వేడివేడి నూనెలో చేతులాడిస్తాడు..
తాలింపులో పచ్చిమిర్చీ వేస్తున్నప్పుడో, పిండి వంటలు చేస్తున్నప్పుడో ఒకటీ అరా వేడివేడి నూనె చుక్కలు ఒంటిపై పండితే ప్రాణం పోయినంత పనౌతుంది. అలాంటిది సలసలా కాగే నూనెలో అమాంతం చేయి పెట్టేసి పకోడీలు అవీ వండేస్తుంటాడు రాంబాబు. ఇంతకీ ఎవరీ బాబు?
ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ రాంబాబు సొంతూరు. ఆ ఊళ్లోని ఓ వీధి తన ఇంటిముందరే చిన్న పొయ్యి అదీ ఏర్పాటుచేసి పిండి వంటలు అమ్ముకుంటూ జీవిస్తుంటాడు. 200 డిగ్రీల వేడి నూనెలో చేతులు పెట్టడం, పెట్టినా కాలకపోవడంతో రాంబాబు దగ్గర ఏవో దివ్యశక్తులు ఉన్నట్లు అక్కడి జనం అమ్ముతున్నారు. ఒక విధంగా ఆ నమ్మకం అతడి షాపుకు గిరాకి పెరిగేందుకు కూడా తోడ్పడింది. ఇంతకీ ఏమిటీ మ్యాజిక్? అని రాంబాబునే అడిగితే..
'మ్యాజిక్కూ లేదూ మాయా లేదు.. అంతా దైవ లీల! ఇరవైఏళ్ల కిందట షాపు ప్రారంభించినప్పటి నుంచీ నా వంటకాలకి మంచి పేరుంది. కొన్ని సార్లు అదుపులేచలేనంత మంది కస్టమర్లు వస్తుంటారు. అలా ఓ బిజీ సాయంత్రాన.. కస్టమర్లకు పదార్థాల్ని త్వరగా అందించాలనే హడావిడిలో పక్కనే జల్లిగంటే ఉన్న సంగతి మర్చిపోయి వేడివేడి నూనెలో చెయ్యిపెట్టి పకోడీని కలిపా! క్షణాల తర్వాత పొరపాటు గుర్తొచ్చి చెయ్యి వెనక్కి తీసుకున్నా. ఆశ్చర్యకరంగా చిత గాయమైనా కాలేదు! ఆ తర్వాత మళ్లీ మళ్లీ వేడివేడి నూనెలో నా చేతిని ముంచా. అయినా ఏమీ కాలేదు. అప్పుడు అర్థమైంది. ఇది దేవుడి లీలని. అప్పటి నుంచి గంటెలు గట్రా పక్కన పారేసి చేత్తోనే పదార్థాలు వండేస్తున్నా. ఇంతకు ముందు కంటే రుచిగా ఉంటున్నాయని పొగుడుతున్నరు కస్టమర్లు' అని వివరిస్తాడు స్ట్రీట్ ఛెఫ్ రాంబాబు. రోజుకు దాదాపు 100 కిలోల పిండి పదార్థాలమ్మే ఆయనకు ఖర్చులన్నీపోనూ 2వేల రూపాయలు మిగులుతాయట!