స్త్రీశక్తి భవనంలోఉద్యోగి ఆత్మహత్య
పెనమలూరు :
గ్రామంలోని మండల స్త్రీశక్తి భవనంలో ఐకేపీ ఔట్‌సోర్స్ గుమస్తాగా పనిచేస్తున్న తంగిరాల అజయ్‌కుమార్ (26) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో వివాహేతర సంబంధం ఉన్న మహిళ కారణంగానే తాను చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాశాడు. పోలీసుల కథనం మేరకు... పోరంకి బీజేఆర్ నగర్‌కు చెందిన తంగిరాల అజయ్‌కుమార్ తొమ్మిదేళ్లుగా ఐకేపీ కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. అతను గురువారం ఉదయం కార్యాలయానికి వచ్చి 10 గంటల సమయంలో తలుపులు వేసి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. పోస్టుఉమెన్ వచ్చి తలుపులు కొట్టినా స్పందన రాలేదు. డ్వాక్రా మహిళలు కిటికీ నుంచి చూడగా అతను ఉరేసుకుని వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు, ఆ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తొలుత అతని ఆత్మహత్యకు కారణాన్ని కుటుంబ సభ్యులు చెప్పలేకపోయారు.
సూసైడ్‌నోట్ లభ్యం
పోలీసులు వచ్చి కార్యాలయం తలుపులు పగులకొట్టి చూడగా, గదిలో వేలాడుతున్న మృతదేహం వద్ద పది పేజీల సూసైడ్‌నోట్, రెండు సీడీలు, పెన్‌డ్రైవ్, రెండు సెల్ ఫోన్లు, ఒక సిమ్‌కార్డు దొరికాయి. సూసైడ్ నోట్లో గతలో కార్యాలయంలో బుక్ కీపర్‌గా పనిచేసిన వివాహితతో తనకు వివాహేతర సంబంధం ఉందని, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఆమె కోసం తాను రూ.1.50 లక్షలు ఖర్చుచేశానని, అయితే ఇప్పుడు ఆమె తనను పట్టించుకోకుండా వేధిస్తోందని, అందుకే మనస్థాపం చెంది ఆమె చీరతోనే ఉరేసుకుంటున్నానని పేర్కొన్నాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.