Subabul
-
అప్పులే మిగిలాయ్!
శాంతినగర్ (అలంపూర్) : కొన్నేళ్లుగా అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు నష్టపోయిన రైతులు సుబాబుల్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. మూడేళ్లక్రితం మార్కెట్లో ధరలు బాగా ఉండటం, ఆర్డీఎస్ కెనాల్‌కు పూర్తిస్థాయిలో సాగునీరందకపోవడం, ఆయకట్టు పొలాలు బీళ్లుగా మారుతున్న తరుణంలో రైతులకు సుబాబుల్ సాగే దిక్కయింది. అయితే ప్రస్తుతం ధరలు పడిపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని వడ్డేపల్లి, రాజోలి, మానవపాడు, ఇటిక్యాల మండలాల్లో 15వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వడ్డేపల్లి మండలంలో గతేడాది హరితహారంలో భాగంగా నాలుగు లక్షల మొక్కలను అధికారులు ఉచితంగా రైతులకు అందజేశారు. ఈ ఏడాది మరో నాలుగు లక్షల మొక్కలు కావాలని రైతులు కోరుతున్నారు. మూడేళ్లపాటు మొక్కలు పెంచడానికి పెట్టుబడి కోసం దళారులను ఆశ్రయిస్తున్నారు. వారి వద్ద అధిక వడ్డీకి డబ్బలు తెచ్చుకుని పంట సాగు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మూడేళ్లలో కోతకు వచ్చేసరికి పెట్టుబడి కంటే వడ్డీ అధిక మవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారుల భోజ్యం రైతులు పండించిన సుబాబుల్‌ను ము ఖ్యంగా పేపర్ తయారీ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. పేపర్ తయారీ కేంద్రాలు ఐ టీసీ భద్రాచలం, కర్ణాటకలోని డోంగోల్లో మాత్రమే ఉన్నాయి. దగ్గర్లో మిల్లులు లేకపోవడం, నేరుగా రైతులతో సుబాబు ల్ కొనుగోలు చేయకపోవడం, స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో దళారుల రాజ్యం కొనసాగుతోంది. వారు ఎంత చెబితే అంత ధరకు రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. సుబాబుల్ మార్కెట్‌ను దళారులే శాసిస్తున్నారు. కం పెనీకి రైతులకు ఎలాంటి సంబంధం లేకపోవడం వారిపాలిట వరంగా మారింది. రెండేళ్ల క్రితం రూ.3,800 నుంచి రూ. నా లుగు వేల వరకు టన్ను కొనుగోలు చేశా రు. ఈ ఏడాది రూ.2,500కు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నా రు. మూడేళ్లపాటు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎకరానికి రూ.50 వేల నష్టం వస్తోందని చెబుతున్నారు. ఎకరా కు 30 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తోందన్నారు. ఆరు లక్షల టన్నుల దిగుబడిలో టన్నుకు రూ.1,500 చొప్పున మొ త్తం రూ.90 కోట్ల వరకు జిల్లా రైతులు నష్టపోతున్నట్లు సమాచారం. కనీసం రూ.నాలుగు వేలకు టన్ను కొనుగోలు చేస్తేనే గిట్టుబాటు అవుతుందన్నారు. మొక్కలే ఉచితంగా ఇస్తాం ఈజీఎస్ ద్వారా సుబాబుల్ మొక్కలు మాత్రమే ఉచితంగా ఇస్తాం. వడ్డేపల్లి మండలంలోనే రెండేళ్లలో నాలుగు లక్షల మొక్కలు ఉచితంగా ఇచ్చాం. ఈ ఏడాది ఎక్కువ మొక్కలు కావాలని రైతులు కోరడంతో నాలుగు లక్షల వరకు ఉచితంగా ఇచ్చేందుకు నర్సరీల్లో పెంచుతున్నాం. సుబాబుల్‌కు రాయితీలు, పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. – ఐ.ప్రకాష్, జిల్లా అటవీశాఖ అధికారి, గద్వాల ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మూడేళ్లపాటు కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మిన తరువాత డబ్బులకోసం మూడు నెలలపాటు వేచి ఉండాల్సిన పరిస్తితులు ఉన్నాయి. అసలే గిట్టుబాటు ధరలేక ఓవైపు రైతులు అల్లాడుతుంటే అమ్మిన తరువాత డబ్బులకోసం ఎదురుచూడాల్సిన దుస్తితులు దాపురించాయి. సుబాబుల పంటకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలుచేసి రైతులను ఆదుకోవాలి. – సత్యప్రసాద్‌రెడ్డి, రైతు, కొంకల, వడ్డేపల్లి మండలం మూడేళ్లపాటు పెట్టుబడికి ఇవ్వాలి సుబాబుల్ పంట కోతకు రావాలంటే మూడేళ్లు పడుతుంది. అప్పటివరకు పెట్టుబడి పెడుతూనే ఉండాలి. బయట వడ్డీకి డబ్బులు తీసుకుని సాగు చేస్తే మూడేళ్లలో అంతకు అంత రెట్పింపవుతుంది. పంట వల్ల వచ్చే లాభం వడ్డీకే సరిపోతుంది. ఉద్యానవన శాఖ ద్వారా పండ్లతోటలకు ఇచ్చే రాయితీలు మాకు కల్పించాలి. – ఎస్.వెంకటనారాయణరావు, రైతు, శాంతినగర్ యార్డు ఏర్పాటు చేయాలి కిలో విత్తనం రూ.150 ప్రకారం ఐటీసీ పేపర్‌మిల్లు భద్రాచలం నుంచి తెచ్చుకుని 40ఎకరాల్లో పంట సాగు చేశాను. విత్తనాలు ఇవ్వడమేగాని కొనుగోలు చేసేందుకు వారు ముందుకు రావడంలేదు. ఈ ఏడాది టన్నుకు మార్కెట్లో రూ.2,500కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దళారులు ఎంత చెబితే అంత ధరకు అమ్మాల్సి వస్తోంది. జిల్లాలో నేషనల్ హైవేకు దగ్గర్లో ఎక్కడైనా యార్డు ఏర్పాటుచేసి నేరుగా ఐటీసీ కంపెనీ ద్వారా కొనుగోలు చేయించాలి. – వి.జోగేంద్రప్రసాద్, రైతు, శాంతినగర్ -
దళారీల దోపిడీ
♦ సుబాబుల్, జామాయిల్ ♦ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కరువు ♦ రైతుల్ని వంచిస్తున్న పేపర్ మిల్లుల యజమానులు ♦ దళారీల ద్వారా తక్కువ ధరకు కొనుగోళ్లు ♦ మార్కెట్ కమిటీలకు చెస్ ఎగవేత ♦ అక్రమ రవాణాకు సహకరిస్తున్న అధికారులు ♦ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి గిట్టుబాటు ధర దక్కక జిల్లాలో సుబాబుల్, జామాయిల్, చౌకలు ఉత్పత్తి చేసే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు గిట్టుబాటు ధర ఇస్తామని ప్రకటించిన పేపర్ మిల్లుల యజమానులు ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కారు. దళారులను పెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఒక్క శాతం చెస్ చెల్లించాల్సి ఉన్నా కింది స్థాయి అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి ప్రభుత్వ ఆదాయానికి భారీగాగండి కొడుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలోని కనిగిరి, కందుకూరు, కొండపి, సంతనూతలపాడు, అద్దంకి, మార్కాపురం, యర్ర గొండపాలెం తదితర నియోజకవర్గాల పరిధిలో 1.60 లక్షల ఎకరాల్లో రైతులు సుబాబుల్, జామాయిల్, సర్వి(చౌకలు) సాగు చేస్తున్నారు. 1999 సంవత్సరానికి ముందు వీటి అమ్మకాలు అటవీశాఖ పరిధిలో జరిగేవి. అరకొర ధర ఇచ్చి కొనుగోలు చేసేవారు. రైతుకు గిట్టుబాటు ధర కూడా లభించేది కాదు. జిల్లా రైతాంగం ఆందోళనల నేపథ్యంలో 1999 తరువాత సుబాబుల్, జామాయిల్ కొనుగోలును మార్కెటింగ్ శాఖకు అప్పగించారు. 2009లో పేపర్ మిల్లులు యజమానులు, రైతుల మధ్య అమ్మకాలకు సంబంధించి ఒప్పందం జరిగింది. ఈ మేరకు టన్ను జామాయిల్ కర్ర రూ.4,600, సుబాబుల్ రూ.4,400 ప్రకారం కొనుగోలు చేయాల్సి ఉంది. మార్కెట్ కమిటీ అధికారుల పర్యవేక్షణలో కొనుగోళ్లు జరగాలి. కొనుగోళ్లకు ఆంక్షలు.. భద్రాచలం, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన పేపర్ మిల్లుల యజమానులు సరాసరి రైతుల వద్ద సుబాబుల్, జామాయిల్ ఉత్పత్తులు కొనుగోలు చేయక దళారులను తెరపైకి తెచ్చారు. అప్పటి నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వక తాము ఇచ్చిన ధరకే అమ్మాలంటూ ఆంక్షలు పెట్టారు. టన్ను సుబాబుల్ రూ. 3,500, జామాయిల్ రూ. 2,500 మించి కొనడంలేదు. కాదు కూడదంటే మీ ఇష్టమొచ్చిన చోట అమ్ముకోమంటూ బెట్టు చేస్తున్నారు. గతంలో ప్రయివేటు వ్యక్తులు కొనుగోలు చేసేవారు. రైతులకు ఉత్పత్తులు అమ్ముకోవడం సులభతరంగా ఉండేది. ఇప్పుడు బయటవారు కొనక ఇటు వ్యవసాయ మార్కెట్ అధికారుల పర్యవేక్షణలో కొనుగోళ్లు జరగక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులను బతిమలాడు కోవాల్సివస్తోంది. పేపర్ మిల్లుల యజమానులు రైతులకు అగ్రిమెంట్లు ఇవ్వడంలేదు. అటు మార్కెటింగ్ అధికారులు రైతులు దోపిడీకి గురౌతున్నా పట్టించుకోవడంలేదు. పేపర్‌మిల్లుల యజమానులతో కుమ్మక్కై అందిన కాడికి దండుకుంటూ రైతులను వంచిస్తున్నారు. అమలుకు నోచని ఆన్లైన్ ప్రక్రియ.. జిల్లా నుంచి రోజుకు 