రిటర్నింగ్ అధికారి దివ్యదేవరాజన్‌కు నామినేషన్ పత్రాలు అందిస్తున్న రాథోడ్ రమేశ్
సాక్షి, ఆదిలాబాద్ అర్బన్: లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దివ్యదేవరాజన్ నామినేషన్ కేంద్రంలో అందుబాటులో ఉండి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రాథోడ్ రమేశ్ నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రానికి వచ్చిన రాథోడ్ రమేశ్ రిటర్నింగ్ అధికారి దివ్యదేవరాజన్‌కు నామినేషన్ పత్రాలు అందించారు. కాగా మంగళవారం తారాబలం కారణంగా మంచి ముహూర్తం ఉండడంతో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి.
తొలిరోజు ఒక్కటే..
నోటిఫికేషన్ జారీ అయిన తొలిరోజు ఒక్కటే నామినేషన్ దాఖలు అయింది. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ తన కుటుంబసభ్యులతో సహా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకొని ముందుగా కాంగ్రెస్ ఆయాజిల్లాల డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
తద్వారా కాంగ్రెస్ మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి, భార్గవ్ దేశ్‌పాండే, టీపీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాత, కాంగ్రెస్ నాయకులు సాజీద్‌ఖాన్, పలువురు నాయకులు కలిసి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రానికి వెళ్లి తన నామినేషన్‌ను దాఖలు చేశారు.
వీడని ఉత్కంఠ..
ఆదిలాబాద్ లోక్‌సభ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరనేది ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించి మూడురోజులు గడుస్తున్నా.. ఇంకా ఆ రెండు పార్టీల అభ్యర్థులు మాత్రం ఖరారు చేయలేదు. ఆయా పార్టీలు అభ్యర్థుల ఖరారులో నెల రోజులుగా తలమునకలవుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలైనా ఇప్పటికీ ఆ రెండు పార్టీల ఎంపీ అభ్యర్థులెవరో తేలకపోవడంతో కిందిస్థాయి కార్యకర్తల్లోనూ గందరగోళం ఏర్పడింది.
లోక్‌సభ నామినేషన్ల స్వీకరణకు సెలవులతో కలుపుకొని కేవలం ఏడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నేడో, రేపో ఆ రెండు పార్టీల ఎంపీ అభ్యర్థుల జాబితా బయటకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
నామినేషన్ కేంద్రం చుట్టూ బందోబస్తు
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల స్వీకరణకు కలెక్టరేట్‌లో కేంద్రం ఏర్పాటు చేశారు. కేంద్రానికి వందమీటర్ల దూరంలో పోలీసు బందోబస్తు నిర్వహించడంతోపాటు కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ ఉన్న దారులు పోలీసు బలగాలతో నిండిపోయాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment