Sullurupet
-
రూ.300 కోట్ల విలువజేసే భూములు కబ్జా..!
చెన్నై – కోల్కత్తా జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సూళ్లూరుపేటకు ఒక వైపు అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్, మరోవైపు ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో పేరొందిన పరిశ్రమలున్నాయి. ఒక్కసారిగా ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అంతే భూ బకాసురులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలను కాజేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.300 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గడిచిన ఐదేళ్ల కాలంలో పచ్చదండు దోపిడీకి అంతేలేకుండా పోయింది. సాక్షి, సూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలో టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు బరితెగించారు. ప్రభుత్వ భూముల్ని స్వాహా చేసేశారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు యథేచ్చగా ఆక్రమించేస్తున్నా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు తమకేం పట్టనట్టుగా వ్యవహరించారు. అర్హత లేని చాలామంది గత ప్రభుత్వ హయాంలో దర్జాగా పట్టాలు తీసుకున్న ఘనులున్నారు. సూళ్లూరుపేట పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. దీంతో పట్టణంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు దందాకు అంతేలేకుండా పోయింది. చాలామంది కొంతమేర పొలం కొనుగోలుచేసి భారీగా అసైన్మెంట్ భూములను కలుపుకుని ప్లాట్లు వేసిన దర్జాగా విక్రయించేశారు. 125 ఎకరాలు అధికారుల అంచనా మేరకు సూళ్లూరుపేట మున్సిపల్ పరిధిలో సుమారు రూ.300 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే రెండు చెరువులు, మూడు గుంటలు కలిపి సుమారుగా 125 ఎకరాలు కబ్జాకోరల్లో ఉన్నాయి. టీడీపీ పరిపాలనలో ఉన్నప్పుడే కబ్జాకు గురయ్యాయి. ప్రస్తుతం పట్టణం నడిబొడ్డున ఉన్న ఎర్రబాళెం చెరువు 90 శాతానికి పైగా అంటే సుమారు 30 నుంచి 40 ఎకరాలు వరకు కబ్జాకు గురైం ది. మున్సి పాలిటీ పరిధి లోని 69.50 ఎకరాల పడమటికండ్రిగ చెరువు కూడా పూర్తిగా అన్యాక్రాంతమైంది. దీనికి క్రయ, విక్రయాలు కూడా జరిగిపోతున్నాయి. అదే విధంగా పట్టణంలోని దశబృందం గుంత, స్వతంత్రపురంలో ఒక గుంత, కోళ్లమిట్టలో మరో గుంతతోపాటు మంచినీటి గుంతలన్నీ కబ్జాకోరుల్లో చిక్కుకున్నాయి. పట్టణ పరిధిలో సుమారు 29 లేఅవుట్లు వేశారు. దీనికి పదిశాతం భూమి మున్సిపాలిటీకి వదలకపోగా ఆ వెంచర్‌కు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమినే మింగేసిన ఘనులున్నారు. పందలగుంట ప్రాంతంలో సుమారు 25 ఎకరాలకు పైగా అసైన్‌భూములు భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయి. ముడుపులు తీసుకుని.. గత ప్రభుత్వంలో వందలాది ఎకరాలు కబ్జా అయినా రెవెన్యూ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ముడుపులు తీసుకుని వదిలేసిన సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. మున్సిపాలిటీ లెక్కల ప్రకారం 17.74 ఎకరాల రిజర్వ్‌సైట్స్ అధికారికంగా ఉన్నాయి. బందిలదొడ్డి, కళాక్షేత్రం, మన్నారుపోలూరు మిట్టలు లాంటి పొలాలను సెక్యూర్ చేశారు. పడమటకండ్రిగ, ఎరబాళెం చెరువుల ఆక్రమణలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పడమటికండ్రిగ చెరువును డంపింగ్‌యార్డుకు ఎంపిక చేసేందుకు మాజీ చైర్పర్సన్ నూలేటి విజయలక్ష్మి ప్రయత్నించగా అప్పటి టీడీపీ నాయకుల నుంచి ఒత్తిడి రావడంతో ఈ ప్రయత్నాన్ని మానుకున్నారు. ఆక్రమణల చెరలో ఉన్న భూములను వెలికితీసి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చర్యలు తీసుకుంటాం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయమై రెవెన్యూ అధికారులతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటాం. ఆక్రమణల విషయం మా దృష్టిలో ఉంది. ఎక్కడెక్కడ ఎంత ఆక్రమణలకు గురైందో నివేదిక తయారుచేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. ముఖ్యంగా పడమటకండ్రిగ, ఎరబాళెం చెరువు ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. –నరేంద్రకుమార్, కమిషనర్, సూళ్లూరుపేట -
