సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తాజా మాజీ ప్రజాప్రతినిధులు ఎన్నికల వేళ ఇష్టారాజ్యంగా ధారాదత్తం చేసిన అభివృద్ధి పనుల్లో జరిగిన అక్రమాలపై కలెక్టర్ ఎం.జగన్మోహన్ కొరడా ఝళిపిస్తున్నారు. తూతూ మంత్రంగా పనులు చేసి, రూ.లక్షల్లో బిల్లులు డ్రా చేసుకునే ప్రయత్నాలకు చెక్ పెడుతున్నారు. నాణ్యతకు తిలోదకాలిచ్చి, నామమాత్రంగా చేసిన పనులకు బిల్లులు కట్టబెట్టకుండా కట్టడి చేస్తున్నారు. ప్రత్యేకంగా నియమించిన ఉన్నతాధికారి సంబంధిత అభివృద్ధి పనులను పరిశీలించి నివేదిక ఇచ్చిన తర్వాత బిల్లులు మంజూరు చేయాలని కలెక్టర్ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇష్టారాజ్యంగా పనులు చేసి రూ.లక్షల్లో బిల్లులు కాజేద్దామనుకునే కార్యకర్తలకు, చోటామోటా నాయకుల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది.
ఎన్నికల ముందు పనుల పందేరం
గత ప్రజాప్రతినిధులు తమకు కేటాయించిన ఎంపీ లాడ్స్, ఏసీడీపీ నిధులను మొదటి నాలుగున్నరేళ్లు ఆచీతూచీ పనులు ప్రతిపాదించగా, ఎన్నికలు సమీపించడంతో పనుల పంపకాల పందేరానికి తెరలేపా రు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనులను ప్రతిపాదించాల్సింది పోయి.. రాజకీయ ప్రయోజనాలను ఆశించి చోటామోటా నేతలకు, కార్యకర్తలు, అనుచరులకు ఈ పనులను పంపిణీ చేశారనే విమర్శలు అప్పట్లో వ్యక్తమయ్యాయి.
మార్చి వారంలో ఎన్నికల నగారా మోగగా, ఫిబ్రవరి చివరి వారం వరకు పనుల పంపకాల జాతర కొనసాగింది. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఫిబ్రవరి మొదటి వారంలో రూ.69.25 లక్షల అంచనా వ్యయం కలిగిన సుమారు 40 అభివృద్ధి పనులను ప్రతిపాదించగా, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ ఏకంగా రూ.1.01 కోట్ల అంచనా వ్యయం కలిగిన 62 అభివృద్ధి పనులను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే కొన్నిరోజుల ముందు ప్రతిపాదించారు. అలాగే అప్పటి ఇన్‌చార్జి మంత్రి సారయ్య కోటాలోని ఏసీడీపీ నిధులకు సంబంధించిన పనుల పంపకాలకు కూడా ఎన్నికలకు ముందే తెరలేచింది. మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనులు ప్రతిపాదించారు.
తూతూ మంత్రంగా పనులు
ఎంపీ లాడ్స్, ఏసీడీపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు తూతూ మంత్రంగా జరిగాయి. కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన చోటామోటా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. నాణ్యత ప్రమాణాలను తుంగలో తొక్కి బిల్లులు డ్రా చే సుకునే యోచనలో ఉన్నారు. కొన్నిచోట్ల అసలు పను లు చేయకుండానే ఎంబీ రికార్డులు సృష్టించి బిల్లులు డ్రా చేసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోం ది. మరికొన్ని చోట్ల పాత పనులకు పూతలు పూసి ఎంబీ రికార్డులు సృష్టించినట్లు సమాచారం. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు గత కలెక్టర్ అహ్మద్‌బాబు ఆయా పనులకు సంబంధించి ఫొటోలను ఎంబీ రికార్డుతోపాటు పెట్టాలని నిబంధనలు పెట్టారు.
దీంతో అక్రమాల్లో ఆరితేరిన కొందరు వెరే పనుల ఫొటోలను పెట్టి బిల్లులు డ్రా చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రస్తుత కలెక్టర్ జగన్మోహన్ దృష్టికి వచ్చింది. దీంతో వాస్తవాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం నాణ్యతతో చేసిన పనులకు మాత్రమే బిల్లులు మంజూరు చేయాలని, ఈ పనులను పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ అధికారులు ఆయా పనులను చూసి నిబంధనల ప్రకారం జరిగాయని నివేదిక ఇచ్చాకే బిల్లులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ పనుల్లో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం కష్టంగా మారింది.
అక్రమాలకు చెక్
Published Sat, Sep 20 2014 3:12 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
Advertisement
Advertisement