సీనియర్ సిటిజన్లు, పిల్లల కోసం
కమల్ ప్రతిష్టాన్, పద్మశాలీ సఖీ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
ఆటపాటలతో ఉల్లాసంగా గడిపిన వృద్ధులు,
ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు
సోలాపూర్: ‘సాధారణంగా పిల్లలు ఆడుకుంటే పెద్దలు చూసి సంతోషిస్తారు. కానీ ఈరోజు మేం ఆటపాటలతో గడుపుతుంటే పిల్లలు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరచడం మాకెంతో ఆనందాన్నిచ్చింది’ అని పలువురు సీనియర్ సిటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. పట్టణంలోని పద్మ కమల్ ప్రతిష్టాన్, పద్మశాలీ సఖీ సంఘం ఆధ్వర్యంలో‘బాల్యం అనుభూతులు నెమరు వేసుకోవడం‘అనే పేరుతో సీనియర్ మహిళలు, బాలల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించారు. తమకు పెళ్లిళ్లై 35 నుంచి 40 సంవత్సరాలు పూర్తయ్యాయని, కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు , మనవళ్లు, మనవరాళ్ళు ఇలా అందరినీ మరిచి ఈ వయసులో మళ్లీ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకునే అవకాశం కల్పించినందుకు పద్మ కమల్ ప్రతిష్టాన్, పద్మశాలీ సఖీ సంఘం సభ్యులు కృతజ్ఞతలు చెబుతున్నామని పేర్కొన్నారు.
శ్రీ మార్కండేయ సోషల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరీ శంకర్ కొండ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మశాలి సఖీ సంఘం అధ్యక్షురాలు మేఘ ఇట్టం ముందుగా ప్రాస్తావికోఉపన్యాసం చేస్తూ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని గురించి వివరించారు. పద్మ కమల్ ప్రతిష్టాన్ వ్యవస్థాపకుడు గోపీకృష్ణ వడ్డేపల్లి తన చిన్ననాటి జ్ఞాపకాలను అందరితో పంచుకోగా, దయానంద్ కొండ బత్తిని,స్నేహల్ శిందే , ఛత్రపతి అఖేన్, తదితరులు తాము చిన్ననాడు ఆడిన ఆటల గురించి, తమ అనుభవాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా మ్యూజికల్ చైర్ పోటీ నిర్వహించి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళలు, పురుషుల బృందాలకు పద్మావతి సంఘ, రేణుక చింత, మంజుల ఆడం, కళ చెన్నపట్నం, వనిత సురా, పద్మ మేడిపల్లి తదితరులు బహుమతులను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment