‘రైతు సంఘాలతో చర్చించాలి’
చండీగఢ్ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా మూడు వ్యవసాయ చట్టాలపై నిరసన పెల్లుబుకుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిష్కారానికి చొరవచూపడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రంతో ఈ అంశంపై చర్చలు జరిపేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఢిల్లీకి వెళ్లాలని కోరారు. రైతాంగ ప్రయోజనాలకు విఘాతం కల్పించే చట్టాలపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని బాదల్ మండిపడ్డారు.
దీర్ఘకాలంగా బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న అకాలీదళ్ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. విపక్షాల వ్యతిరేకత మధ్య మూడు వ్యవసాయ బిల్లులను గత నెల పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టాలు రైతు వ్యతిరేకమని విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పంజాబ్, హరియాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కాగా, వ్యవసాయ బిల్లులపై చర్చించేందుకు గతవారం కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని పలు రైతు సంఘాలు తోసిపుచ్చాయి. వ్యవసాయ శాఖ అధికారి నుంచి చర్చల కోసం తమకు పిలుపు వచ్చిందని కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన ఆహ్వానం అందితే చర్చలకు సిద్ధమని ఆందోళన చేపట్టిన రైతు సంఘాలు పేర్కొన్నాయి. చదవండి : భార్య రాజీనామా వెనుక భర్త వ్యూహం..!