Strinidhi bank
-
సైకిల్ కావాలా.. ఆటో కావాలా..!
- ఎస్‌హెచ్‌జీల మహిళలకు స్త్రీనిధి బ్యాంక్ రుణ సదుపాయాలు - సైకిల్‌కు రూ.5వేలు, ఆటో లేదా ట్రాలీకి రూ.1.20 లక్షలు రుణమివ్వాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల కుటుంబాలకు సాధారణ రవాణా సౌలభ్యంతో పాటు జీవనోపాధికి రెండు కొత్త రుణ సదుపాయాలను స్త్రీనిధి బ్యాంక్ ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి సైకిల్ కొనుగోలుకు కాగా, మరొకటి ఆటో లేదా ట్రాలీని కొనుక్కునేందుకు రుణాలను అందించాలని నిర్ణయించింది. సైకిల్ కొనుక్కోవాలనుకున్న మహిళలకు ఒక్కొక్కరికీ రూ. 3వేల నుంచి రూ.5 వేల చొప్పున, ఆటో లేదా ట్రాలీ కొనుగోలుకు రూ.1.20 లక్షల చొప్పున రుణాలిచ్చే ప్రతిపాదనలకు స్త్రీనిధి బ్యాంక్ యాజమాన్య కమిటీ ఆమోదం తెలిపింది. స్త్రీనిధి బ్యాంక్ నుంచి ఆయా స్వయం సహాయక సంఘాలు సాధారణంగా తీసుకునే మైక్రో/టైనీ రుణాలతో నిమిత్తం లేకుండా కొత్త రుణాలను పొందవచ్చని బ్యాంకు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎస్‌హెచ్‌జీల నుంచి వచ్చే డిమాండ్ మేరకు కొత్త రుణ సదుపాయాల నిమిత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల దాకా బడ్జెట్‌ను కేటాయించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. సైకిల్ రవాణా.. పర్యావరణ హితం: పర్యావరణ హితమైనది కాబట్టి సైకిల్ రవాణాను పోత్సహించాలని స్త్రీనిధి బ్యాంక్ భావించింది. తొలుత ఆయా గ్రామాలు, మురికివాడల్లోని ఏ, బీ, సీ గ్రేడ్ సంఘాల్లోని సభ్యులకు, ఏ, బీ, సీ గ్రేడ్ మండల, పట్టణ సమాఖ్యల్లోని సభ్యులకు సైకిల్ రుణాలను అందించనున్నారు. సైకిల్ కోసం తీసుకున్న రుణాన్ని 12 సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు. లాభసాటి ఉపాధి కోసం ఆటో, ట్రాలీ: లాభసాటి ఉపాధిని కోరుకునే ఎస్‌హెచ్‌జీ మహిళల కుటుంబసభ్యులు ఆటో లేదా ట్రాలీ కొనుగోలు చేసేందుకు రుణాలను అందించాలని స్త్రీనిధి బ్యాంక్ నిర్ణయించింది. కొత్త వాహనం లేదా మూడేళ్లకు మించని సెకండ్ హ్యాండ్ వాహనాన్నైనా కొనుక్కునేందుకు వెసులుబాటు కల్పించింది. ఒక్కొక్క గ్రామ/మురికివాడ(స్లమ్ లెవల్ ఫెడరేషన్ సమాఖ్య)లో ఈ రుణ సదుపాయాన్ని ఇద్దరికే పరిమితం చేశారు. ప్యాసింజర్ ఆటో లేదా ట్రాన్స్పోర్ట్ ట్రాలీ కొనుగోలు చేయనున్న ఎస్‌హెచ్‌జీ మహిళ కుటుంబసభ్యుల్లో ఒకరికి సదరు వాహనం నడిపేందుకు అవసరమైన డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. వాహనం కొనుగోలుకు గరిష్టంగా రూ.1.20 లక్షలను స్త్రీనిధి బ్యాంక్ ఇస్తుండగా, అంతకన్నా ఎక్కువ ధర అయినట్లయితే మిగతా సొమ్మును లబ్ధిదారులే భరించాలి. వాహనం కొనుగోలు చేసిన నెల తర్వాత రుణ మొత్తాన్ని 60 సులభ వాయిదాల్లో చెల్లించాలి. -
మహిళలకు ‘స్త్రీనిధి’ ఫోన్లు!
డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించేందుకే.. ♦ ఈ ఏడాది రూ.50 కోట్లతో 84 వేల మందికి ఫోన్లు ♦ స్త్రీనిధి బ్యాంకు మేనేజింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీలను (డిజిటలైజేషన్) ప్రోత్స హించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు మొబైల్ ఫోన్లు అందించాలని స్త్రీనిధి బ్యాంకు నిర్ణయించింది. ఈ ఏడాది రూ.50 కోట్లతో దాదాపు 84 వేల మందికి డిజిటల్ ఫోన్లను అందించనుంది. డిజిటలైజేష న్ను ప్రోత్సహించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్న ట్లు స్త్రీనిధి బ్యాంకు వెల్లడించింది. శనివారం సచివాలయంలో స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ కమిటీ సమా వేశం జరిగింది. బ్యాంకు చైర్పర్సన్ అనిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామీణాభి వృద్ధి శాఖకు ఇన్చార్జి స్పెషల్ సీఎస్‌గా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, కమిష నర్ నీతూకుమారి ప్రసాద్, ఆర్థిక శాఖ కార్య దర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్సీఎస్, మెప్మా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మేనేజింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఎండీ జి.విద్యాసాగర్‌రెడ్డి వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు మొబైల్ ఫోన్ సమకూర్చే నిమిత్తం ఒక్కో మహిళకు రూ.6 వేల చొప్పున స్త్రీనిధి బ్యాంకు రుణమిస్తోందని ఎండీ చెప్పారు. రుణాన్ని పొందిన మహిళలు నెలకు రూ.275 చొప్పున కనీస వడ్డీతో 24 నెలల్లోపు చెల్లించాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు వారికి నచ్చిన మోడల్, నచ్చిన కంపెనీ మొబైల్‌ను తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి రుణాలు స్వచ్ఛ భారత్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతా ల్లోని స్వయం సహాయక మహిళల కుటుం బాల్లో మరుగు దొడ్డి నిర్మాణానికయ్యే ఖర్చు రూ.12 వేలను రుణంగా అందిస్తామని, 12 నెలల్లోపు రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని ఎండీ విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్నందున నిధులు వచ్చేలోగా స్త్రీనిధి బ్యాంక్ రుణమిస్తుం దన్నారు. అలాగే వికలాంగులైన (ఎస్‌హెచ్‌జీ మహిళల) పిల్లలకు మెరుగైన శిక్షణ కోసం సెర్ప్ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 70 నైబర్‌హుడ్ కేంద్రాలకు ఆర్థిక తోడ్పాటును అందించాలని బ్యాంక్ నిర్ణయించింది. బ్యాంకు నికర ఆదా యంలో 2% (రూ.80 లక్షల) నిధుల ను కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఆయా నైబర్‌హుడ్ కేంద్రాలకు అందించనున్నట్లు ఎండీ తెలిపారు. స్త్రీనిధి బ్యాంక్ కింద రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే నష్ట పరిహారం చెల్లించాలనే ప్రతిపా దనను కమిటీ ఆమోదించింది. వివిధ స్థాయి ల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబాలకు రూ.50 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు ఈ తరహా పరిహారం అందించనున్నారు. రుణ లక్ష్యాన్ని చేరకపోవడంపై అసంతృప్తి స్త్రీనిధి బ్యాంక్ వార్షిక రుణ లక్ష్యాన్ని చేరుకో వడంలో వెనుకబడటం పట్ల మేనేజింగ్ కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,600 కోట్ల రుణాలను స్వయం సహాయక సంఘాలకు అందించాల్సి ఉండగా, 10 నెలలు గడిచినా రూ.650 కోట్ల మేరకే రుణాలిచ్చారు. రుణ లక్ష్యంలో వెనుక బాటుకు కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయమే కారణమని.. 2, 3 నెలల పాటు రుణాలను నగదుగా ఇచ్చేందుకు క్షేత్ర స్థాయి లో విముఖత వ్యక్తం చేశారని వివరణ ఇచ్చా రు. మార్చిలోగా లక్ష్యాన్ని చేరుకునేం దుకు చర్యలు చేపట్టినట్లు విద్యాసాగర్‌రెడ్డి పేర్కొ న్నారు. రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మహిళలకు అక్కడి ప్రభుత్వాలు సూక్ష్మ రుణాలను అందించేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసేందుకు ఆయా రాష్ట్రాలతో అవగాహన ఒప్పందం కుదిరిందని విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. సభ్యుల వద్దకే చైర్పర్సన్ సాధారణంగా ఏ సంస్థకు సంబంధిం చిన మేనేజింగ్ కమిటీ సమావేశమైనా సదరు సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఆ కమిటీలో సభ్యులుగా ఉన్న అధికారులు, అనధికారులు చైర్మన్ ఉండే కార్యాలయా నికి రావాలి. అయితే.. శనివారం స్త్రీనిధి బ్యాంక్ మేనేజింగ్ కమిటీ సమావేశం మాత్రం చైర్మన్ ఉండే బ్యాంక్ ప్రాంగ ణంలో కాకుండా, కమిటీ సభ్యులు ఉన్న సచివాలయంలో జరగడం గమనార్హం. సచి వాలయంలో సమావేశమై తేనే వస్తామని కొందరు సభ్యులు భీష్మించుకుని కూర్చోవడంతో చివరికి బ్యాంక్ చైర్‌పర్సనే సచివాలయానికి వచ్చి మేనేజింగ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. -