సగటూరు వద్ద ముగిసిన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, నెల్లూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రాత్రి సగుటూరు వద్ద 71వ రోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. ఆయన ఇవాళ ఉదయం నాయుడుపేట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. తుమ్మూరు, వెంకటగిరి క్రాస్, కొత్తపేట క్రాస్, పున్నేపల్లి, నెమళ్లపూడి వరకూ సాగింది. భోజన విరామం అనంతరం ఆయన ప్రజాసంకల్పయాత్రను పునఃప్రారంభించారు. ఆ తర్వాత మానవాళి క్రాస్ రోడ్డు, కర్రబల్లవోలు మీదగా వడ్డెపాలెం చేరుకున్నారు. అక్కడ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఆవిష్కరణతో పాటు, పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. సగుటూరు వద్ద ఆయన పాదయాత్రను ముగించారు. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 951.3 కిలోమీటర్లు నడిచారు. -
సూళ్లురుపేటలో టీడీపీకి షాక్
సాక్షి, నెల్లూరు : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, సూళ్ళూరు పేట మున్సిపల్ కౌన్సిలర్ వేనాటి సుమంత్ రెడ్డి గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నామని, అయితే పార్టీలో జరిగిన అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. సూళ్లూరుపేటలో తాగునీటిని కూడా ఇప్పించలేకపోయామని సుమంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇటీవలే వేనాటి సుమంత్ రెడ్డి కలిశారు. -
జాక్‌పాట్ లారీ పట్టివేత
తడ: చెన్నై నుంచి నెల్లూరుకు వెళుతున్న పార్శిల్ లారీ, బీవీపాళెం చెక్‌పోస్టు వద్ద ఆగకుండా వచ్చేసింది. దీంతో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు వెంబడించి పోలీసుల సాయంతో లారీని పట్టుకున్నారు. సీటీఓ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం తెల్లవారుజాము 4.30ని. సమయంలో డీసీటీఓ వెంకటేశ్వరనాయక్ ఇతర సిబ్బందితో కలసి రహదారిపై వాహనాలను తనీకీ చేస్తున్నారు. ఇంతలో ఓ పార్శిల్ లారీ వేగంగా చెక్‌పోస్టును దాటి వెళుతుండటం గమనించారు. నాయక్ వెంటనే సిబ్బందితో కలిసి వెంబడించారు. సమాచారం అందుకున్న సీటీఓ వెంటనే తడ ఎస్ఐకి ఫోను ద్వారా విషయం తెలపడంతో అప్రమత్తమైన పోలీసులు లారీని వెంబడించారు. ఇంతలో నాయక్ బృందం లారీని మాంబట్టు వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై పట్టుకున్నారు. కానీ లారీ డ్రైవర్ వాణిజ్యపన్నుల శాఖ అధికారులతో వాదనకు దిగగా అదే సమయానికి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీని చెక్‌పోస్టుకు తరలించారు. ఈ లారీపై నాన్‌స్టాప్ వాహనం కింద కేసు నమోదు చేసి, శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఏఓ రవికుమార్ తెలిపారు. -
స్తంభాన్ని ఢీకొన్న బైక్
ఒకరి దుర్మరణం సూళ్లూరుపేట : పట్టణంలోని చెంగాళమ్మ దక్షిణంవైపు ముఖద్వారంలో మధ్యలో ఉన్న స్తంభాన్ని ఢీకొని ఓ వ్యక్తి ఆదివారం అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కథనం మేరకు.. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలం కాంపాళెంకు చెందిన అక్కరపాక మునిశేఖర్ (24) తడ మండలం మాంబట్టు సెజ్‌లోని రీజెన్ పవర్‌టెక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మాంబట్టులోనే అద్దెకు గది తీసుకుని ఉంటున్నాడు. ఆదివారం మోటార్‌బైక్‌పై సూళ్లూరుపేటకు వచ్చాడు. తిరిగి వెళుతుండగా బైక్ అదుపు తప్పి చెంగాళమ్మ ఆలయం ముఖద్వారం ఆర్చి మధ్యలో ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మునిశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి మృతుని బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బంధువుల వద్ద ఫిర్యాదు తీసుకుని ఎస్ఐ జీ గంగాధర్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.