సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో జరిగిన అవకతవకలపై బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం జిల్లా ఉన్నతాధికార యంత్రాంగంలో కదలిక తెచ్చింది. నిరుపేద అర్హులైన లబ్ధిదారులకు చెందాల్సిన సుమారు రూ.48 లక్షలు పక్కదారి పట్టిన వ్యవహారం వెలుగు చూడటంతో కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సుబ్రమణ్య శాస్త్రి బుధవారం కలెక్టర్ డాక్టర్ ఎం.జగన్మోహన్‌ను కలిసి వివరణ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఈ కథనం జిల్లా వ్యాప్తంగా మైనార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పలువురు మైనార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
నిలిచిన కొత్త రుణాల మంజూరు
ఈ బ్యాంకు లింకేజీ సబ్సిడీ పథకంలో అవకతవకలు జరిగిన వ్యవహారంపై సదరు బ్యాంకులో విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న విషయం విధితమే. దీంతో ఈ బ్యాంకు ఈ పథకానికి సంబంధించిన రుణాల మంజూరును పూర్తిగా నిలిపివేసింది. విజిలెన్స్ విచారణ పూర్తయ్యే వరకు కొత్త రుణాల మంజూరు నిలిపివేయాలని సదరు బ్యాంకు అధికారులకు ఆదేశాలందడంతో అర్హులైన లబ్ధిదారులు ఇప్పుడు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ విషయమై ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు కొందరు ఇటీవల రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి రామన్నను కలిసి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
ఇంకా ‘లక్ష్యం’ లేని సంస్థ
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 2.77 లక్షల మంది అల్ప సంఖ్యాక వర్గాలు ముస్లిం, క్రిస్టియన్, బుద్దిస్టులు, సిక్కులు, జైన తదితర మతాలకు చెందిన వారున్నట్లు సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఈ వర్గాలకు చెందిన నిరుపేద మైనార్టీ యువతీ, యువకులకు ఆర్థిక చేయూతనందించేందుకు ఈ కార్పొరేషన్ ద్వారా పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరం 2014-15కు సంబంధించి ఈ సంస్థకు ఇప్పటివరకు ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు దగ్గరపడుతున్నప్పటికీ ప్రభుత్వం కనీసం లక్ష్యం ఊసే లేకపోవడంతో ఈ సంస్థ సేవలు నిర్వీర్యమయ్యాయి. బ్యాంకు లింకేజీ సబ్సిడీ పథకం, సామూహిక వివాహాలు వంటి సంక్షేమ పథకాలు నీరుగారి పోతున్నాయి.
ప్రస్తుతానికి స్కాలర్‌షిప్‌లకు పరిమితం
ఇన్నాళ్లు మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కార్పొరేషన్ ద్వారా ఉపకార వేతనాలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌ల కోసం జిల్లాలోని ఆయా విద్యా సంస్థల నుంచి దరఖాస్తులను తీసుకుంటున్నారు.
ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 20తోనే ముగియగా, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30 వరకు గడువు ఉంది.
మైనార్టీ కార్పొరేషన్ వ్యవహారంపై కలెక్టర్ ఆరా
Published Thu, Sep 25 2014 1:32 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement