‘కార్తె’ వచ్చింది..పండుగ తెచ్చింది
నిజామాబాద్‌కల్చరల్/నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్ : మృగశిర కర్తె రాకతో వర్షాకాలం ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని ప్రజలు ‘మిరుగు’గా జరుపుకున్నారు. ఆదివారం కలిసి రావడంతో జిల్లా అంతటా పండుగ వాతావరణం నెలకొంది. మామిడిపండ్ల పానకం, పూరీలు, ఆట్లు, చేపల కర్రీలు చేసుకున్నారు. మిరుగు సందర్భంగా చేపలు తినాలన్న ఆచారం ఉండడంతో.. మార్కెట్ కళకళలాడింది. డిమాండ్ ఉండడంతో చేపల ధరలు పెరిగాయి. నగరంలోని నెహ్రూ పార్క్ చౌరస్తాలో గల హమ్దర్ద్ దవాఖానా వద్ద చేప మందు పంపిణీ చేశారు. మందు కోసం అస్తమా బాధితులు ఉదయం నుంచే బారులు తీరారు. జిల్లావాసులతోపాటు ఆదిలాబాద్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచీ ప్రజలు తరలివచ్చారు.
భారీగా పెరిగిన ధర
మృగశిర కార్తెను జిల్లా ప్రజలు మిరుగుగా జరుపుకుంటారు. ఈ రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని ప్రజలు భావిస్తారు. దీంతో చేపల కొనుగోలుదారులతో వీక్లీ మార్కెట్, హైమద్‌పురా మార్కెట్, కంఠేశ్వర్‌లోని ఆర్మూర్ రోడ్డు, వినాయక్‌నగర్, హమల్‌వాడి,న్యాల్కల్ రోడ్డు, వర్ని చౌరస్తా తదితర ప్రాంతాలు కళకళలాడాయి. గిరాకీని ముందే ఊహించిన వ్యాపారులు.. భారీగా చేపలను దిగుమతి చేసుకున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో సాధారణంగా కిలో రూ. 400 పలికే మొట్ట చేపలను ఆదివారం రూ. 550 వరకు విక్రయించారు. రూ. 80కి విక్రయించే రవ్వటలను రూ. 120 కి కిలో అమ్మారు.