సైకిల్ కావాలా.. ఆటో కావాలా..!
- ఎస్‌హెచ్‌జీల మహిళలకు స్త్రీనిధి బ్యాంక్ రుణ సదుపాయాలు
- సైకిల్‌కు రూ.5వేలు, ఆటో లేదా ట్రాలీకి రూ.1.20 లక్షలు రుణమివ్వాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల కుటుంబాలకు సాధారణ రవాణా సౌలభ్యంతో పాటు జీవనోపాధికి రెండు కొత్త రుణ సదుపాయాలను స్త్రీనిధి బ్యాంక్ ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి సైకిల్ కొనుగోలుకు కాగా, మరొకటి ఆటో లేదా ట్రాలీని కొనుక్కునేందుకు రుణాలను అందించాలని నిర్ణయించింది. సైకిల్ కొనుక్కోవాలనుకున్న మహిళలకు ఒక్కొక్కరికీ రూ. 3వేల నుంచి రూ.5 వేల చొప్పున, ఆటో లేదా ట్రాలీ కొనుగోలుకు రూ.1.20 లక్షల చొప్పున రుణాలిచ్చే ప్రతిపాదనలకు స్త్రీనిధి బ్యాంక్ యాజమాన్య కమిటీ ఆమోదం తెలిపింది.
స్త్రీనిధి బ్యాంక్ నుంచి ఆయా స్వయం సహాయక సంఘాలు సాధారణంగా తీసుకునే మైక్రో/టైనీ రుణాలతో నిమిత్తం లేకుండా కొత్త రుణాలను పొందవచ్చని బ్యాంకు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎస్‌హెచ్‌జీల నుంచి వచ్చే డిమాండ్ మేరకు కొత్త రుణ సదుపాయాల నిమిత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల దాకా బడ్జెట్‌ను కేటాయించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
సైకిల్ రవాణా.. పర్యావరణ హితం: పర్యావరణ హితమైనది కాబట్టి సైకిల్ రవాణాను పోత్సహించాలని స్త్రీనిధి బ్యాంక్ భావించింది. తొలుత ఆయా గ్రామాలు, మురికివాడల్లోని ఏ, బీ, సీ గ్రేడ్ సంఘాల్లోని సభ్యులకు, ఏ, బీ, సీ గ్రేడ్ మండల, పట్టణ సమాఖ్యల్లోని సభ్యులకు సైకిల్ రుణాలను అందించనున్నారు. సైకిల్ కోసం తీసుకున్న రుణాన్ని 12 సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు.
లాభసాటి ఉపాధి కోసం ఆటో, ట్రాలీ: లాభసాటి ఉపాధిని కోరుకునే ఎస్‌హెచ్‌జీ మహిళల కుటుంబసభ్యులు ఆటో లేదా ట్రాలీ కొనుగోలు చేసేందుకు రుణాలను అందించాలని స్త్రీనిధి బ్యాంక్ నిర్ణయించింది. కొత్త వాహనం లేదా మూడేళ్లకు మించని సెకండ్ హ్యాండ్ వాహనాన్నైనా కొనుక్కునేందుకు వెసులుబాటు కల్పించింది. ఒక్కొక్క గ్రామ/మురికివాడ(స్లమ్ లెవల్ ఫెడరేషన్ సమాఖ్య)లో ఈ రుణ సదుపాయాన్ని ఇద్దరికే పరిమితం చేశారు. ప్యాసింజర్ ఆటో లేదా ట్రాన్స్‌పోర్ట్ ట్రాలీ కొనుగోలు చేయనున్న ఎస్‌హెచ్‌జీ మహిళ కుటుంబసభ్యుల్లో ఒకరికి సదరు వాహనం నడిపేందుకు అవసరమైన డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. వాహనం కొనుగోలుకు గరిష్టంగా రూ.1.20 లక్షలను స్త్రీనిధి బ్యాంక్ ఇస్తుండగా, అంతకన్నా ఎక్కువ ధర అయినట్లయితే మిగతా సొమ్మును లబ్ధిదారులే భరించాలి. వాహనం కొనుగోలు చేసిన నెల తర్వాత రుణ మొత్తాన్ని 60 సులభ వాయిదాల్లో చెల్లించాలి.