ఇవాళే సుబ్రమణ్య షష్ఠి! ఈ రోజున ఏం చేస్తారంటే..?
ప్రతి నెలలో వచ్చే షష్ఠి తిథిని గాక కేవలం ఈ మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి తిథినే సుబ్రమణ్య షష్ఠి అంటారు ఎందుకు. అసలేం చేస్తారు ఈరోజున. దక్షిణ భారతదేశ ప్రజలు ఎందుకంతా ఈ పండుగకు ప్రాముఖ్యత ఇస్తారు. పైగా ఆ రోజు పలు చోట్ల తీర్థం కూడా జరుగుతుంది. ఈ సుబ్రమణ్య షష్ఠిని పలు చోట్ల పలు విధాలుగా పిలుస్తారు ఎందుకని?. తదితరాల గురించే ఈ కథనం!.
సుబ్రమణ్య షష్ఠి అనగా?
శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామియే కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు అనే మొదలగు పేర్లుతో పిలవబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్టి, తమిళులు దీనిని స్కంద షష్టి అని అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజునే "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా వ్యవహరిస్తారు.
కుమారస్వామి జననం..
కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు, కధా క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది. పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న "తారకా సురుడు" అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు. అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేసాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావునా చంపడం మన తరంకాదు కాని ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది అనిచెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలిగే పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అనితరుణోపాయం చెప్పాడు. దేవతలు శివున్ని ఒప్పించి పార్వతితో పెళ్ళి జరిపించారు.
ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. ఆరుముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.
పలు పేర్లు ఎలా వచ్చాయంటే..?
ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తీకేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంతట ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు.
సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి" గా పిలుచుకుంటున్నాము, "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్రరోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీస్వామివారిసహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానంచేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే.
ఈ పండగలో దాగున్న సామాజిక ప్రయోజనం..
జాతకంలో కుజ దోషం, కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడిలో మొసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది.
ఈ వ్రత విధి విదానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది. మార్గశిర మాసమంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధను తట్టుకోలేని, ఆర్ధిక స్తోమతలేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కోలది సాటి వారికి సహయ పడమని, దానం చేయమని సందేశం ఇస్తుంది. ఈ దానాలు చేసిన వారికి గ్రహ భాదలు తోలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం. పురాణాలు తెలిపినట్టుగా "పరోపకారం మిధం శరీరం" అని భావించి పేదవారికి కంబళ్ళు, దుప్పట్లు తోపాటు చలి నుంచి రక్షించే దుస్తులను, తిను బండారాలను దానం చేయాలని తెలుపుతుంది.
(చదవండి: ధనుర్మాసంలో ఇలా చేస్తే నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుందట!)