
రేపటి నుంచి జగన్ జనభేరి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకూ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్‌కృష్ణ రంగారావు తెలిపారు.
వాస్తవానికి గురువారం నుంచి(27వ తేదీన) ప్రారంభం కావల్సి ఉన్నా విశాఖలో సకాలంలో పర్యటన పూర్తి కాకపోవడంతో జిల్లా పర్యటన ఒక రోజు వాయిదా పడిందని తెలిపారు. దీంతో 28 నుంచి పర్యటన ప్రారంభమవుతుందన్నారు. తొలి రోజు విజయనగరం పట్టణంలో రోడ్‌షో జరగనుంది. అదే రోజు సాయంత్రం నెల్లిమర్ల నియోజకవర్గంలోకి రోడ్‌షో ప్రవేశిస్తుంది. 29న నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో పర్యటన సాగుతుంది. 30వ తేదీ షెడ్యూల్ పరిస్థితులకు అనుగుణంగా ప్రకటించనున్నట్టు చెప్పారు.
విజయనగరం రోడ్ షో తాత్కాలిక రూట్ మ్యాప్ ఇదీ..
వైఎస్‌ఆర్ జనభేరిలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 28న ఉదయం 10గంటలకు విజయనగరంలోని ఎత్తుబ్రిడ్జికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభం కానుంది. ఆర్‌అండ్‌బీ, కలెక్టరేట్, బాలాజీ టెక్స్‌టైల్ మార్కెట్ మీదుగా వైఎస్సార్ జంక్షన్‌కు చేరుకుంటుంది.
అక్కడి నుంచి ఎన్‌సీఎస్, ఎమ్మా ర్వో కార్యాలయం, బొడ్డు వారి జంక్షన్, బుచ్చన్నకోనేరు మీదుగా నాగవంశపు సంక్షేమ సంఘం జంక్షన్‌కు రోడ్‌షో చేరుకోనుంది. అక్కడి నుంచి పుత్సల వీధి, కాళ్ల నాయుడు మందిరం జంక్షన్, ఉల్లివీధి, పాలి ష్టర్ హౌస్ మీదగా కన్యకాపరమేశ్వరి ఆలయం వద్దకు చేరుకుంటుంది.అనంతరం గంట స్తంభం, రంజనీ థియేటర్( వయా సత్య జూనియర్ కళాశాల) మీదుగా కోట జంక్షన్‌కు చేరుకోనుంది. అక్కడి నుంచి మూడు లాంతర్లు, అంబటిసత్రం, కొత్తపేట, పూల్‌బాగ్ మీదుగా నెల్లిమర్ల వరకు కొనసాగనుంది.