Sugar companies
-
కాకినాడ ప్యారీ షుగర్ కంపెనీలో మరో ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, కాకినాడ: జిల్లాలో వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీలో మరోసారి పేలుడు సంభవించింది. సోమవారం కార్మికులు పనులు చేస్తుండగా.. వాక్యామ్ గడ్డర్ పడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మృతులను సుబ్రహ్మణ్యం, రాం ప్రసాద్‌గా గుర్తించారు. కాగా, వారి మృతితో పరిశ్రమ వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. ఇక, ప్యారీ కంపెనీలో 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రమాదం చోటుచేసుకోవడం కార్మికులను భయాందోళనకు గురిచేసంది. ఇదే పరిశ్రమలో ఆగస్టు 12వ తేదీన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. కాగా, రిఫైనరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కన్వేయర్ బెల్ట్ పేలడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. -
కాకినాడలోని ప్యారీ షుగర్ ఫ్యాక్టరీలో మరో ప్రమాదం
-
చక్కెర షేర్లు.. తియ్యటి ర్యాలీ
న్యూఢిల్లీ: చక్కెర కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు తీపి లాభాలను పంచుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే ఈ స్టాక్స్ మంచి ర్యాలీ చేయగా.. ఇక ముందూ లాభాలను ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్రెజిల్లో చక్కెర సాగు ఆశాజనకంగా లేనందున ధరలు పెరిగి, భారత కంపెనీలకు కలిసొస్తుందని భావిస్తున్నారు. బ్రెజిల్లో ఏప్రిల్ నెలలో పంచదార ఉత్పత్తి దాదాపు 35 శాతం వరకూ తగ్గింది. ఈ మేరకు భారత షుగర్ కంపెనీలకు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. ‘‘బ్రెజిల్ దక్షిణాది ప్రాంతంలో చక్కెర దిగుబడి ఏప్రిల్ నెల మొదటి అర్ధ భాగంలో 6,24,000 టన్నులు. అంతక్రితం ఏడాది ఏప్రిల్‌లో ఇదే కాలంలో ఉత్పత్తి 9,71,000 టన్నులుగా ఉంది. 2020లో ఇదే కాలంతో పోల్చి చూస్తే చెరకు క్రషింగ్ 30 శాతం తగ్గి 15.6 మిలియన్ టన్నులుగా ఉంది’’ అని చక్కెర ఉత్పత్తిదారుల సంఘం యూనికా పేర్కొంది. అదే సమయంలో భారత్‌లో మాత్రం పంచదార ఉత్పత్తి 2020 అక్టోబర్ – 2021 సెప్టెంబర్ సీజన్లో 41 లక్షల టన్నుల మేర పెరగడం గమనార్హం. అన్ని షేర్లదీ పరుగే..: ఆంధ్రా షుగర్స్, ఈఐడీ ప్యారీ, బలరామ్‌పూర్ చినీ, ధంపూర్ షుగర్, దాల్మియా, అవధ్ షుగర్.. ఇవన్నీ కూడా గత ఏడాది కాలంలో అద్భుతమైన రాబడులను ఇచ్చాయి. ప్రధానంగా గత మూడు నెలల్లోనే 50–100 శాతం మధ్య ర్యాలీ చేసి నూతన గరిష్టాలకు చేరాయి. సరఫరా కఠినంగా మారొచ్చు.. పంచదార ఉత్పత్తికి ప్రపంచంలో బ్రెజిల్ అతిపెద్ద మార్కెట్. ఇక్కడి ఉత్పత్తి పరిస్థితులు భారత్ కంపెనీల లాభాలను నిర్ణయించగలవు. బ్రెజిల్లో ఇప్పటికే చెరకు సాగు సీజన్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు దిగుబడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు సానుకూలించకపోవడంతో సాగు తగ్గిందని.. దీనివల్ల దిగుబడితోపాటు నాణ్యత కూడా క్షీణించొచ్చని అంచనా. దీనికితోడు థాయిలాండ్, ఈయూ సైతం చక్కెర ఉత్పత్తిని పెంచకపోవచ్చని.. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్–సరఫరా పరిస్థితులు సానుకూలంగా ఉండకపోవచ్చని ఎలారా సెక్యూరిటీస్ తెలిపింది. సైక్లికల్ కాదు.. భారత్‌లో షుగర్ పరిశ్రమ ధరల పరంగా ఇక ఎంత మాత్రం సైక్లికల్ కాబోదని (హెచ్చుతగ్గులు) జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. పాక్షిక నియంత్రణల నుంచి కూడా బయటకు రావచ్చని భావిస్తున్నట్టు తెలిపింది. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ, చక్కెర రైతులకు చెల్లింపులు సకాలంలో అందేలా చూడాలన్న ఉద్దేశం ఈ రంగానికి ఎంతో మేలు చేస్తుందని అంచనా వేస్తోంది. చక్కెరకు మద్దతు ధరలు, ఎగుమతి సబ్సిడీలు, ఇథనాల్ రూపంలో మద్దతు వంటి చర్యలు ఈ రంగంలోని కంపెనీలు నిలదొక్కుకునేలా చేస్తాయని పేర్కొంది. ఫలితంగా ఈ రంగంలోని పటిష్టమైన కంపెనీలు మరింత లాభాలు, నగదు ప్రవాహాలను చూస్తాయని జేఎం ఫైనాన్షియల్ అంచనా వేసింది. షేర్ల గమనం కంపెనీ ప్రస్తుత ధర 3 నెలల్లో ఏడాదిలో (రూ.లలో) పెరుగుదల(%) పెరుగుదల(%) అవధ్ షుగర్ 306 60 110 దాల్మియా భారత్ 318 98 364 ద్వారికేష్ షుగర్ 56 75 200 బలరామ్‌పూర్ చినీ 303 68 190 ధంపూర్ షుగర్ 318 78 206 -
మార్కెట్లు వీక్- షుగర్ షేర్లు స్వీట్
ముంబై, సాక్షి: లాభాల స్వీకరణ కోసం ట్రేడర్ల అమ్మకాలు, సరికొత్త గరిష్టాలకు చేరడంతో ఇన్వెస్టర్ల అప్రమత్తత వంటి అంశాలతో స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 147 పాయింట్లు క్షీణించి 43,681 వద్ద ట్రేడవుతోంది. అయితే ఆటుపోట్ల మార్కెట్లోనూ ఉన్నట్టుండి చక్కెర తయారీ రంగ కంపెనీలకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో దాదాపు లిస్టెడ్ షుగర్ కంపెనీల షేర్లన్నీ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. కారణాలున్నాయ్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో షుగర్ కంపెనీలు అంచనాలను మించిన ఫలితాలు సాధించాయి. ఇందుకు కంపెనీలు చేపట్టిన వ్యయాల కోత, లాభదాయకత మెరుగుపడటం వంటి అంశాలు సహకరించాయి. ప్రధానంగా క్యూ2(జులై-సెప్టెంబర్)లో నిర్వహణ నగదు లాభాలు పెరగడం, వర్కింగ్ క్యాపిటల్ రుణాలు తగ్గడం చక్కెర కౌంటర్లకు ఆకర్షణను తీసుకువచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. దీనికితోడు డిస్టిల్లరీ విభాగాల నుంచి ఆదాయాలు పుంజుకోవడం చక్కెర పరిశ్రమకు మద్దతిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నాయి. అక్టోబర్ చివర్లో ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ఇథనాల్ ధరలను 2 శాతం పెంచి 6 శాతానికి చేర్చింది. ఈ డిసెంబర్ నుంచి 2021 నవంబర్వరకూ ధరలు అమలుకానున్నాయి. తద్వారా పరిశ్రమలు చక్కెర తయారీ నుంచి ఇథనాల్‌వైపునకు మళ్లే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను మిక్స్ చేసే విషయం విదితమే. ఈ నేపథ్యంలో క్యూ3(అక్టొబర్- డిసెంబర్)లోనూ షుగర్ కంపెనీలు పటిష్ట ఫలితాలు సాధించవచ్చన్న అంచనాలు పెరుగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ అంశాలు షుగర్ రంగ కౌంటర్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నట్లు విశ్లేషించారు. షేర్ల దూకుడు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పలు చక్కెర రంగ కౌంటర్లు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. జాబితాలో కేసీపీ, ఉత్తమ్, అవధ్, ధంపూర్ తదితరాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అవధ్ షుగర్స్ 12.4 శాతం ఎగసి రూ. 206 వద్ద, కేసీపీ 12 శాతం పెరిగి రూ. 17 వద్ద, మగధ్ 12.5 శాతం దూసుకెళ్లి రూ. 116 వద్ద, ఉత్తమ్ 9.5 శాతం జంప్‌చేసి రూ. 99 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో దాల్మియా భారత్ 5.2 శాతం పురోగమించి రూ. 144 వద్ద, ద్వారికేష్ 5 శాతం పుంజుకుని రూ. 30 వద్ద, ధంపూర్ 4 శాతం లాభంతో రూ. 161 వద్ద ఉగర్ షుగర్స్ 5 శాతం లాభపడి రూ. 15 వద్ద కదులుతున్నాయి. ఇదే విధంగా డీసీఎం శ్రీరామ్, శ్రీ రేణుకా షుగర్స్, ఈఐడీ ప్యారీ, మవానా, శక్తి షుగర్స్ తదితర పలు కౌంటర్లు 9-3 శాతం మధ్య బలపడ్డాయి. -
‘తీపి’ తగ్గింది!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నష్టాల ఊబిలో ఉన్న చక్కెర కంపెనీలకు లాక్డౌన్ మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. డిమాండ్ లేకపోవడం, సరఫరా సమస్యలు పరిశ్రమకు కొత్తగా తోడయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా 50 శాతం మేర అమ్మకాలు పడిపోయాయని పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. ఫ్యాక్టరీల వద్ద షుగర్ నిల్వలు పేరుకుపోయాయి. ఆదాయం తగ్గడం, కార్మికుల వేతనాలు, వడ్డీలు.. వెరసి చేతిలో ఉన్న మూలధనం కాస్తా ఆవిరైందని కంపెనీలు అంటున్నాయి. ఇప్పట్లో ఈ రంగం కోలుకోవడం కష్టమేనని కంపెనీల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశవ్యాప్తంగా నెలకు సుమారు 22 లక్షల టన్నుల చక్కెర అమ్ముడవుతోంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం గత సీజన్లో భారత్‌లో 172 మిల్లులు చక్కెర ఉత్పత్తి చేయగా.. ప్రస్తుత సీజన్లో ఈ సంఖ్య 139కి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నష్టాల్లోనే కంపెనీలు.. బస్తా (100 కిలోలు) చక్కెర ఉత్పత్తి వ్యయం ప్రస్తుతం రూ.4,000 పైమాటే. మిల్లుల వద్ద విక్రయ ధర రూ.3,400 ఉంది. అంటే ఒక్కో బస్తాపై కంపెనీలు రూ.600 నష్టం మూటగట్టుకుంటున్నాయి. చిన్న కంపెనీలకైతే∙రూ.700 వరకు నష్టం వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 100 కిలోల బస్తాకు మిల్లు వద్ద అమ్మకం ధర రూ.4,200 ఉంటేనే కంపెనీలు మనగలవని కేసీపీ షుగర్, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి.వెంకటేశ్వర రావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఒకట్రెండు కంపెనీలు మినహా మిగిలినవన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయని చెప్పారు. శానిటైజర్ల తయారీని కొన్ని కంపెనీలు చేస్తున్నప్పటికీ, వీటి ద్వారా వచ్చే ఆదాయం తాత్కాలికమేన న్నారు. రికవరీ ఇప్పట్లో కష్టమే..: కౌలు ధర అధికంగా ఉండడం, కూలీ ఖర్చులు తడిసిమోపెడు అవడం, ఉత్పత్తికి ధర లేకపోవడంతో చెరకు పంట వేయడానికి రైతులు ముందుకు రావడం లేదని వెంకటేశ్వరరావు తెలిపారు. ‘రైతులకు మిల్లులు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయి. దేశంలో అప్పులు లేని కంపెనీలు ఒకట్రెండు మాత్రమే ఉంటాయి. వైరస్ భయానికి ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి కార్మికులు రావడం లేదు. లాక్డౌన్ తదనంతరం తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఆరు నెలలకుపైగా సమయం పడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్యోగుల కోత, వేతనాల కుదింపు తప్పదు. మిల్లు వద్ద విక్రయ ధర పెరిగితే తప్ప ఈ పరిశ్రమ రికవరీ ఇప్పట్లో కనపడడం లేదు’ అని చెప్పారు. అక్టోబర్ నాటికి..: దేశంలో 2019 అక్టోబరు 1 నాటికి 110 లక్షల టన్నుల చక్కెర నిల్వలు ఉన్నాయి. 2019–20 (అక్టోబర్–సెప్టెంబర్) క్రషింగ్ కాలంలో దేశవ్యాప్తంగా 270 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని సమాచారం. ఈ ఏడాది 50–60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి కావచ్చని పరిశ్రమ భావించగా, ఇప్పటికి సుమారు 30 లక్షల టన్నులే ఎగుమతైంది. అంతర్జాతీయంగా తక్కువ ధర, సరఫరా సమస్యల కారణంగా 10 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి ఆగిపోనుందని ఓ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఏడాది అక్టోబరు 1 నాటికి చక్కెర నిల్వలు దేశంలో సుమారు 75 లక్షల టన్నులు ఉంటాయని ఆయన చెప్పారు. -
పంచదార షేర్ల పరుగు...
