To strengthen the party
-
పార్టీ బలోపేతానికి కృషి చేయండి
వలంటీర్లకు ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆదేశం తిరుపతి రూరల్: తమిళనాడులో వైఎస్సార్ సీపీ బలోపేతానికి వలంటీర్లు సైనికుల్లా కృషిచేయాలని వైఎస్ఆర్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదేశించారు. తమిళనాడుకు చెందిన వైఎస్సార్ సీపీ సేవాదళం వలంటీర్లు ఆదివారం తిరుపతిలోని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వగృహానికి వచ్చారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, వైఎస్సార్సీపీ సేవాదళం నూతన కమిటీ ఏర్పాటుపై చెవిరెడ్డితో చర్చించారు. చెవిరెడ్డి మాట్లాడుతూ తమిళనాడులో పార్టీని గ్రామగ్రామానికి విస్తరించాలని సూచించారు. రెండు రోజులలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్ సేవాదళం నూతన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలో తమిళనాడులో సేవాదళం ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో వైఎస్ఆర్ సేవాదళం చేపట్టిన కార్యక్రమాలు, ప్రజాసేవలను సేవాదళం నాయకులు జాకీర్ హుస్సేన్, శ్రీనివాసులురెడ్డి, రామక్రిష్ణారెడ్డి వివరించారు. సేవాదళం వలంటీర్లు వినోద్‌కుమార్, పవన్‌కుమార్, నరేంద్రరెడ్డి, సాయినాథ్‌రెడ్డి, మణికంఠేశ్వర్‌రెడ్డి, సురేష్, శ్రీకాంత్, రాజశేఖర్‌రెడ్డి, రత్నం, వెంకట్ కుమార్ పాల్గొన్నారు. -
అమిత్‌షా గురి
నగరానికి చేరిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నేడు రాష్ట్ర పదాధికారులు, కార్యకర్తలతో సమావేశం విజయవాడ : నూతన రాష్ట్రంపై బీజేపీ దృష్టిసారించింది. పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు వరుస కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులోభాగంగానే అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా గురువారం రాత్రి నగరానికి వచ్చారు. ఆయన శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ఎంపీ గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్‌లో బీజేపీ రాష్ట్ర పదాధికారులతో సమావేశం కాను న్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడ నగరంతోపాటు జిల్లాకు చెందిన ప్రముఖులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతారు. జిల్లా సభ్యత్వ ప్రముఖులతోనూ మాట్లాడతారు. పార్టీ సభ్యత్వంపై ఆయన చర్చించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఇటీవల పార్టీలో చేరిన నాయకులను అమిత్‌షాకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పరిచయం చేసే అవకాశం ఉంది. గురువారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు కంభంపాటి హరిబాబు, అఖిల భారత సభ్యత్వ సహప్రముఖ్ రవి, పార్టీ ముఖ్య నాయకులు నగరానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం ఉదయం వస్తారు. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం గన్నవరం : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు గురువారం రాత్రి స్థానిక ఎయిర్‌పోర్టులో ఆ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన ఆయనకు మహిళా నేతలు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో స్వాగతం పలికినవారిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఎంపీ గోకరాజు గంగరాజు, రాష్ర్ట మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కె.శాంతారెడ్డి, సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్‌రెడ్డి, నాయకులు వి.శ్రీనివాసరాజు, కుమారస్వామి, లక్ష్మీపతి, వి.రంగప్రసాద్, జిల్లా అధ్యక్షడు ఆర్.వెంకటకృష్ణ, నగర అధ్యక్షుడు దానం ఉమామహేశ్వరరాజు ఉన్నారు. అనంతరం అమిత్ షా కృష్ణా కరకట్ట పక్కన ఉన్న గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్‌కు వెళ్లారు. నగరంలో కేంద్ర మాజీ మంత్రి పురందే శ్వరి, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ స్వాగతం పలికారు. -
పార్టీని బలోపేతం చేయండి!
పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఎంపీల భేటీలో మోడీ పిలుపు న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ చేపట్టాలని దక్షిణాది రాష్ట్రాల నుంచి పార్టీ తరఫున ఎన్నికైన ఎంపీలకు ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలతో గురువారం ఆయన తన నివాసంలో అనధికార భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పనితీరుపై నియోజకవర్గాల్లో ప్రజాస్పందనను ఎంపీలను అడిగి తెలుసుకున్నారు. విపక్షాల దుష్ర్పచారాన్ని పట్టించుకోకుండా ప్రజాసేవకు అంకితమవ్వాలని వారిని కోరారు. పార్లమెంటు సమావేశాల తరువాత నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు పార్టీని విస్మరించకూడదని, పార్టీ లేకుంటే మనం లేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితబోధ చేశారు. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియచేయాలని ఎంపీలను కోరారు.