వాట్సాప్ ను నిషేధించండి...!
వాట్సాప్... ప్రపంచ సమాచార మాధ్యమంగా ఎంత పాపులర్ అయిందో తెలియంది కాదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఈ యాప్ ను మెసేజింగ్ యాప్ కోసం విపరీతంగా వినియోగిస్తుంటారు. ఇటు స్కూల్ విద్యార్థుల నుంచి అటు టాప్ మేనేజర్లు, పొలిటికల్ లీడర్ల వరకూ ఈ యాప్ కు బానిసలా మారుతున్నారు. అయితే ఈ యాప్ ను నిషేధించాలని కోరుతూ గుర్గావ్ కు చెందిన 27 ఏళ్ల సమాచార హక్కు కార్యకర్త(ఆర్టీఐ) సుధీర్ యాదవ్ సుప్రీంకోర్టు గడపతొక్కాడు. వాట్సాప్ యాప్ లో కొత్తగా ప్రవేశించిన ఎన్ క్రిప్షన్ ఫీచర్ ద్వారా టెర్రరిజం, రేవ్ పార్టీ వంటి దుర్వినియోగాలకు పాల్పడే ప్రమాదముందని హెచ్చరిస్తూ పిల్ దాఖలు చేశాడు..
తను కూడా వాట్సాప్ కు బానిసనేని, కానీ ఈ విప్లవాత్మక ఫీచర్ ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్, ఇద్దరి మధ్య జరిగే సంభాషణలను మూడో వ్యక్తి తెలుసుకునే వీలు లేకుండా ఉందని, దీనివల్ల దేశ భద్రతకు హానివాటిల్లే ప్రమాదముందని తెలిపాడు. దీనిపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్ ను) దాఖలు చేశాడు. అనుమానస్పద ప్రజల మధ్య జరిగే సంభాషణలను ఈ ఎన్ క్రిప్షన్ వల్ల ప్రభుత్వం తెలుసుకోలేదని, ఇది దేశభద్రతకు హానికరమని పిల్ లో పేర్కొన్నాడు.
"వాట్సాప్ గ్రేట్ యాప్, దానిపై నేను చాలా గంటలను సమయాన్ని వెచ్చిస్తుంటా..కానీ డ్రగ్స్, రేవ్ పార్టీల సమాచారమంతా ఎక్కువగా వాట్సాప్ ద్వారానే జరుగుతుంటుంది. వాట్సాప్ ప్రవేశపెట్టిన ఈ ఎన్ క్రిప్షన్ ఫీచర్ ను ఉగ్రవాదులు అవకాశంగా మరల్చుకుని, కార్యకలాపాలు చేస్తుంటారు." అని యాదవ్ పేర్కొన్నాడు. ప్రపంచంలో ఏ మూలన కూడా ఉగ్రవాద చర్యలు పాల్పడాల్సినవసరం లేదని, ముఖ్యంగా భారత్ లో ఈ చర్యలను జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని యాదవ్ చెప్పాడు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ యాప్ ను నిషేధించాలని పిల్ లో సుప్రీంకోర్టును అభ్యర్థించాడు. హైక్, టెలిగ్రాం, వైబర్ వంటి 20 మెసేజింగ్ యాప్ లపై తన పిటిషన్ దాఖలు చేశాడు. అయితే వాట్సాప్ ఈ ఎక్రిప్షన్ ఫీచర్ ను ప్రారంభించిన ఏప్రిల్ నెల నుంచే దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.