్యక్రమాన్ని నిలిపివేసేలా చైనా ఒత్తిడి చేసే చొరవ తీసుకుంటుందని తమ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారని చెప్పారు. అలా జరగకుంటే తాము తమ భాగస్వామ్య దేశాలతో కలసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ఉత్తర కొరియా విషయంలో వేచి చూసే దోరణితో మాత్రం లేమని స్పష్టం చేశారు.