షోలాపూర్, న్యూస్‌లైన్: పంచదార రవాణాకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని షుగర్ కంపెనీల వారికి సెంట్రల్ రైల్వే షోలాపూర్ డివిజన్ అధికారులు హామీ ఇచ్చారు. షోలాపూర్ డివిజన్ కార్యాలయంలో బుధవారం రైల్వే అధికారులు, షుగర్ ఫ్యాక్టరీల యజమానులు, కాంట్రాక్టర్ల అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చక్కెర రవాణా సమయంలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు.
చక్కెర ఫ్యాక్టరీల నుంచి రైల్వే స్టేషన్ వరకు సరుకు రవాణా సమయంలో రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి సమస్యలు ఎదురవుతున్నాయని సభ్యులు తెలిపారు. దాంతో సమస్యల పరిష్కారానికి తాము వెంటనే చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో డివిజన్ చీఫ్ జాన్ థామస్, డిప్యూటీ అధికారి కె. మధుసూదన్, అశోక్ వర్మ, వాణిజ్య విభాగం అధికారులు మదన్‌లాల్ మీనా, ఐ. భాస్కర్‌రావుతోపాటు విఠల్‌రావు షిండే షుగర్ ఫ్యాక్టరీ, లోక మంగళ ఫ్యాక్టరీ, డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫ్యాక్టరీ, వికాస్ సహకార ఫ్యాక్టరీ తదితర షుగర్ ఫ్యాక్టరీల ప్రతినిధులు, అహమ్మద్ నగర్, బేలాపూర్, గుల్‌బర్గా, షోలాపూర్ గుత్తేదార్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, ఈ యేడు చెరుకు క్రషింగ్ సీజన్‌లో సరుకు రవాణా ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదించాలనే యోచనలో రైల్వే యంత్రాంగం ఉంది.పంచదార లోడింగ్ అత్యధికంగా చేసుకునేందుకుగాను రైల్వే అధికారులు షుగర్ ఫ్యాక్టరీల వారిని ప్రత్యక్షంగా కలుసుకొంటున్నారు. ప్రస్తుతం షోలాపూర్ డివిజన్‌కు సంబంధించి ప్రయాణికుల రాకపోకల ద్వారా లభించే ఆదాయం కాస్త మందగించింది.
ఈ లోటును పంచదార రవాణా ద్వారా పూడ్చుకోవాలని రైల్వే యంత్రాంగం భావిస్తోంది. ఇక్కడి నుంచి బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, జమ్ము తదితర రాష్ట్రాలకు రైల్వే ద్వారా పంచదార రవాణా అవుతుంది. ఈ సంవత్సరం చెరుకు విస్తారంగా పండింది. దీంతో పంచదార ఉత్పత్తులు భారీగా ఉండే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. గత యేడాది కంటే ఈ ఏడాది పంచదార రవాణా ద్వారా 15 శాతం అధిక ఆదాయం లక్ష్యంగా వారు కార్యాచరణ చేపడుతున్నారు.
చక్కెర రవాణాకు సౌకర్యాల కల్పన
Published Wed, Nov 12 2014 10:44 PM | Last Updated on Mon, Oct 22 2018 8:37 PM
Advertisement
Advertisement