♦ ప్రతి రోజూ గరిష్ట స్థాయిలకు ♦ దేశీయంగా తగ్గుతున్న చక్కెర ఉత్పత్తి ♦ అంతర్జాతీయంగా పెరుగుతున్న ధర ♦ టర్న్ అరౌండ్ అవుతున్న చక్కెర కంపెనీలు పంచదార కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు లాభాల తీపి చేస్తున్నాయి. కేవలం ఏడు ట్రేడింగ్ సెషన్లలో పలు కంపెనీల షేర్లు 8-74 శాతం రేంజ్లో పెరిగాయి. మంగళవారం స్టాక్ మార్కెట్ కుదేలైనప్పటికీ దాదాపు పది పంచదార షేర్లు కొత్త ఏడాది గరిష్ట స్థాయిలను తాకడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లలో చక్కెర ధరలు పెరగడం, దేశీయంగా ఉత్పత్తి తగ్గడం, పంచదార కంపెనీలు టర్న్ అరౌండ్ కావడం తదితర కారణాల వల్ల షుగర్ స్టాక్స్ దూసుకుపోతున్నాయి. ఏరోజుకారోజు గరిష్టస్థాయిలను తాకుతున్నాయి. తగ్గుతున్న ఉత్పత్తి.. పెరుగుతున్న ధరలు చక్కెర ఉత్పత్తిలో భారత్‌ది ప్రపంచంలోనే రెండో స్థానం. వినియోగంలో మాత్రం మొదటి స్థానమే. 2015-16 షుగర్ సీజన్(అక్టోబర్-సెప్టెంబర్)లో 25 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా. అంతకు ముందటి షుగర్ సీజన్ ఉత్పత్తి (28.3 మిలియన్ టన్నుల)తో పోల్చితే ఇది 11 శాతం తక్కువ. 2016-17 షుగర్ సీజన్లో చక్కెర ఉత్పత్తి 23.5 మిలియన్ టన్నులకు పడిపోయే అవకాశాలున్నాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. 2015-16 మార్కెటింగ్ సంవత్సరం(అక్టోబర్-సెప్టెంబర్) కాలానికి భారత్ 1.4 మిలియ్ టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. చెరకు పండించే కొన్ని ప్రాంతాలు కరువు బారిన పడటంతో చెరుకు దిగుబడి పడిపోయి పంచదార ఉత్పత్తి తగ్గుతోంది. దీంతో ధరలకు రెక్కలు వస్తున్నాయి. 2015 జూలై నుంచి చూస్తే 2016 జూన్ 13 కల్లా టన్ను చక్కెర ధర 50%పైగా పెరిగి రూ.36,500 కు చేరింది. టర్న్ అరౌండ్‌లో కంపెనీలు గత కొన్నేళ్లుగా నష్టాల్లో ఉన్న పలు షుగర్ కంపెనీలు ఈ మార్చి క్వార్టర్‌లోనే టర్న్ అరౌండ్ అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బలరామ్‌పూర్ చిని మీల్స్ రూ.99 కోట్లు, ఆంధ్రా షుగర్స్ రూ.56 కోట్లు, ద్వారకేశ్ షుగర్స్ రూ.39 కోట్లు, థమ్‌పూర్ షుగర్స్ రూ.26 కోట్లు చొప్పున నికర లాభాలు ఆర్జించాయి. ఇక 34 షుగర్ కంపెనీల మొత్తం నికర లాభాలు గతేడాది రెండో అర్థభాగానికి రూ.1,408 కోట్లుగా ఉన్నాయి. ఇదే ఏడాది మొదటి అర్ధభాగానికి ఈ కంపెనీల మొత్తం నష్టాలు రూ.1.700 కోట్లకు పైమాటే. ఈ కంపెనీలకు 2014-15 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రూ.979 కోట్లు, 2014-15 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో రూ.1,268 కోట్లు చొప్పున నికర నష్టాలు వచ్చాయి. ఏడాదిలో రెట్టింపు: ఇక ఈ ఏడాదిలో 9 కంపెనీల షేర్లు రెట్టింపుకు పైగా పెరిగాయి. అప్పర్ గంగేశ్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్, మావానా షుగర్స్, అవధ్ షుగర్ మిల్స్, ధరణి షుగర్స్, ద్వారకేశ్ షుగర్ ఇండస్ట్రీస్, తిరు అరూరన్ షుగర్స్, రాజశ్రీ షుగర్స్, ఉగార్ షుగర్ వ ర్క్స్, ఉత్తమ్ షుగర్ కంపెనీల షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 110-350% వరకూ ఎగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ.... అంతర్జాతీయంగా చక్కెర ధరలు 3 నెలలలో 50% వరకూ పెరిగాయి. ప్రపంచంలోనే చక్కెర ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న బ్రెజిల్లో పంట ఆలస్యంతో సరఫరాలు తగ్గాయి. బ్రెజిల్ తర్వాత అత్యధికంగా చక్కెర ఎగుమతి చేసే దేశం థాయ్‌లాండ్ నుంచి సరఫరాలు తగ్గడం, కరువువల్ల ఉత్పత్తి తగ్గి భారత్ నుంచీ సరఫరాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో చక్కెర ధరలు పెరుగుతున్నాయి. వరుసగా రెండో ఏడాదీ అంతర్జాతీయ మార్కెట్లో చక్కెర లోటు ఏర్పడుతుందనే అంచనాలు ధరలను ఎగదోస్తున్నాయి. 2016-17 షుగర్ సీజన్లో అంతర్జాతీయంగా చక్కెర లోటు 5.5 మిలియన్ టన్నులుగా ఉండొచ్చనేది రొబొబ్యాంక్ అంచనా. ఇంటర్కాంటినెంటల్ ఎక్స్చేంజ్(ఐసీఈ)లో చక్కెర ధరలు గత 2 వారాల్లో 12% పెరిగాయి. ఐసీఈలో జూలై కాంట్రాక్ట్ షుగర్ ఫ్యూచర్స్(ఒక్కో పౌండ్‌కు) 19.34 సెంట్స్ వద్ద ట్రేడవుతోంది. -
చక్కెర రవాణాకు సౌకర్యాల కల్పన
షోలాపూర్, న్యూస్‌లైన్: పంచదార రవాణాకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని షుగర్ కంపెనీల వారికి సెంట్రల్ రైల్వే షోలాపూర్ డివిజన్ అధికారులు హామీ ఇచ్చారు. షోలాపూర్ డివిజన్ కార్యాలయంలో బుధవారం రైల్వే అధికారులు, షుగర్ ఫ్యాక్టరీల యజమానులు, కాంట్రాక్టర్ల అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చక్కెర రవాణా సమయంలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. చక్కెర ఫ్యాక్టరీల నుంచి రైల్వే స్టేషన్ వరకు సరుకు రవాణా సమయంలో రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి సమస్యలు ఎదురవుతున్నాయని సభ్యులు తెలిపారు. దాంతో సమస్యల పరిష్కారానికి తాము వెంటనే చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డివిజన్ చీఫ్ జాన్ థామస్, డిప్యూటీ అధికారి కె. మధుసూదన్, అశోక్ వర్మ, వాణిజ్య విభాగం అధికారులు మదన్‌లాల్ మీనా, ఐ. భాస్కర్‌రావుతోపాటు విఠల్‌రావు షిండే షుగర్ ఫ్యాక్టరీ, లోక మంగళ ఫ్యాక్టరీ, డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫ్యాక్టరీ, వికాస్ సహకార ఫ్యాక్టరీ తదితర షుగర్ ఫ్యాక్టరీల ప్రతినిధులు, అహమ్మద్ నగర్, బేలాపూర్, గుల్బర్గా, షోలాపూర్ గుత్తేదార్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, ఈ యేడు చెరుకు క్రషింగ్ సీజన్లో సరుకు రవాణా ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదించాలనే యోచనలో రైల్వే యంత్రాంగం ఉంది.పంచదార లోడింగ్ అత్యధికంగా చేసుకునేందుకుగాను రైల్వే అధికారులు షుగర్ ఫ్యాక్టరీల వారిని ప్రత్యక్షంగా కలుసుకొంటున్నారు. ప్రస్తుతం షోలాపూర్ డివిజన్‌కు సంబంధించి ప్రయాణికుల రాకపోకల ద్వారా లభించే ఆదాయం కాస్త మందగించింది. ఈ లోటును పంచదార రవాణా ద్వారా పూడ్చుకోవాలని రైల్వే యంత్రాంగం భావిస్తోంది. ఇక్కడి నుంచి బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, జమ్ము తదితర రాష్ట్రాలకు రైల్వే ద్వారా పంచదార రవాణా అవుతుంది. ఈ సంవత్సరం చెరుకు విస్తారంగా పండింది. దీంతో పంచదార ఉత్పత్తులు భారీగా ఉండే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. గత యేడాది కంటే ఈ ఏడాది పంచదార రవాణా ద్వారా 15 శాతం అధిక ఆదాయం లక్ష్యంగా వారు కార్యాచరణ చేపడుతున్నారు.