Sugar production
-
చక్కెర ఉత్పత్తిని తగ్గించండి..లేకపోతే భారీ నష్టం: నితిన్ గడ్కరీ
దేశంలోని చక్కెర, అనుబంధ పరిశ్రమలకు చక్కెర ఉత్పత్తి తగ్గించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గట్టి వార్నింగ్‌ను ఇచ్చారు. దేశ అవసరాలకు తగ్గట్గుగా చక్కెరను ఇథనాల్‌గా మార్చాలని చక్కెర పరిశ్రమలకు గడ్కరీ పిలుపునిచ్చారు. ఉత్పత్తి తగ్గించండి..! ఆదివారం ముంబైలో జరిగిన షుగర్ అండ్ ఇథనాల్ ఇండియా కాన్ఫరెన్స్ (ఎస్ఈఐసీ)-2022లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చక్కెర పరిశ్రమల ఉత్పత్తి ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. పలు ధాన్యాల ఉత్పత్తిలో భారత్ మిగులు దేశంగా ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. కాలానికి అనుగుణంగా, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చక్కెర ఉత్పత్తిని తగ్గిస్తూ..ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలని చక్కెర పరిశ్రమలకు మంచిదని సూచించారు. ఫ్లెక్స్ ఫ్యుయల్స్ కోసం..! ఫ్లెక్స్ ఫ్యుయల్ వాడకంతో ఇంధన ధరల నుంచి ఉపశమనం కలుగుతుందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే టయోటా, హ్యుందాయ్, సుజుకీ వచ్చే ఆరు నెలల్లో ఫ్లెక్స్ ఇంజిన్ వాహనాలను తెచ్చేందుకు సిద్దంగా ఉన్నాయనే విషయాన్ని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఇథనాల్ బయో ఫ్యుయల్ అవుట్లెట్లను తెరిచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. పెరుగుతున్న ఇంధన ధరలను ఫ్లెక్స్ ఫ్యుయల్ వాడకంతో చెక్ పెట్టవచ్చునని గడ్కరీ వెల్లడించారు. చదవండి: బీఎస్‌ఎన్‌ఎన్‌లో ఆ సంస్థ పూర్తిగా విలీనం..! మలుపు తిప్పే అవకాశం..! -
చక్కెర షేర్లు.. తియ్యటి ర్యాలీ
న్యూఢిల్లీ: చక్కెర కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు తీపి లాభాలను పంచుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే ఈ స్టాక్స్ మంచి ర్యాలీ చేయగా.. ఇక ముందూ లాభాలను ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్రెజిల్లో చక్కెర సాగు ఆశాజనకంగా లేనందున ధరలు పెరిగి, భారత కంపెనీలకు కలిసొస్తుందని భావిస్తున్నారు. బ్రెజిల్లో ఏప్రిల్ నెలలో పంచదార ఉత్పత్తి దాదాపు 35 శాతం వరకూ తగ్గింది. ఈ మేరకు భారత షుగర్ కంపెనీలకు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. ‘‘బ్రెజిల్ దక్షిణాది ప్రాంతంలో చక్కెర దిగుబడి ఏప్రిల్ నెల మొదటి అర్ధ భాగంలో 6,24,000 టన్నులు. అంతక్రితం ఏడాది ఏప్రిల్‌లో ఇదే కాలంలో ఉత్పత్తి 9,71,000 టన్నులుగా ఉంది. 2020లో ఇదే కాలంతో పోల్చి చూస్తే చెరకు క్రషింగ్ 30 శాతం తగ్గి 15.6 మిలియన్ టన్నులుగా ఉంది’’ అని చక్కెర ఉత్పత్తిదారుల సంఘం యూనికా పేర్కొంది. అదే సమయంలో భారత్‌లో మాత్రం పంచదార ఉత్పత్తి 2020 అక్టోబర్ – 2021 సెప్టెంబర్ సీజన్లో 41 లక్షల టన్నుల మేర పెరగడం గమనార్హం. అన్ని షేర్లదీ పరుగే..: ఆంధ్రా షుగర్స్, ఈఐడీ ప్యారీ, బలరామ్‌పూర్ చినీ, ధంపూర్ షుగర్, దాల్మియా, అవధ్ షుగర్.. ఇవన్నీ కూడా గత ఏడాది కాలంలో అద్భుతమైన రాబడులను ఇచ్చాయి. ప్రధానంగా గత మూడు నెలల్లోనే 50–100 శాతం మధ్య ర్యాలీ చేసి నూతన గరిష్టాలకు చేరాయి. సరఫరా కఠినంగా మారొచ్చు.. పంచదార ఉత్పత్తికి ప్రపంచంలో బ్రెజిల్ అతిపెద్ద మార్కెట్. ఇక్కడి ఉత్పత్తి పరిస్థితులు భారత్ కంపెనీల లాభాలను నిర్ణయించగలవు. బ్రెజిల్లో ఇప్పటికే చెరకు సాగు సీజన్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు దిగుబడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు సానుకూలించకపోవడంతో సాగు తగ్గిందని.. దీనివల్ల దిగుబడితోపాటు నాణ్యత కూడా క్షీణించొచ్చని అంచనా. దీనికితోడు థాయిలాండ్, ఈయూ సైతం చక్కెర ఉత్పత్తిని పెంచకపోవచ్చని.. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్–సరఫరా పరిస్థితులు సానుకూలంగా ఉండకపోవచ్చని ఎలారా సెక్యూరిటీస్ తెలిపింది. సైక్లికల్ కాదు.. భారత్‌లో షుగర్ పరిశ్రమ ధరల పరంగా ఇక ఎంత మాత్రం సైక్లికల్ కాబోదని (హెచ్చుతగ్గులు) జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. పాక్షిక నియంత్రణల నుంచి కూడా బయటకు రావచ్చని భావిస్తున్నట్టు తెలిపింది. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ, చక్కెర రైతులకు చెల్లింపులు సకాలంలో అందేలా చూడాలన్న ఉద్దేశం ఈ రంగానికి ఎంతో మేలు చేస్తుందని అంచనా వేస్తోంది. చక్కెరకు మద్దతు ధరలు, ఎగుమతి సబ్సిడీలు, ఇథనాల్ రూపంలో మద్దతు వంటి చర్యలు ఈ రంగంలోని కంపెనీలు నిలదొక్కుకునేలా చేస్తాయని పేర్కొంది. ఫలితంగా ఈ రంగంలోని పటిష్టమైన కంపెనీలు మరింత లాభాలు, నగదు ప్రవాహాలను చూస్తాయని జేఎం ఫైనాన్షియల్ అంచనా వేసింది. షేర్ల గమనం కంపెనీ ప్రస్తుత ధర 3 నెలల్లో ఏడాదిలో (రూ.లలో) పెరుగుదల(%) పెరుగుదల(%) అవధ్ షుగర్ 306 60 110 దాల్మియా భారత్ 318 98 364 ద్వారికేష్ షుగర్ 56 75 200 బలరామ్‌పూర్ చినీ 303 68 190 ధంపూర్ షుగర్ 318 78 206 -
పెరిగిన చక్కెర ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశంలో అక్టోబర్–నవంబర్ మధ్య కాలంలో చక్కెర ఉత్పత్తి రెండు రెట్లు పెరిగి 42.9 లక్షల టన్నులకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఉత్పత్తి 20.72 లక్షల టన్నులుగా ఉందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) తెలిపింది. ఈ సీజన్లో షుగర్‌కేన్ క్రషింగ్ త్వరగా ప్రారంభం కావటమే ఉత్పత్తి పెరగడానికి ప్రధాన కారణమని ఐఎస్ఎంఏ పేర్కొంది. 2018–19 సంవత్సరంలోనూ ప్రొడక్షన్స్ ఇదే తీరులో జరిగిందని.. ఆ సమయంలో 418 షుగర్ మిల్లుల నుంచి 40.69 లక్షల టన్నులు చక్కెర ఉత్పత్తి జరిగింది. ఈ సీజన్లో ఉత్తర ప్రదేశ్ అత్యధికంగా చక్కెర ఉత్పత్తి జరిగింది. గతేడాది 11.46 లక్షల టన్నులుండగా.. ప్రస్తుతమిది 12.65 లక్షల టన్నులకు పెరిగింది. మహారాష్ట్రలో ప్రస్తుతం 15.72 లక్షల టన్నులుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉత్పత్తి 1.38 లక్షల టన్నులుగా ఉంది. కర్నాటకలో 5.62 లక్షల టన్నుల నుంచి 11.11 లక్షల టన్నులకు పెరిగింది. ప్రస్తుత సీజన్లో ప్రధాన రాష్ట్రాల్లో సగటు షుగర్ మిల్ చక్కెర ధరలు తగ్గినట్లు ఇస్మా గుర్తించింది. -
చక్కెర ఉత్పత్తి 44 శాతం తగ్గింది...
న్యూఢిల్లీ: దేశంలో చక్కెర ఉత్పత్తి 2016-17 సీజన్ తొలి నెల అక్టోబర్‌లో 44% క్షీణతతో 1.04 లక్షల టన్నులకు పరిమితమరుుంది. చక్కెరను అధికంగా ఉత్పత్తి చేసే మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చెరకు క్రషింగ్ ఆలస్యం కావడం ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపించినట్లు ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్(ఐఎస్ఎంఏ) పేర్కొంది. 2015-16 సీజన్ ఇదే నెలలో చక్కెర ఉత్పత్తి 1.87 లక్షల టన్నులుగా ఉందని తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో 65 మిల్లులు చెరకు క్రషింగ్‌ను ప్రారంభిస్తే.. ప్రస్తుత ఏడాది అదే నెలలో కేవలం 28 మిల్లులే చెరకు క్రషింగ్ కార్యకలాపాలను ప్రారంభించాయని వివరించింది. -
పంచదార షేర్ల పరుగు...
♦ ప్రతి రోజూ గరిష్ట స్థాయిలకు ♦ దేశీయంగా తగ్గుతున్న చక్కెర ఉత్పత్తి ♦ అంతర్జాతీయంగా పెరుగుతున్న ధర ♦ టర్న్ అరౌండ్ అవుతున్న చక్కెర కంపెనీలు పంచదార కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు లాభాల తీపి చేస్తున్నాయి. కేవలం ఏడు ట్రేడింగ్ సెషన్లలో పలు కంపెనీల షేర్లు 8-74 శాతం రేంజ్లో పెరిగాయి. మంగళవారం స్టాక్ మార్కెట్ కుదేలైనప్పటికీ దాదాపు పది పంచదార షేర్లు కొత్త ఏడాది గరిష్ట స్థాయిలను తాకడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లలో చక్కెర ధరలు పెరగడం, దేశీయంగా ఉత్పత్తి తగ్గడం, పంచదార కంపెనీలు టర్న్ అరౌండ్ కావడం తదితర కారణాల వల్ల షుగర్ స్టాక్స్ దూసుకుపోతున్నాయి. ఏరోజుకారోజు గరిష్టస్థాయిలను తాకుతున్నాయి. తగ్గుతున్న ఉత్పత్తి.. పెరుగుతున్న ధరలు చక్కెర ఉత్పత్తిలో భారత్‌ది ప్రపంచంలోనే రెండో స్థానం. వినియోగంలో మాత్రం మొదటి స్థానమే. 2015-16 షుగర్ సీజన్(అక్టోబర్-సెప్టెంబర్)లో 25 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా. అంతకు ముందటి షుగర్ సీజన్ ఉత్పత్తి (28.3 మిలియన్ టన్నుల)తో పోల్చితే ఇది 11 శాతం తక్కువ. 2016-17 షుగర్ సీజన్లో చక్కెర ఉత్పత్తి 23.5 మిలియన్ టన్నులకు పడిపోయే అవకాశాలున్నాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. 2015-16 మార్కెటింగ్ సంవత్సరం(అక్టోబర్-సెప్టెంబర్) కాలానికి భారత్ 1.4 మిలియ్ టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. చెరకు పండించే కొన్ని ప్రాంతాలు కరువు బారిన పడటంతో చెరుకు దిగుబడి పడిపోయి పంచదార ఉత్పత్తి తగ్గుతోంది. దీంతో ధరలకు రెక్కలు వస్తున్నాయి. 2015 జూలై నుంచి చూస్తే 2016 జూన్ 13 కల్లా టన్ను చక్కెర ధర 50%పైగా పెరిగి రూ.36,500 కు చేరింది. టర్న్ అరౌండ్‌లో కంపెనీలు గత కొన్నేళ్లుగా నష్టాల్లో ఉన్న పలు షుగర్ కంపెనీలు ఈ మార్చి క్వార్టర్‌లోనే టర్న్ అరౌండ్ అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బలరామ్‌పూర్ చిని మీల్స్ రూ.99 కోట్లు, ఆంధ్రా షుగర్స్ రూ.56 కోట్లు, ద్వారకేశ్ షుగర్స్ రూ.39 కోట్లు, థమ్‌పూర్ షుగర్స్ రూ.26 కోట్లు చొప్పున నికర లాభాలు ఆర్జించాయి. ఇక 34 షుగర్ కంపెనీల మొత్తం నికర లాభాలు గతేడాది రెండో అర్థభాగానికి రూ.1,408 కోట్లుగా ఉన్నాయి. ఇదే ఏడాది మొదటి అర్ధభాగానికి ఈ కంపెనీల మొత్తం నష్టాలు రూ.1.700 కోట్లకు పైమాటే. ఈ కంపెనీలకు 2014-15 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రూ.979 కోట్లు, 2014-15 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో రూ.1,268 కోట్లు చొప్పున నికర నష్టాలు వచ్చాయి. ఏడాదిలో రెట్టింపు: ఇక ఈ ఏడాదిలో 9 కంపెనీల షేర్లు రెట్టింపుకు పైగా పెరిగాయి. అప్పర్ గంగేశ్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్, మావానా షుగర్స్, అవధ్ షుగర్ మిల్స్, ధరణి షుగర్స్, ద్వారకేశ్ షుగర్ ఇండస్ట్రీస్, తిరు అరూరన్ షుగర్స్, రాజశ్రీ షుగర్స్, ఉగార్ షుగర్ వ ర్క్స్, ఉత్తమ్ షుగర్ కంపెనీల షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 110-350% వరకూ ఎగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ.... అంతర్జాతీయంగా చక్కెర ధరలు 3 నెలలలో 50% వరకూ పెరిగాయి. ప్రపంచంలోనే చక్కెర ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న బ్రెజిల్లో పంట ఆలస్యంతో సరఫరాలు తగ్గాయి. బ్రెజిల్ తర్వాత అత్యధికంగా చక్కెర ఎగుమతి చేసే దేశం థాయ్‌లాండ్ నుంచి సరఫరాలు తగ్గడం, కరువువల్ల ఉత్పత్తి తగ్గి భారత్ నుంచీ సరఫరాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో చక్కెర ధరలు పెరుగుతున్నాయి. వరుసగా రెండో ఏడాదీ అంతర్జాతీయ మార్కెట్లో చక్కెర లోటు ఏర్పడుతుందనే అంచనాలు ధరలను ఎగదోస్తున్నాయి. 2016-17 షుగర్ సీజన్లో అంతర్జాతీయంగా చక్కెర లోటు 5.5 మిలియన్ టన్నులుగా ఉండొచ్చనేది రొబొబ్యాంక్ అంచనా. ఇంటర్కాంటినెంటల్ ఎక్స్చేంజ్(ఐసీఈ)లో చక్కెర ధరలు గత 2 వారాల్లో 12% పెరిగాయి. ఐసీఈలో జూలై కాంట్రాక్ట్ షుగర్ ఫ్యూచర్స్(ఒక్కో పౌండ్‌కు) 19.34 సెంట్స్ వద్ద ట్రేడవుతోంది. -
తగ్గనున్న చక్కెర ఉత్పత్తి: ఇక్రా
11 శాతం మేర పడిపోతాయంటూ జోస్యం ముంబై: వర్షపాతం హెచ్చుతగ్గుల వల్ల చె రకు పంట దిగుబడి తక్కువగా వుండటంతో ఈ ఏడాది చక్కెర ఉత్పత్తి 11 శాతం మేర తగ్గనుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఈ సంవత్సరం 25.2 మిలియన్ టన్నుల లోటు ఉండొచ్చునని, ధరలు మాత్రం స్థిరంగా కొనసాగే వీలుందని పేర్కొంది. తద్వారా చ క్కెర ఎగుమతులపైన ప్రభావం చూపనుందని తెలిపింది. గత ఏడాది 9.5 మిలియన్ టన్నులు(ఎంటీ) ఎగుమతి కాగా ఇప్పుడు 7.6 ఎంటీలకు పడిపోయే ప్రమాదముందని చెప్పింది. స్టాక్ దిద్దుబాట్లు, తప్పనిసరి ఎగుమతులు, చెరకు పంట దిగుబడి పై సబ్సిడీ పుణ్యమా అని గత ఆగస్టు నుంచి చక్కెర ధరలుపెరిగాయని గుర్తు చేసింది. చెరకు పండించే ప్రధాన ప్రాంతాల్లో కరువు సంభవించటం కూడా ధరల పెరుగుదలకు కారణమైందని వెల్లడించింది. చ క్కెర ధరలు అమాంతం పెరిగి 2016 మే నాటికి టన్నుకు రూ.34 వేలకు చేరుకుంది. గత ఏడాది ధరతో పోలిస్తే 50 శాతం పెరిగిందని సంస్థ సీనియర్ సీనియర్ ఉపాధ్యక్షులు సబ్యసాచి మజుందర్ తెలిపారు. -
‘మై షుగర్’కు పూర్వవైభవం
- సెప్టెంబర్‌లో చక్కెర ఉత్పత్తి - అదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి కూడా మండ్య : చాలా కాలం తర్వాత మండ్య జిల్లాలో మై షుగర్ కంపెనీ అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. సెప్టెంబర్‌లో ఈ పరిశ్రమలో చక్కెర ఉత్పత్తిని ప్రారంభించే దిశగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆసియాలోనే అతి పెద్ద చక్కెర కర్మాగారంగా పేరుగాంచిన ఈ పరిశ్రమ పాలక మండలి సభ్యులు కేవలం పదవులను అలంకరించేందుకు పరిమితయ్యారు తప్పా, పరిశ్రమ అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదు. దీంతో పరిశ్రమ మూతపడేందుకు కారణమైంది. ఈ ఐదేళ్లలో పరిశ్రమ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చెరుకును క్రష్ చేస్తే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది. సాంకేతిక లోపాలు తలె త్తాయి. చెరుకును క్రష్ చేసే సమయంలో యంత్రాలు ఆగిపోయేవి. ఈ ప్రభావం చెరుకు రైతులపై తీవ్రంగా చూపింది. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సైతం ఈ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టాయి. ఈ అవినీతిపై లోకాయుక్తలో కేసు కూడా నడుస్తోంది. పరిశ్రమ పూర్తిగా మూతపడే పరిస్థితి ఉండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్లో మై షుగర్ పరిశ్రమ అభివృద్ధికి రూ. 120 కోట్లను ప్రకటించింది. కంపెనీలో చెడిపోయిన యంత్రాలకు మరమ్మతు చేయడం, అవసరమైన విడిభాగాలను చేర్చడం, అన్ని విధాలుగా పరిశ్రమకు పూర్వవైభవం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్‌లో చెరుకు క్రషింగ్ మై షుగర్ కంపెనీ తొలిదశలో ఏర్పాటు చేసిన బాయిలర్లు పూర్తిగాచెడిపోయాయి. కొంత కాలంగా ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో బాయిలర్లతో పాటు చెరుకును పొడి చేసే యంత్రాలు కూడా చెడిపోయాయి. ఇప్పటికే ఈ యంత్రాలను బాగు చేస్తున్నారు. ఇందు కోసం తమిళనాడు నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పిం చారు. ఈ నెల చివరకు యంత్రాలను సిద్ధం చేసి సెప్టెంబర్ మొదటి వారంలో చెరుకు క్రషింగ్ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తిగా చెడిపోయిన బాయిలర్లు మై షుగర్ కంపెనీలో ఉన్న రెండు బాయిలర్లు ఎందుకు పనికి రానంతా చెడిపోయాయి. మరో పదేళ్ల పాటు పనిచేయాల్సిన బాయిలర్లు సరైన నిర్వహణ లేకపోవడంతో ఈ దుస్థితికి చేరుకున్నాయి. ఇదే విషయాన్ని శాంకేతిక నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. 2011 -12 పంట కాలంలో ఒక బాయిలర్‌లో చుక్క నీరు కూ డా లేకుండా నడిపించడంతో అది మొత్తం కాలిపోయింది. నిధుల కొరత గత బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన రూ. 120 కోట్లు ఇప్పటి వరకు మంజూరు కాలేదని అధికారులు తెలి పా రు. అయితే చెడిపోయిన బాయిలర్లును నోయిడా కంపెనీకి చెందిన నిపుణులకు చూపించామని, అవసరమున్న పరికరాలను కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు. బడ్జెట్ విషయం మంత్రి వర్గం సమావేశంలో కూడా చర్చలు జరిపారని, అనంతరం రూ. 95 కోట్లు విడుదల చేయడానికి మంత్రి వర్గం అంగీకరించిందని, ఈ నిధు లు కూడా విడుదల కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 1 నుంచి విద్యుత్ యూనిట్ ప్రారంభం 2007లో మైషుగర్ ప్యాక్టరీలో విద్యుత్ యూనిట్‌ను సా్థి పంచారు. ఈ యూనిట్ కేవలం 17 గంటలు మాత్రమే పనిచేసేది. తర్వాత విద్యుత్ లేకుండా పోయేది. ప్రస్తుతం దీనిని కూడా అభివృద్ధి చేస్తున్నట్లు పరిశ్రమ మేనేజింగ్ డెరైక్టర్ మహదేవు తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ నాటికి ప్రతి రోజూ 15 మెగా వాట్ల విద్యుత్ ఉత్పాదన చేసి కర్ణాటక పవర్ కార్పొరేషన్‌కు విక్రయించనున్నట్లు స్పష్టం చేశారు. విడుతల వారీగా విద్యుత్ ఉత్పాదన శక్తి కూడా 30 మెగా వాట్లకు పెంచనున్నట్లు తెలిపారు. -
ఏపీ, తెలంగాణ లలో స్వల్పంగా పెరిగిన చక్కెర ఉత్పత్తి
న్యూఢిల్లీ: 2014-15లో (అక్టోబర్-జనవరి) ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చక్కెర ఉత్పత్తి స్వల్పంగా పెరిగింది. గతేడాది 5.08 లక్షల టన్నులుగా ఉన్న చక్కెర ఉత్పత్తి ఈ ఏడాది 5.61 లక్షల టన్నులకు పెరిగిందని ఇండియన్ షుగర్ మిల్ అసోషియేషన్ (ఐఎస్ఎంఏ) తెలిపింది. చక్కెర ఉత్పత్తిలో మహారాష్ట్ర 30 శాతం వృద్ధితో (54 లక్షల టన్నులు) దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత 21 శాతం వృద్ధి (33.8 లక్షల టన్నులు)తో యూపీ రెండో స్థానంలో నిలిచింది. 22.7 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తితో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో చక్కెర ఉత్పత్తి తగ్గింది.