విశాఖ: అనకాపల్లి ఎంపీ సబ్బం హరి తమ పార్టీ వ్యక్తి కాదని వైఎస్సార్ సీపీ నేత సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. సబ్బం హరి వైఎస్సార్ సీపీపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సబ్బం వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. వైఎస్సార్ సీపీ పార్టీ కోసం వ్యాఖ్యానించాల్సిన అవసరం సబ్బం హరికి లేదని రంగారావు తెలిపారు. ఎవరైనా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను అనుసరించాల్సిందేనని సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంతో బలంగా ఉందన్న విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. అక్టోబర్ 1, 2వ తేదీల్లో విస్తృత సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ కార్యక్రమాలు ఉంటాయన్నారు.
అంతకుముందు సబ్బం వ్యాఖ్యలపై శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై సబ్బం హరి చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయనకు తమ పార్టీలో సభ్యత్వం లేదని, ఎలాంటి బాధ్యతలు లేవని స్పష్టం చేశారు. ఆయన పార్టీలోకి రావాలనుకున్నారని కానీ కాంగ్రెస్ కుట్రలో భాగంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సబ్బం హరి వ్యాఖ్యలు తమ పార్టీ అధ్యక్షుడు జగన్ సహా తామందరినీ బాధించాయని తెలిపారు.