1800 టన్నులకు తగ్గకుండా జామాయిల్, సుబాబుల్ ఎగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది. ఎగుమతులకు సంబంధించి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలకు ఒక్క శాతం చెస్ చెల్లించాలి. కొందరు మార్కెటింగ్ అధికారులు మిల్లుల యజమానులతో ముడుపులు పుచ్చుకొని అక్రమ తరలింపుకు సహకరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారన్న విమర్శలున్నాయి. అక్రమాలను అరికట్టేందుకు కొనుగోళ్ల వ్యవహారాన్ని ఆన్లైన్ చేస్తున్నామని వ్యవసాయశాఖ ప్రకటించినా అది ఇంతవరకూ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. రైతులకు మిల్లుల యజమానులు గిట్టుబాటు ధర ఇచ్చేలా చూడాల్సిన ఆ శాఖ ధరల వ్యవహారాన్ని ఆయా జిల్లాల పాలనాధికారులకు కట్టబెడుతూ జీవో ఆర్టీ నంబర్ 143ను విడుదల చేసింది. జిల్లా ఉన్నతాధికారులు మాత్రం రైతులకు మిల్లుల యజమానులు గిట్టుబాటు ధర ఇస్తున్నారా.. లేదా అన్న విషయం పట్టించుకోవడంలేదు. దీంతో దళారుల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న పేపర్ మిల్లుల యజమానులు తక్కువ ధరలకు కొని రైతులను వంచిస్తున్నారు. -
సుబాబుల్ ధర తగ్గించేది లేదు
కంపెనీల ముక్కు పిండి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు వసూలు చేయాలి అధికారులను ఆదేశించిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా గాంధీనగర్ : తమకు నష్టాలు వస్తున్నందున సుబాబుల్ కొనుగోలు ఒప్పంద ధర తగ్గించాలని పేపర్ కంపెనీలు చేసుకున్న అభ్యర్థనను అంగీకరించేది లేదని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశపు హాలులో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల సుబాబుల్ రైతులతో మార్కెటింగ్ శాఖ సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో పేపర్ కంపెనీలు టన్ను సుబాబుల్‌ను రూ.4400 ధరకు కొనుగోలు చేసేందుకు అంగీకరించాయని మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. తాము నష్టాబాట పట్టినందున రూ.700 తగ్గించి ధర నిర్ణయించాలని మార్కెటింగ్ శాఖకు లేఖ రాశాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సమీక్ష సమావేశం ఏర్పాటుచేశామని చెప్పారు. సుబాబుల్ మార్కెటింగ్, తూకం, రవాణాలో ఎదురయ్యే ఇబ్బందులు తెలియజేయాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. పేపర్ కంపెనీలకు ఎటువంటి నష్టాలూ లేవని, నిర్ణయించిన ధరకు కొనాల్సిందేనని స్పష్టంచేశారు. జిల్లాకో రేట నిర్ణయించడాన్ని నియంత్రించాలని, అనధికార రవాణాను నిలుపుదల చేయాలని కోరారు. ఎస్పీఎం కంపెనీ రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని, మూడు జిల్లాల రైతులకు రూ.20 కోట్లు చెల్లించాలని తెలిపారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ ఎస్పీఎం కంపెనీపై కేసులు వేసి అరెస్ట్ వారెంట్ తీసుకోవాలని, అవసరమైతే ఆర్ఆర్ యాక్ట్ కింద నోటీసుల జారీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మూడు జిల్లాల కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలని మార్కెటింగ్ కమిషనర్‌కు సూచించారు. ఫిబ్రవరి 18తో కంపెనీలు, రైతుల ఒప్పందం ముగుస్తున్నందును ఈ దఫా రేటు పెంచేలా ఒత్తిడి చేస్తామన్నారు. కలెక్టర్ బాబు.ఎ, మార్కెటింగ్ శాఖ కమిషనర్ కిషోర్, సలహాదారు కృష్ణారావు, డెరైక్టర్ అహ్మద్, జేడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. జేడీ శ్రీనివాసరావుపై రైతుల ఆగ్రహం మార్కెటింగ్ శాఖ జాయింట్ డెరెక్టర్ జి.శ్రీనివాసరావు వ్యవహార శైలిపై సుబాబుల్ రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన పేపర్ కంపెనీలతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. ఒంగోలుకు చెందిన రైతు మాట్లాడుతూ ఎస్పీఎం కంపెనీతో జేడీ లాలూచీ పడ్డారని ఆరోపించారు.