
పెదగంట్యాడ (గాజువాక): అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి పబ్బం గడుపుకున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలో రూ.3 కోట్ల విలువైన 212 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. శనివారం ధర్మశ్రీ పెదగంట్యాడలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..
► కేవలం 5 అడుగుల స్థలంలో బాత్‌రూమ్ మాత్రమే నిర్మించామని సబ్బం చెప్పడం విడ్డూరంగా ఉంది.
► ఆక్రమణను తొలగిస్తామని జీవీఎంసీ అధికారులు పలుమార్లు నోటీసులు ఇస్తే.. వాటిని ఆయన బేఖాతరు చేశారు. సబ్బం మేయర్‌గా ఉన్న సమయంలోనే సీతమ్మధారలో స్థలం కొనుగోలు చేసి.. తర్వాత ఆ స్థలం వెనుక ఉన్న పార్కు స్థలాన్ని ఆక్రమించారు.అది ప్రభుత్వ స్థలమని అప్పట్లోనే వామపక్షాలు ఆందోళనలు చేశాయి. అప్పుడు అధికారంలో ఉన్న సబ్బం రికార్డులను టాంపరింగ్ చేశారు.