పేద మహిళల పెన్నిధిగా ‘స్త్రీ నిధి’
స్త్రీనిధి బ్యాంక్ సర్వసభ్య సమావేశంలో కేటీఆర్ * సంఘటితంగా ఉంటే మరిన్ని అద్భుతాలు సృష్టించొచ్చు * వడ్డీలేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంపు సాక్షి, హైదరాబాద్: పేద మహిళల కోసం ఏర్పాటైన స్త్రీనిధి బ్యాంక్ మహిళల సార థ్యంలోనే సాగుతూ నాలుగేళ్లుగా అద్భుత ప్రగతిని సాధిస్తోందని, స్వయం సహాయక గ్రూపుల ద్వారా సత్వర రుణాలను అందిస్తూ పేద మహిళల పాలిట పెన్నిధిగా మారిందని పంచాయతీరాజ్ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మహిళలు సంఘటితంగా ఉంటే అద్భుతాలు సృష్టించగలరనేందుకు స్త్రీనిధి బ్యాంక్ సాధించిన ప్రగతే నిదర్శనమన్నారు. ‘తెలంగాణ స్త్రీ నిధి బ్యాంక్’ తొలి వార్షిక సర్వసభ్య సమావేశం బుధవారం జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో జరిగింది. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేటీఆర్.. రాష్ట్రంలో 470 మండల సమాఖ్యలు, 20 వేల గ్రామ సమాఖ్యలు, 4.20 లక్షల స్వయం సహాయక గ్రూపుల ద్వారా 60 లక్షల మంది పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్న స్త్రీనిధి బ్యాంక్ యాజమాన్యాన్ని అభినందించారు. రూ.10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు.. రాష్ట్రవ్యాప్తంగా బాగా పనిచేస్తున్న స్వయం సహాయక గ్రూపులకు వడ్డీలేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తుందని, స్వయం సహాయక సంఘాల్లోని మహిళలందరికీ సురక్ష బీమా యోజన ద్వారా ప్రమాదబీమా సదుపాయాన్ని త్వరలోనే కల్పించబోతున్నామని కేటీఆర్ ప్రకటించారు. పేద మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్న స్త్రీనిధి బ్యాంక్‌కు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా దళారులను నియంత్రించేందుకు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మహిళలకు రూ.1,005 కోట్లతో 25 వేల ఉత్పత్తి(పాడి పరిశ్రమ, మేకల, గొర్రెల పెంపకం తదితర) యూనిట్లను అందిస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల భాగస్వామ్యం, యాజమాన్యంలోనే నడుస్తున్న స్త్రీనిధి బ్యాంక్ గతేడాది 68 శాతం వృద్ధిరేటు సాధించిందని బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. బ్యాంకులు అందుబాటులో లేని గ్రామాల్లో గ్రామ సమాఖ్యల ద్వారా బ్యాంకింగ్ సేవలను స్త్రీనిధి బ్యాంక్ అందిస్తోందన్నారు. ప్రతిన బూనిన సంఘాలు ‘‘ప్రభుత్వంతో కలసి స్థాపించిన స్త్రీనిధి బ్యాంకు చక్కగా పనిచేసేందుకు, సంస్థ నుంచి సభ్యుల జీవనోపాధులకు, ఇతర అవసరాల నిమిత్తం సత్వర అప్పు ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాం. అందరి భాగస్వామ్యంతో స్త్రీనిధి బ్యాంకును మరింత పటిష్టం చేసి నిరుపేద మహిళలకు పెన్నిధిగా తయారు చేస్తాం’’ అని సర్వసభ్య సమావేశంలో సభ్యులంతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు, ఉద్యోగులకు కేటీఆర్ బహుమతులు అందించారు. 2013-14 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా ధనం కింద వచ్చిన డివిడెండ్ రూ.2,60,58,000 చెక్కును స్త్రీనిధి బ్యాంకు డెరైక్టర్లు మంత్రికి అందజేశారు. బ్యాంకు అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదించిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదిం చారు. కార్యక్రమంలో సెర్ప్ సీఈవో మురళి, స్త్రీనిధి బ్యాంకు అధ్యక్షురాలు గడ్డం సరోజ, కోశాధికారి బత్తిని స్వరూప, నాబార్డు మాజీ సీజీఎం మోహనయ్య, పలువురు డెరైక్టర్లు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా సమాఖ్యలు, మండల సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు.