పంచదార షేర్ల పరుగు... | Sugar production will not exceed 23 MT next year | Sakshi
Sakshi News home page

పంచదార షేర్ల పరుగు...

Published Wed, Jun 15 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

పంచదార షేర్ల పరుగు...

పంచదార షేర్ల పరుగు...

ప్రతి రోజూ గరిష్ట స్థాయిలకు
దేశీయంగా తగ్గుతున్న చక్కెర ఉత్పత్తి
అంతర్జాతీయంగా పెరుగుతున్న ధర
టర్న్ అరౌండ్ అవుతున్న చక్కెర కంపెనీలు

పంచదార కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు లాభాల తీపి చేస్తున్నాయి. కేవలం  ఏడు ట్రేడింగ్ సెషన్లలో పలు కంపెనీల షేర్లు 8-74 శాతం రేంజ్‌లో పెరిగాయి. మంగళవారం స్టాక్ మార్కెట్ కుదేలైనప్పటికీ దాదాపు పది పంచదార షేర్లు కొత్త ఏడాది గరిష్ట స్థాయిలను తాకడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లలో చక్కెర ధరలు పెరగడం, దేశీయంగా ఉత్పత్తి తగ్గడం, పంచదార కంపెనీలు టర్న్ అరౌండ్ కావడం తదితర కారణాల వల్ల షుగర్ స్టాక్స్ దూసుకుపోతున్నాయి. ఏరోజుకారోజు గరిష్టస్థాయిలను తాకుతున్నాయి.

 తగ్గుతున్న ఉత్పత్తి.. పెరుగుతున్న ధరలు
చక్కెర ఉత్పత్తిలో భారత్‌ది ప్రపంచంలోనే రెండో స్థానం. వినియోగంలో మాత్రం మొదటి స్థానమే. 2015-16 షుగర్ సీజన్(అక్టోబర్-సెప్టెంబర్)లో 25 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా.  అంతకు ముందటి షుగర్ సీజన్ ఉత్పత్తి (28.3 మిలియన్ టన్నుల)తో పోల్చితే ఇది 11 శాతం తక్కువ.  2016-17 షుగర్ సీజన్‌లో చక్కెర ఉత్పత్తి 23.5 మిలియన్ టన్నులకు పడిపోయే అవకాశాలున్నాయన్న అంచనాలు కూడా ఉన్నాయి.  

2015-16 మార్కెటింగ్ సంవత్సరం(అక్టోబర్-సెప్టెంబర్) కాలానికి భారత్ 1.4 మిలియ్ టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. చెరకు పండించే కొన్ని ప్రాంతాలు కరువు బారిన పడటంతో చెరుకు దిగుబడి పడిపోయి పంచదార ఉత్పత్తి తగ్గుతోంది. దీంతో ధరలకు రెక్కలు వస్తున్నాయి. 2015 జూలై నుంచి చూస్తే 2016 జూన్ 13 కల్లా టన్ను చక్కెర ధర 50%పైగా పెరిగి రూ.36,500 కు చేరింది.

 టర్న్ అరౌండ్‌లో కంపెనీలు
గత కొన్నేళ్లుగా నష్టాల్లో ఉన్న పలు  షుగర్ కంపెనీలు  ఈ మార్చి క్వార్టర్‌లోనే  టర్న్ అరౌండ్ అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బలరామ్‌పూర్ చిని మీల్స్ రూ.99 కోట్లు, ఆంధ్రా షుగర్స్ రూ.56 కోట్లు, ద్వారకేశ్ షుగర్స్ రూ.39 కోట్లు, థమ్‌పూర్ షుగర్స్ రూ.26 కోట్లు చొప్పున నికర లాభాలు ఆర్జించాయి. ఇక 34 షుగర్ కంపెనీల మొత్తం నికర లాభాలు  గతేడాది రెండో అర్థభాగానికి రూ.1,408 కోట్లుగా ఉన్నాయి. ఇదే ఏడాది మొదటి అర్ధభాగానికి ఈ కంపెనీల మొత్తం నష్టాలు రూ.1.700 కోట్లకు పైమాటే. ఈ కంపెనీలకు 2014-15 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రూ.979 కోట్లు, 2014-15 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో రూ.1,268 కోట్లు చొప్పున నికర నష్టాలు వచ్చాయి.

 ఏడాదిలో రెట్టింపు: ఇక ఈ ఏడాదిలో 9 కంపెనీల షేర్లు రెట్టింపుకు  పైగా పెరిగాయి. అప్పర్ గంగేశ్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్, మావానా షుగర్స్, అవధ్ షుగర్ మిల్స్,  ధరణి షుగర్స్, ద్వారకేశ్ షుగర్ ఇండస్ట్రీస్,  తిరు అరూరన్ షుగర్స్, రాజశ్రీ షుగర్స్, ఉగార్ షుగర్ వ ర్క్స్, ఉత్తమ్ షుగర్  కంపెనీల షేర్లు ఈ  ఏడాదిలో ఇప్పటివరకూ  110-350% వరకూ ఎగిశాయి.

 అంతర్జాతీయ మార్కెట్లోనూ....
అంతర్జాతీయంగా చక్కెర ధరలు 3 నెలలలో 50% వరకూ పెరిగాయి. ప్రపంచంలోనే చక్కెర ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న బ్రెజిల్‌లో పంట ఆలస్యంతో సరఫరాలు తగ్గాయి.  బ్రెజిల్ తర్వాత అత్యధికంగా చక్కెర ఎగుమతి చేసే దేశం థాయ్‌లాండ్ నుంచి సరఫరాలు తగ్గడం, కరువువల్ల ఉత్పత్తి తగ్గి భారత్ నుంచీ సరఫరాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో చక్కెర ధరలు పెరుగుతున్నాయి. వరుసగా రెండో ఏడాదీ అంతర్జాతీయ మార్కెట్లో చక్కెర లోటు ఏర్పడుతుందనే అంచనాలు ధరలను ఎగదోస్తున్నాయి. 2016-17 షుగర్ సీజన్‌లో అంతర్జాతీయంగా చక్కెర లోటు 5.5 మిలియన్ టన్నులుగా ఉండొచ్చనేది రొబొబ్యాంక్  అంచనా. ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్చేంజ్(ఐసీఈ)లో చక్కెర ధరలు గత 2 వారాల్లో 12% పెరిగాయి. ఐసీఈలో జూలై కాంట్రాక్ట్ షుగర్ ఫ్యూచర్స్(ఒక్కో పౌండ్‌కు) 19.34 సెంట్స్ వద్ద ట్రేడవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement