కోర్టుకు హాజరైన సుజనా ఎండీ
హైదరాబాద్: మారిషస్ బ్యాంకు నుంచి రుణం తీసుకొని మోసం చేసిన కేసులో సుజనా యూనివర్శిల్ ఇండస్ట్రీస్ ఎండీ శ్రీనివాసరాజు, డైరెక్టర్ హనుమంతరావులు మంగళవారం నాంపల్లి 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. పార్లమెంట్ సభ్యునిగా ఢిల్లీలో అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కారణంగా సుజనా చౌదరి హాజరు కాలేకపోయారని, ఆయన హాజరునకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు.
అయితే తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు ఆదేశించినా హాజరుకానందున బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని, ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులను మారిషస్ బ్యాంకు తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఇదిలా ఉండగా నిందితుల తరఫున ప్రతినిధులు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ ఈ సందర్భంగా వారి తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణను కోర్టు ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. అలాగే నిందితులు రూ.50 వేల చొప్పున పూచీకత్తు బాండ్లను సమర్పించాలని ఆదేశించింది.