సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆరు లోక్‌సభ నియోజకవర్గాలకు రెండో రోజు కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా, తొలి రోజు కేవలం ఐదు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఏడుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు మంగళవారం 9 నామినేషన్లు దాఖలు కాగా అందులో ప్రధాన పార్టీల అభ్యర్థులెవరూ లేకపోవడం గమనార్హం. నామినేషన్లు వేసిన 9 మందిలో నలుగురు స్వతంత్రులు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ముగ్గురు, శ్రమజీవి, సమాజ్‌వాది పార్టీ తరఫున ఒక్కొక్కరున్నారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌తో పాటు విపక్షాలు బీజేపీ, టీడీపీ, టీజేఎస్, వామపక్షాలు ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో రాష్ట్రంలో నామినేషన్ల సందడి ప్రారంభం కాలేదు.
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 16 మంది అభ్యర్థులను ప్రకటించినా ఇప్పటివరకు ఆ పార్టీ అభ్యర్థి ఒక్కరూ కూడా నామినేషన్ వేయలేదు. కరీంనగర్ నుంచి టీఆర్‌ఎస్ తరఫున సిట్టింగ్ ఎంపీ బి.వినోద్‌కుమార్ సోమవారం నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నెల 25తో నామినేషన్ల ప్రక్రియ ముగియబోతోంది. ఈ నెల 21న హోలీ, 23న నాలుగో శనివారం, 24న ఆదివారం సెలవులు పోగా, నామినేషన్ల స్వీకరణకు మరో మూడు రోజులే మిగలనున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీ 21న గురువారం రోజు అభ్యర్థులను ప్రకటించనుంది. ఆ తర్వాత ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు 22, 25 తేదీలు మాత్రమే మిగిలి ఉండనున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ఈ చివరి రెండు రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశముండటంతో రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద సందడి నెలకొనే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల సంఘం సూచనలు చేసింది.
నేడు రాజకీయ పార్టీలతో సదస్సు
ఎన్నికలకు సంబంధించి వివిధ అంశాలపై రాజకీయ పార్టీలతో బుధవారం ఎన్నికల సంఘం అవగాహనా సదస్సు నిర్వహించనుంది. హరిత ప్లాజా హోటల్‌లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ ఈ సదస్సును ప్రారంభించి మాట్లాడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment