m.jaganmohan
-
మరుగుదొడ్లు లేకే వెనుకబాటు
ఆదిలాబాద్ కల్చరల్ : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో లేకే వెనుకబాటు కనిపిస్తోందని కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. బుధవారం గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ జగన్మోహన్, సీనియర్ ఐఏఎస్ మనోహర్‌ప్రసాద్ ప్రారంభించారు. పట్టణంలోని పలు వీధుల గుండా పలు పాఠశాలల విద్యార్థుల ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, మరుగుదొడ్ల నిర్మాణం లేక బహిర ంగ మల,మూత్ర విసర్జనలు చేస్తున్నారని, దీంతో ప్రజలు అనేక వ్యాధుల బారిన పడి ఆస్పత్రులకు తిరగలేక ఉన్న డబ్బునంతా కోల్పోతున్నారని తెలిపారు. కొందరి ప్రాణాలు కూడా పోతున్నాయని, తద్వారా అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవుతున్నారని పేర్కొన్నారు. అందుకే ఇంటింటా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. నిర్మల్ అబియాన్ సంస్థ ద్వారా ఒక్కో ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.10,900లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థ డెరైక్టర్ ఐఏఎస్ మనోహర్‌ప్రసాద్ మాట్లాడుతూ, మరుగుదొడ్ల నిర్మాణం మహిళల ఆత్మగౌరవానికి నిదర్శనమని అన్నారు. పాఠశాలల్లో కచ్చితంగా మరుగుదొడ్లు ఉండాలని పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎన్.సుధాకర్‌రావు, డీఈవో సత్యనారాయణరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సిరాజ్ద్దీన్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ జాదవ్ గణేశ్, ఎంపీడీవో జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరి బాధ్యత ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణ బాధ్యత అధికారులదే కాకుండా అందరిదీ అని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
పంట రుణాలివ్వడంలో వెనుకంజ
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలోని వివిధ బ్యాంకులు రైతులకు పంట రు ణాలు మంజూరు చేయడంలో ఇతర జిల్లాల కంటే వెనుకంజలో ఉన్నాయని కలెక్టర్ ఎం.జగన్మోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాం కర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు పంట రుణాలు అందించాలని ప్రభుత్వం పదేపదే చెబుతోందని, రుణ మాఫీ కూడా చేసిందని పేర్కొన్నారు. అయినా కొత్త పంట రుణాల మంజూరులో మన జిల్లా వెనుకబడి ఉందని తెలిపారు. జిల్లాలో భూములు లేని వారు కూడా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నట్లయితే తమకు రిపోర్టు చేయాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీలోగా పంట రుణాలు ఇవ్వాలని సూ చించారు. ప్రతీ రోజు ఐదు గంటలకు ఏయే బ్యాంకులు ఎం త మంది రైతులకు రుణాలు ఇచ్చారో తనకు నివేదికల రూపంలో పంపాలని అన్నారు. సంబంధిత మండల తహశీల్దార్లు, ఆర్డీవోలు ఆయా పరిధిలోని బ్యాంకుల్లో కొద్ది సమ యం కేటాయించాలని, బ్యాంకు అధికారుల సమన్వయం తో పంట రుణాల మంజూరులో సహకరించాలని కోరారు. మండలాల ఏవోలు, ఎడీలు, కూడా బ్యాంకులకు వెళ్లి రుణా ల విషయంలో సరి చూడాలని ఆదేశించారు. పరిహారంను రైతు పాత బకాయి కింద జమ చేస్తే ఆ బ్యాంకుల వివరాలను తనకు పంపాలని ఎల్డీఎంకు సూచించారు. ఓ జిల్లా కలెక్టర్ బ్యాంకర్లపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేస్తే బాగుంటుందా.. అని ప్రశ్నించారు. అనంతరం వివిధ బ్యాంకుల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, యువజన సర్వీసుల శాఖలు వివిధ పథకాల కింద బ్యాంకుల ద్వారా కల్పిస్తున్న రుణ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. జన్‌ధన్ యోజన పథకం కింద ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండాలని, ఇందుకు జీరో ఖాతా తెరవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్, ఎల్డీఎం శర్మ, జేడీఏ రోజ్‌లీల, ఆర్డీవోలు, వివిధ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
మైనార్టీ కార్పొరేషన్ వ్యవహారంపై కలెక్టర్ ఆరా
