దళారీల దోపిడీ | Subabul jamayil cost price drought | Sakshi
Sakshi News home page

దళారీల దోపిడీ

Published Thu, Jul 21 2016 2:57 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

దళారీల దోపిడీ

దళారీల దోపిడీ

సుబాబుల్, జామాయిల్
ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కరువు
రైతుల్ని వంచిస్తున్న పేపర్ మిల్లుల యజమానులు
దళారీల ద్వారా తక్కువ ధరకు కొనుగోళ్లు
మార్కెట్ కమిటీలకు చెస్ ఎగవేత
అక్రమ రవాణాకు సహకరిస్తున్న అధికారులు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

గిట్టుబాటు ధర దక్కక జిల్లాలో సుబాబుల్, జామాయిల్, చౌకలు ఉత్పత్తి చేసే రైతులు  తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు గిట్టుబాటు ధర ఇస్తామని ప్రకటించిన పేపర్ మిల్లుల యజమానులు ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కారు. దళారులను పెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఒక్క శాతం చెస్ చెల్లించాల్సి ఉన్నా కింది స్థాయి అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి ప్రభుత్వ ఆదాయానికి భారీగాగండి కొడుతున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలోని కనిగిరి, కందుకూరు, కొండపి, సంతనూతలపాడు, అద్దంకి, మార్కాపురం, యర్ర గొండపాలెం తదితర నియోజకవర్గాల పరిధిలో 1.60 లక్షల ఎకరాల్లో రైతులు సుబాబుల్, జామాయిల్, సర్వి(చౌకలు) సాగు చేస్తున్నారు. 1999 సంవత్సరానికి ముందు వీటి అమ్మకాలు  అటవీశాఖ పరిధిలో జరిగేవి. అరకొర ధర ఇచ్చి కొనుగోలు చేసేవారు. రైతుకు గిట్టుబాటు ధర కూడా లభించేది కాదు. జిల్లా రైతాంగం ఆందోళనల నేపథ్యంలో 1999 తరువాత సుబాబుల్, జామాయిల్ కొనుగోలును మార్కెటింగ్ శాఖకు అప్పగించారు. 2009లో పేపర్ మిల్లులు యజమానులు, రైతుల మధ్య అమ్మకాలకు సంబంధించి ఒప్పందం జరిగింది. ఈ మేరకు టన్ను జామాయిల్ కర్ర రూ.4,600, సుబాబుల్ రూ.4,400 ప్రకారం కొనుగోలు చేయాల్సి ఉంది. మార్కెట్ కమిటీ అధికారుల పర్యవేక్షణలో కొనుగోళ్లు జరగాలి.

కొనుగోళ్లకు ఆంక్షలు..
భద్రాచలం, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన పేపర్ మిల్లుల యజమానులు సరాసరి రైతుల వద్ద  సుబాబుల్, జామాయిల్ ఉత్పత్తులు కొనుగోలు చేయక దళారులను తెరపైకి తెచ్చారు. అప్పటి నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వక తాము ఇచ్చిన ధరకే అమ్మాలంటూ ఆంక్షలు పెట్టారు. టన్ను సుబాబుల్ రూ. 3,500, జామాయిల్ రూ. 2,500 మించి కొనడంలేదు. కాదు కూడదంటే మీ ఇష్టమొచ్చిన చోట అమ్ముకోమంటూ బెట్టు చేస్తున్నారు. గతంలో ప్రయివేటు వ్యక్తులు కొనుగోలు చేసేవారు.   రైతులకు ఉత్పత్తులు అమ్ముకోవడం సులభతరంగా ఉండేది.

ఇప్పుడు బయటవారు కొనక ఇటు వ్యవసాయ మార్కెట్ అధికారుల పర్యవేక్షణలో కొనుగోళ్లు జరగక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులను బతిమలాడు కోవాల్సివస్తోంది. పేపర్ మిల్లుల యజమానులు రైతులకు అగ్రిమెంట్లు ఇవ్వడంలేదు. అటు మార్కెటింగ్ అధికారులు రైతులు దోపిడీకి గురౌతున్నా పట్టించుకోవడంలేదు. పేపర్‌మిల్లుల యజమానులతో కుమ్మక్కై అందిన కాడికి దండుకుంటూ రైతులను వంచిస్తున్నారు.

అమలుకు నోచని ఆన్‌లైన్ ప్రక్రియ..
జిల్లా నుంచి రోజుకు 1800 టన్నులకు తగ్గకుండా జామాయిల్, సుబాబుల్ ఎగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది. ఎగుమతులకు సంబంధించి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలకు ఒక్క శాతం చెస్ చెల్లించాలి. కొందరు మార్కెటింగ్ అధికారులు మిల్లుల యజమానులతో ముడుపులు పుచ్చుకొని అక్రమ తరలింపుకు సహకరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారన్న విమర్శలున్నాయి. అక్రమాలను అరికట్టేందుకు కొనుగోళ్ల వ్యవహారాన్ని ఆన్‌లైన్ చేస్తున్నామని వ్యవసాయశాఖ ప్రకటించినా అది ఇంతవరకూ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. రైతులకు మిల్లుల యజమానులు గిట్టుబాటు ధర ఇచ్చేలా చూడాల్సిన ఆ శాఖ ధరల వ్యవహారాన్ని ఆయా జిల్లాల పాలనాధికారులకు కట్టబెడుతూ జీవో ఆర్‌టీ నంబర్ 143ను విడుదల చేసింది. జిల్లా ఉన్నతాధికారులు మాత్రం రైతులకు మిల్లుల యజమానులు గిట్టుబాటు ధర ఇస్తున్నారా.. లేదా అన్న విషయం పట్టించుకోవడంలేదు. దీంతో దళారుల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న పేపర్ మిల్లుల యజమానులు తక్కువ ధరలకు కొని రైతులను వంచిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement