sudhar shanreddy
-
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది
కడప ఎడ్యుకేషన్: అన్ని వృత్తులకంటే ఉపాధ్యాయ వృత్తే ఎంతో గౌరవప్రదమైందని అలాంటి వృత్తికి కళంకం తేవద్దని జిల్లా కలెక్టర్ కేవీ రమణ ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురష్కరించుకుని కడప నగరం నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేసి చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక అయిన జిల్లా కలెక్టర్ కేవీ రమణతోపాటు అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఆర్జేడీ రమణకుమార్, మేయర్ సురేష్‌బాబు, శాంతి సంఘం ప్రధాన కార్యదర్శి రాజారత్నం ఐజాక్, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, డీఈఓ కుంభ అంజయ్య, డీఎస్ఓ రెహమాన్ , డిప్యూటి డీఈఓలు రంగారెడ్డి, ప్రసన్న అంజనేయులు, విజయలక్ష్మీ, ఎంఈఓ నాగమునిరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులంటే అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు విద్యా బోధన చేయాలన్నారు. పిల్లలకు చదువుతోపాటు క్రీడల్లో కూడా ప్రావీణ్యాన్ని పెంచాలన్నారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులే పిల్లలకు మార్గదర్శకులని, వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కానివారు నిరుత్సాహం చెందవద్దని సూచించారు. ఎంపికైన వారు మరింత భాద్యతగా పనిచేయాలన్నారు. మేయర్ సురేష్‌బాబు మాట్లాడుతూ దేశంలోనే అధికంగా గౌరవించే వ్యక్తి ఉపాధ్యాయుడేనన్నారు. మిగతా ఏవృత్తిలోనైనా మచ్చలుండవచ్చని ఈ వృత్తిలో మాత్రం అలాంటివి ఉండవన్నారు. ఆర్జేడీ రమణకుమార్ మాట్లాడుతూ ఈ దినం ఉపాధ్యాయ లోకం గర్వించదగ్గ రోజన్నారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహోన్నతుడు సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న కళలను వెలికి తీయాలని ఉపాధ్యాయులకు సూచించారు. చదువుతోపాటు సమాజ సేవ, నైతిక విలువలను కూడా నేర్పించాలన్నారు. -
4వ యూనిట్.. ముంచింది
ఆత్మకూర్ : దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని 4వ యూనిట్లో లోపం కారణంగానే విద్యుత్‌ఉత్పత్తి కేంద్రంలోకి వరద నీరు చేరిందని జెన్కో అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. తెలంగాణ జెన్కో సీఎండీ ఆదేశాల మేరకు కార్యాలయ డీఈ హనుమాన్ బృందం దిగువ జూరాలను. మూలమల్ల, జూరాల గ్రామాల శివారులో నిర్మిస్తున్న దిగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సోమవారం సందర్శించింది. ఎగువ జూరాల నుంచి విడుదల చేసిన నీరు టర్బైన్లలోకి ప్రవేశించకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వాలుకట్టను పరిశీలించారు. అనంతరం పవర్‌హౌస్‌లో ముంపునకు గురైన పరికరాలు పరిశీలించారు. నష్టంపై, సంఘటన వివరాల గురించి కిందిస్థాయి ఉద్యోగులు... ఆల్స్ట్రామ్ కంపెనీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈ హనుమాన్‌తోపాటు ఎస్ఈలు శ్రీనివాస్, శ్రీనివాసులు మాట్లాడుతూ పవర్‌హౌస్‌లోని ఐదు యూనిట్లలో నీటిని పూర్తిస్థాయిలో తోడేశామని, ప్రమాదానికి కారణమైన నాల్గవయూనిట్ ఒక మీటరు మేర నీరు తోడాల్సి ఉందన్నారు.ఈ నీటిని పూర్తిస్థాయిలో తోడేందుకు సహాయక చర్యలు వేగవంతం చేశామన్నారు. రెండు రోజుల్లో ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తామన్నారు. నాల్గవ యూనిట్‌లోని 7వ గేటు వద్ద మీటరు మేర కాంక్రీట్ వర్క్ ధ్వంసమై ఉంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం నీటిలో మునిగిన కంట్రోల్ ప్యానల్‌బోర్డులు, టర్బైన్లను పరిశీలించారు. నవంబర్ చివరి నాటికి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈలు రమణమూర్తి, రాంభద్రరాజు, వీఆర్క్స్ కంపెనీ ఎండీ సుదర్శన్‌రెడ్డి, డెరైక్టర్ కౌశిక్కుమార్రెడ్డిలతోపాటు ఆల్స్ట్రామ్ కంపెనీ నిర్వాహకులు పాల్గొన్నారు. -
పోలియోను తరిమేద్దాం
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: ప్లేగు వ్యాధి తరహాలో పోలియో మహమ్మారిని కూడా సమాజం నుంచి తరిమికొడదామని చిన్ననీటిపారుదల మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక ప్రకాష్‌నగర్‌లోని ప్రకాశం పంతులు స్మారక మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మంత్రి టీజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1995 నుంచిపోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1950లో ప్లేగు వ్యాధి విజృంభించి ఊళ్లకు ఊళ్లే నాశనమై పోయాయని, అయితే ఆ వ్యాధిని సైతం సంపూర్ణంగా నిర్మూలించామన్నారు. అదే తరహాలోనే పోలియోను కూడా నిర్మూలించాలన్నారు. ఈ సంవత్సరం పల్స్‌పోలియో విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. నంద్యాలలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, కల్లూరు పీహెచ్సీలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, స్థానిక ఎ.క్యాంపులోని మున్సిపల్ హైస్కూల్లో జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డిలో పల్స్ పోలియో కార్యక్రమాలను ప్రారంభించారు. కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి కర్నూలు నగరంలోని పలు పల్స్‌పోలియో కేంద్రాలను సందర్శించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వై. నరసింహులు ఓర్వకల్లు, నన్నూరు, లొద్దిపల్లి, ఉయ్యాలవాడ, బి.తాండ్రపాడు గ్రామాల్లో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇతర జిల్లా అధికారులు సైతం వారికి కేటాయించిన నియోజకవర్గాలు, ప్రాంతాల్లో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
సౌరశక్తితో ‘కోత’లకు విముక్తి
నవీపేట, న్యూస్‌లైన్: దేవుడు ప్రసాదించిన సౌరశక్తిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి సూచించారు. సౌరశక్తితో విద్యుత్ కోతలను అధిగమించవచ్చన్నారు. గురువారం నవీపేట శివారులో గల దాస్ గెస్ట్ హౌస్ వద్ద గల పంట పొలాల్లో అమర్చిన సౌరశక్తితో 5 హెచ్‌పీ మోటార్‌ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం విద్యుత్ సమస్యతో రైతులతో పాటు పారిశ్రామిక వేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెరుగుతున్న వినియోగానికి అనుగుణంగా విద్యుత్ ఉత్తత్పి పెరగకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. సౌరశక్తితో ఇలాంటి ఇబ్బందులను అధిగమించవచ్చన్నారు. సౌరశక్తి ద్వారా 7 నుంచి 8 గంటల వరకు అందించే విద్యుత్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై అందజేస్తున్న సౌరశక్తి విద్యుత్ తయారీ యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో గల 20 లక్షల వ్యవసాయ బోరు కనెక్షన్లకు సౌరశక్తి విద్యుత్‌ను వాడుకునేందుకు రైతులను ప్రోత్సహించాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. సౌరశక్తి విద్యుత్‌తో కోతలు,లో వోల్టేజి,మోటార్ కాలిపోవడం,అధిక బిల్లులు తదితర సమస్యల నుంచి గట్టెక్కవచ్చన్నారు. పంట పొలాల్లో సౌరశక్తిని వినియోగించడంతో పారిశ్రామికరంగానికి ఎక్కువ మొత్తంలో విద్యుత్‌ను సరఫరా చేయవచ్చన్నారు. సౌరశక్తిని వినియోగిస్తున్న రైతులు స్మార్ట్ మీటరింగ్ ద్వారా మిగతా విద్యుత్‌ను ట్రాన్స్‌కోకు అమ్ముకోవచ్చని, ఈ పద్ధతి త్వరలోనే అమలవుతుందని పేర్కొన్నారు. సౌరశక్తి వినియోగానికి ముందుకు వచ్చిన భవంతి దేవదాస్‌ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి, డీసీసీ చీఫ్ తాహెర్‌బిన్ హందాన్, కాంగ్రెస్ నాయకులు మోస్రా సాయరెడ్డి, డాంగె శ్రీనివాస్, రాంకిషన్రావ్, పాండురంగారెడ్డి, సూరిబాబు, టైటాన్ టెక్నో క్రాట్స్ ప్రైవేటు లిమిటెడ్ ప్రతినిధి మురళీ కృష్ణ,డీలర్ కృష్ణ గౌడ్ రైతులు పాల్గొన్నారు.