చెన్నై – కోల్‌కత్తా జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సూళ్లూరుపేటకు ఒక వైపు అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్, మరోవైపు ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో పేరొందిన పరిశ్రమలున్నాయి. ఒక్కసారిగా ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అంతే భూ బకాసురులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలను కాజేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.300 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గడిచిన ఐదేళ్ల కాలంలో పచ్చదండు దోపిడీకి అంతేలేకుండా పోయింది.
సాక్షి, సూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలో టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు బరితెగించారు. ప్రభుత్వ భూముల్ని స్వాహా చేసేశారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు యథేచ్చగా ఆక్రమించేస్తున్నా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు తమకేం పట్టనట్టుగా వ్యవహరించారు. అర్హత లేని చాలామంది గత ప్రభుత్వ హయాంలో దర్జాగా పట్టాలు తీసుకున్న ఘనులున్నారు. సూళ్లూరుపేట పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. దీంతో పట్టణంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు దందాకు అంతేలేకుండా పోయింది. చాలామంది కొంతమేర పొలం కొనుగోలుచేసి భారీగా అసైన్‌మెంట్ భూములను కలుపుకుని ప్లాట్లు వేసిన దర్జాగా విక్రయించేశారు.
125 ఎకరాలు
అధికారుల అంచనా మేరకు సూళ్లూరుపేట మున్సిపల్ పరిధిలో సుమారు రూ.300 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే రెండు చెరువులు, మూడు గుంటలు కలిపి సుమారుగా 125 ఎకరాలు కబ్జాకోరల్లో ఉన్నాయి. టీడీపీ పరిపాలనలో ఉన్నప్పుడే కబ్జాకు గురయ్యాయి. ప్రస్తుతం పట్టణం నడిబొడ్డున ఉన్న ఎర్రబాళెం చెరువు 90 శాతానికి పైగా అంటే సుమారు 30 నుంచి 40 ఎకరాలు వరకు కబ్జాకు గురైం ది. మున్సి పాలిటీ పరిధి లోని 69.50 ఎకరాల పడమటికండ్రిగ చెరువు కూడా పూర్తిగా అన్యాక్రాంతమైంది. దీనికి క్రయ, విక్రయాలు కూడా జరిగిపోతున్నాయి. అదే విధంగా పట్టణంలోని దశబృందం గుంత, స్వతంత్రపురంలో ఒక గుంత, కోళ్లమిట్టలో మరో గుంతతోపాటు మంచినీటి గుంతలన్నీ కబ్జాకోరుల్లో చిక్కుకున్నాయి. పట్టణ పరిధిలో సుమారు 29 లేఅవుట్లు వేశారు. దీనికి పదిశాతం భూమి మున్సిపాలిటీకి వదలకపోగా ఆ వెంచర్‌కు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమినే మింగేసిన ఘనులున్నారు. పందలగుంట ప్రాంతంలో సుమారు 25 ఎకరాలకు పైగా అసైన్‌భూములు భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయి.
ముడుపులు తీసుకుని..
గత ప్రభుత్వంలో వందలాది ఎకరాలు కబ్జా అయినా రెవెన్యూ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ముడుపులు తీసుకుని వదిలేసిన సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. మున్సిపాలిటీ లెక్కల ప్రకారం 17.74 ఎకరాల రిజర్వ్‌సైట్స్ అధికారికంగా ఉన్నాయి. బందిలదొడ్డి, కళాక్షేత్రం, మన్నారుపోలూరు మిట్టలు లాంటి పొలాలను సెక్యూర్ చేశారు. పడమటకండ్రిగ, ఎరబాళెం చెరువుల ఆక్రమణలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పడమటికండ్రిగ చెరువును డంపింగ్‌యార్డుకు ఎంపిక చేసేందుకు మాజీ చైర్‌పర్సన్ నూలేటి విజయలక్ష్మి ప్రయత్నించగా అప్పటి టీడీపీ నాయకుల నుంచి ఒత్తిడి రావడంతో ఈ ప్రయత్నాన్ని మానుకున్నారు. ఆక్రమణల చెరలో ఉన్న భూములను వెలికితీసి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చర్యలు తీసుకుంటాం
మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయమై రెవెన్యూ అధికారులతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటాం. ఆక్రమణల విషయం మా దృష్టిలో ఉంది. ఎక్కడెక్కడ ఎంత ఆక్రమణలకు గురైందో నివేదిక తయారుచేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. ముఖ్యంగా పడమటకండ్రిగ, ఎరబాళెం చెరువు ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.
–నరేంద్రకుమార్, కమిషనర్, సూళ్లూరుపేట
Comments
Please login to add a commentAdd a comment