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలపై బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం జిల్లా ఉన్నతాధికార యంత్రాంగంలో కదలిక తెచ్చింది. నిరుపేద అర్హులైన లబ్ధిదారులకు చెందాల్సిన సుమారు రూ.48 లక్షలు పక్కదారి పట్టిన వ్యవహారం వెలుగు చూడటంతో కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సుబ్రమణ్య శాస్త్రి బుధవారం కలెక్టర్ డాక్టర్ ఎం.జగన్మోహన్ను కలిసి వివరణ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఈ కథనం జిల్లా వ్యాప్తంగా మైనార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పలువురు మైనార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిలిచిన కొత్త రుణాల మంజూరు ఈ బ్యాంకు లింకేజీ సబ్సిడీ పథకంలో అవకతవకలు జరిగిన వ్యవహారంపై సదరు బ్యాంకులో విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న విషయం విధితమే. దీంతో ఈ బ్యాంకు ఈ పథకానికి సంబంధించిన రుణాల మంజూరును పూర్తిగా నిలిపివేసింది. విజిలెన్స్ విచారణ పూర్తయ్యే వరకు కొత్త రుణాల మంజూరు నిలిపివేయాలని సదరు బ్యాంకు అధికారులకు ఆదేశాలందడంతో అర్హులైన లబ్ధిదారులు ఇప్పుడు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ విషయమై ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు కొందరు ఇటీవల రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి రామన్నను కలిసి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఇంకా ‘లక్ష్యం’ లేని సంస్థ 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 2.77 లక్షల మంది అల్ప సంఖ్యాక వర్గాలు ముస్లిం, క్రిస్టియన్, బుద్దిస్టులు, సిక్కులు, జైన తదితర మతాలకు చెందిన వారున్నట్లు సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఈ వర్గాలకు చెందిన నిరుపేద మైనార్టీ యువతీ, యువకులకు ఆర్థిక చేయూతనందించేందుకు ఈ కార్పొరేషన్ ద్వారా పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2014-15కు సంబంధించి ఈ సంస్థకు ఇప్పటివరకు ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు దగ్గరపడుతున్నప్పటికీ ప్రభుత్వం కనీసం లక్ష్యం ఊసే లేకపోవడంతో ఈ సంస్థ సేవలు నిర్వీర్యమయ్యాయి. బ్యాంకు లింకేజీ సబ్సిడీ పథకం, సామూహిక వివాహాలు వంటి సంక్షేమ పథకాలు నీరుగారి పోతున్నాయి. ప్రస్తుతానికి స్కాలర్‌షిప్‌లకు పరిమితం ఇన్నాళ్లు మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కార్పొరేషన్ ద్వారా ఉపకార వేతనాలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌ల కోసం జిల్లాలోని ఆయా విద్యా సంస్థల నుంచి దరఖాస్తులను తీసుకుంటున్నారు. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 20తోనే ముగియగా, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30 వరకు గడువు ఉంది. -
అక్రమాలకు చెక్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తాజా మాజీ ప్రజాప్రతినిధులు ఎన్నికల వేళ ఇష్టారాజ్యంగా ధారాదత్తం చేసిన అభివృద్ధి పనుల్లో జరిగిన అక్రమాలపై కలెక్టర్ ఎం.జగన్మోహన్ కొరడా ఝళిపిస్తున్నారు. తూతూ మంత్రంగా పనులు చేసి, రూ.లక్షల్లో బిల్లులు డ్రా చేసుకునే ప్రయత్నాలకు చెక్ పెడుతున్నారు. నాణ్యతకు తిలోదకాలిచ్చి, నామమాత్రంగా చేసిన పనులకు బిల్లులు కట్టబెట్టకుండా కట్టడి చేస్తున్నారు. ప్రత్యేకంగా నియమించిన ఉన్నతాధికారి సంబంధిత అభివృద్ధి పనులను పరిశీలించి నివేదిక ఇచ్చిన తర్వాత బిల్లులు మంజూరు చేయాలని కలెక్టర్ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇష్టారాజ్యంగా పనులు చేసి రూ.లక్షల్లో బిల్లులు కాజేద్దామనుకునే కార్యకర్తలకు, చోటామోటా నాయకుల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. ఎన్నికల ముందు పనుల పందేరం గత ప్రజాప్రతినిధులు తమకు కేటాయించిన ఎంపీ లాడ్స్, ఏసీడీపీ నిధులను మొదటి నాలుగున్నరేళ్లు ఆచీతూచీ పనులు ప్రతిపాదించగా, ఎన్నికలు సమీపించడంతో పనుల పంపకాల పందేరానికి తెరలేపా రు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనులను ప్రతిపాదించాల్సింది పోయి.. రాజకీయ ప్రయోజనాలను ఆశించి చోటామోటా నేతలకు, కార్యకర్తలు, అనుచరులకు ఈ పనులను పంపిణీ చేశారనే విమర్శలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. మార్చి వారంలో ఎన్నికల నగారా మోగగా, ఫిబ్రవరి చివరి వారం వరకు పనుల పంపకాల జాతర కొనసాగింది. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఫిబ్రవరి మొదటి వారంలో రూ.69.25 లక్షల అంచనా వ్యయం కలిగిన సుమారు 40 అభివృద్ధి పనులను ప్రతిపాదించగా, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ ఏకంగా రూ.1.01 కోట్ల అంచనా వ్యయం కలిగిన 62 అభివృద్ధి పనులను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే కొన్నిరోజుల ముందు ప్రతిపాదించారు. అలాగే అప్పటి ఇన్చార్జి మంత్రి సారయ్య కోటాలోని ఏసీడీపీ నిధులకు సంబంధించిన పనుల పంపకాలకు కూడా ఎన్నికలకు ముందే తెరలేచింది. మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనులు ప్రతిపాదించారు. తూతూ మంత్రంగా పనులు ఎంపీ లాడ్స్, ఏసీడీపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు తూతూ మంత్రంగా జరిగాయి. కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన చోటామోటా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. నాణ్యత ప్రమాణాలను తుంగలో తొక్కి బిల్లులు డ్రా చే సుకునే యోచనలో ఉన్నారు. కొన్నిచోట్ల అసలు పను లు చేయకుండానే ఎంబీ రికార్డులు సృష్టించి బిల్లులు డ్రా చేసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోం ది. మరికొన్ని చోట్ల పాత పనులకు పూతలు పూసి ఎంబీ రికార్డులు సృష్టించినట్లు సమాచారం. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు గత కలెక్టర్ అహ్మద్‌బాబు ఆయా పనులకు సంబంధించి ఫొటోలను ఎంబీ రికార్డుతోపాటు పెట్టాలని నిబంధనలు పెట్టారు. దీంతో అక్రమాల్లో ఆరితేరిన కొందరు వెరే పనుల ఫొటోలను పెట్టి బిల్లులు డ్రా చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రస్తుత కలెక్టర్ జగన్మోహన్ దృష్టికి వచ్చింది. దీంతో వాస్తవాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం నాణ్యతతో చేసిన పనులకు మాత్రమే బిల్లులు మంజూరు చేయాలని, ఈ పనులను పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ అధికారులు ఆయా పనులను చూసి నిబంధనల ప్రకారం జరిగాయని నివేదిక ఇచ్చాకే బిల్లులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ పనుల్లో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం కష్టంగా మారింది. -
సర్వేపై అవగాహన కల్పించాలి
నిర్మల్ : సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఈ నెల 19న చేపట్టే సర్వే రోజు వారంతా ఇంట్లోనే ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని రాజరాజేశ్వర గార్డెన్స్‌లో శుక్రవారం రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో సమగ్ర కు టుంబ సర్వేపై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించా రు. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ సర్వేల ద్వారానే ఒక ప్రాంతం అభివృద్ధిని సరిగా అంచనా వేయవచ్చని తెలిపారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం సర్వే ద్వారా ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రజలంతా ఆ రోజున ఇంట్లో నే ఉండేందుకు ప్రభుత్వం సెలవు సైతం ప్రకటించిందని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నింటికీ సెలవు ఉం టుందన్నారు. ఈ సర్వేలో ప్రజలంతా తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. సర్వే సందర్భంగా ప్రతీ వ్యక్తి వద్ద బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డు, భూముల పట్టాదారు పాస్‌బుక్, ఎల్పీజీ పాస్‌బుక్, పింఛన్‌దారులైతే పింఛన్ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. గ్రామాలు, వార్డుల్లో దండోరా లాంటి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. 19వ తేదీ కంటే ముందు ఒక డెమో సర్వే చేయాలని చెప్పారు. సమగ్ర సర్వే కోసం జిల్లాలో సు మారు 30 వేల మంది సిబ్బందిని నియమించామన్నారు. వారికి త్వరలోనే డివిజన్ల వారీగా శిక్షణ ఉంటుందన్నారు. 11న ప్రజాప్రతినిధులకు జిల్లా కేంద్రంలో శిక్షణ ఉంటుందని చెప్పారు. సర్వే విధులు నిర్లక్ష్యం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యే అల్లోల ఇం ద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ నిర్మల్ డివిజన్లో సుమా రు 10 వేల మంది గల్ఫ్, ఇతర దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లారని, సర్వే సందర్భంగా స్వగ్రామాల్లో వారి వివరాలనూ రికార్డు చేయాలన్నారు. ఆర్డీవో జల్ద అరుణశ్రీ, డ్వామా పీడీ గణేశ్ రా థోడ్, మెప్మా పీడీ రాజేశ్వర్ రాథోడ్, మున్సిపల్ చైర్మన్ గణేశ్ చక్రవర్తి, సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లో.. ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్లో శుక్రవారం సమగ్ర కుటుంబ సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ సర్వేలో భాగంగా ప్రతీ ఎన్యుమరేటర్ 25 ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని నిర్ణీత ప్రొఫార్మాలో సేకరిస్తాడని పేర్కొన్నారు. సర్వే కోసం ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, సింగరేణి, పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నామని తెలిపారు. పనులు, విద్యాభ్యాసం కోసం ఇతర దేశాలు వెళ్లినవారి వివరాలు నమోదు చేయరాదని చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, సర్పంచులు, గ్రామాధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.