కొత్త ప్రభుత్వం వచ్చే వరకూ ఇంతేనేమో!
న్యూఢిల్లీ: దేశీయ కార్ల అమ్మకాలు నవంబర్లో 8 శాతం తగ్గాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్) డిప్యూటీ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ మంగళవారం తెలిపారు. పండుగల సీజన్ ముగియడంతో అమ్మకాలు తగ్గాయని పేర్కొన్నారు. పండుగల సీజన్లో ఉన్నంతగా నవంబర్లో వాహన విక్రయాలుండవని అంచనా వేశామని, అందుకు తగ్గట్లుగానే అమ్మకాలు పడిపోయాయని వివరించారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకూ పరిస్థితుల్లో మార్పుండకపోవచ్చని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి అద్భుత చర్యలు తీసుకోలేదని అభిప్రాయపడ్డారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం....,
గత నవంబర్లో 1,55,535 కార్లు అమ్ముడవగా, ఈ ఏడాది నవంబర్లో 1,42,849 కార్లు విక్రయమయ్యాయి. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 8,67,508 నుంచి 1 శాతం వృద్ధితో 8,80,015కు పెరిగాయి. స్కూటర్ల అమ్మకాలు 2,44,414 నుంచి 25 శాతం వృద్ధి చెంది 3,05,586కు పెరిగాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 61,403 నుంచి 29 శాతం క్షీణించి 43,730కు తగ్గాయి. మొత్తం మీద గత నవబర్లో 15,12,869గా ఉన్న మొత్తం వాహనాల అమ్మకాలు 0.90 శాతం వృద్ధితో ఈ ఏడాది నవంబర్లో 15,26,438కు చేరాయి.
వడ్డీరేట్లు, ఇంధనం ధరలు పెరుగుతుండడం, ప్రస్తుత అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, వినియోగదారుల సెంటిమెంట్ తక్కువగా ఉండడం వంటి అంశాలు వాహనాల డిమాండ్, అమ్మకాలపై ప్రభావం చూపాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్ అమ్మకాలు 4% చొప్పున తగ్గాయి. టాటా మోటార్స్ అమ్మకాలు 42% పడిపోయాయి. హోండా అమేజ్ కారు కారణంగా హోండా కార్స్ ఇండియా విక్రయాలు మాత్రం 151 % పెరిగాయి.