sujay krihshna ranga rao
-
భగ్గుమన్న అన్నదాత
విజయనగరం మున్సిపాలిటీ : రుణమాఫీ, రీషెడ్యూల్‌పై చంద్రబాబు అనుసరిస్తున్న మోసపూరిత విధానంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు, రైతులు, మహిళలు రెండవ రోజు శుక్రవారం కూడా జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అటు రైతులను, ఇటు డ్వాక్రా మహిళలను దగా చేస్తున్న చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. బొబ్బిలిలో ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణరంగారావు ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వరకు భారీ ర్యాలీగా వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు , కార్యకర్తలు అక్కడ మానవహారం నిర్వహించారు. అనంతరం నరకాసుర వధ పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సుజయ్‌కృష్ణరంగరావు మాట్లాడుతూ ఒక్క పైసా కూడా కట్టకూడదని ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన చంద్రబాబు గద్దెనెక్కిన తరువాత సరైన విధివిధానాలు, స్పష్టత లేకుండా ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రుణమాఫీపై మొదటి సంతకం చేసి దానిని అమలు చేయడం మానేసి కమిటీలు వేసి కాలయాపన చేయడం ఎక్కడా చూడలేదన్నారు. పూసపాటిరేగ మండలంలో స్థానిక నాయకుడు పతివాడ అప్పలనాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, అంబళ్ల శ్రీరాములునాయుడు పాల్గొన్నారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లే జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించి, చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పెనుమత్స మాట్లాడుతూ చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నారని ఆరోపించారు. భోగాపురం మండల పార్టీ కన్వీనర్ దారపులక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ జంక్షన్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. గజపతినగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల జంక్షన్లో జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. అంతకు ముందు ర్యాలీగా వచ్చిన పార్టీ నాయకులు , కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ రాస్తా రోకో నిర్వహించారు. అనంతరం చం ద్రబాబు దిష్టిబొమ్మను దగ్దం చేశారు. చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బెల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చీపురుపల్లి మండలం దేవరాపొదిలాం గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గుర్ల మండలంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఆ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం పాలకొండ, విజయనగరం ప్రధా న రహదారిపై ఆందోళన నిర్వహించారు. దీంతో సుమారు అరగంట సేపు రహదారి ట్రాఫిక్ నిలిచిపోయింది. బలిజిపేటలో చంద్రబాబు దిష్టబొమ్మతో నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాలురు పట్టణంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అరగంటకు పైగా వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈసందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు.సీతానగరంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు. ఎస్.కోట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్చార్జ్ నెక్కల నాయుడుబాబు ఆధ్వర్యంలో కొత్తవలస ప్రధాన జంక్షన్లో ఆందోళన నిర్వహించారు. అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులు, కర్రలతోకొట్టి బుద్ధిచెప్పి, దహనం చేశారు. జియ్యమ్మవలస మండల కేంద్రంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మూడడ్ల గౌరీశంకరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. గుమ్మలక్ష్మీపురంలో పార్టీ మండల కన్వినర్ తోయక గోపాల్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంపెక్స్ ఆవరణలోని నారాచంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రైతు పక్షపాతి చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. -
రేపటి నుంచి జగన్ జనభేరి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకూ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్‌కృష్ణ రంగారావు తెలిపారు. వాస్తవానికి గురువారం నుంచి(27వ తేదీన) ప్రారంభం కావల్సి ఉన్నా విశాఖలో సకాలంలో పర్యటన పూర్తి కాకపోవడంతో జిల్లా పర్యటన ఒక రోజు వాయిదా పడిందని తెలిపారు. దీంతో 28 నుంచి పర్యటన ప్రారంభమవుతుందన్నారు. తొలి రోజు విజయనగరం పట్టణంలో రోడ్‌షో జరగనుంది. అదే రోజు సాయంత్రం నెల్లిమర్ల నియోజకవర్గంలోకి రోడ్‌షో ప్రవేశిస్తుంది. 29న నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో పర్యటన సాగుతుంది. 30వ తేదీ షెడ్యూల్ పరిస్థితులకు అనుగుణంగా ప్రకటించనున్నట్టు చెప్పారు. విజయనగరం రోడ్ షో తాత్కాలిక రూట్ మ్యాప్ ఇదీ.. వైఎస్ఆర్ జనభేరిలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న ఉదయం 10గంటలకు విజయనగరంలోని ఎత్తుబ్రిడ్జికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభం కానుంది. ఆర్అండ్బీ, కలెక్టరేట్, బాలాజీ టెక్స్టైల్ మార్కెట్ మీదుగా వైఎస్సార్ జంక్షన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఎన్సీఎస్, ఎమ్మా ర్వో కార్యాలయం, బొడ్డు వారి జంక్షన్, బుచ్చన్నకోనేరు మీదుగా నాగవంశపు సంక్షేమ సంఘం జంక్షన్‌కు రోడ్‌షో చేరుకోనుంది. అక్కడి నుంచి పుత్సల వీధి, కాళ్ల నాయుడు మందిరం జంక్షన్, ఉల్లివీధి, పాలి ష్టర్ హౌస్ మీదగా కన్యకాపరమేశ్వరి ఆలయం వద్దకు చేరుకుంటుంది.అనంతరం గంట స్తంభం, రంజనీ థియేటర్( వయా సత్య జూనియర్ కళాశాల) మీదుగా కోట జంక్షన్‌కు చేరుకోనుంది. అక్కడి నుంచి మూడు లాంతర్లు, అంబటిసత్రం, కొత్తపేట, పూల్‌బాగ్ మీదుగా నెల్లిమర్ల వరకు కొనసాగనుంది. -
'సబ్బం హరి మా పార్టీ వ్యక్తి కాదు'
విశాఖ: అనకాపల్లి ఎంపీ సబ్బం హరి తమ పార్టీ వ్యక్తి కాదని వైఎస్సార్ సీపీ నేత సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. సబ్బం హరి వైఎస్సార్ సీపీపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సబ్బం వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. వైఎస్సార్ సీపీ పార్టీ కోసం వ్యాఖ్యానించాల్సిన అవసరం సబ్బం హరికి లేదని రంగారావు తెలిపారు. ఎవరైనా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను అనుసరించాల్సిందేనని సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంతో బలంగా ఉందన్న విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. అక్టోబర్ 1, 2వ తేదీల్లో విస్తృత సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ కార్యక్రమాలు ఉంటాయన్నారు. అంతకుముందు సబ్బం వ్యాఖ్యలపై శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై సబ్బం హరి చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయనకు తమ పార్టీలో సభ్యత్వం లేదని, ఎలాంటి బాధ్యతలు లేవని స్పష్టం చేశారు. ఆయన పార్టీలోకి రావాలనుకున్నారని కానీ కాంగ్రెస్ కుట్రలో భాగంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సబ్బం హరి వ్యాఖ్యలు తమ పార్టీ అధ్యక్షుడు జగన్ సహా తామందరినీ బాధించాయని తెలిపారు.