పారిశ్రామిక విధానాల్లో స్పష్టత కావాలి
తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమల ప్రతినిధుల సూచన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పన్నులు, సింగిల్ విండో క్లియరెన్సులు, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహకాలు తదితర అంశాల విషయంలో పారిశ్రామిక విధానాల్లో నూతన ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని పరిశ్రమ ఆశిస్తోంది. సోమవారం తెలంగాణ రాష్ట్రానికి తొలి ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా పారిశ్రామికవేత్తలు పలు సూచనలు చేసారు ఎమ్మెన్సీ సంస్థలు ఆఫ్‌షోర్ పెట్టుబడులు పెట్టేముందు నిపుణుల లభ్యత, తక్కువ వ్యయం, మౌలిక వసతులు, పెట్టుబడిదారులకు ప్రభుత్వ స్నేహపూర్వక విధానం పరిగణలోకి తీసుకుంటాయి.
ఈ అంశాలనుబట్టి చూస్తే కంపెనీలు ఎంపిక చేసుకునే నగరాల్లో హైదరాబాద్ తన స్థానాన్ని కొనసాగిస్తుందని పెగా సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్ సుమన్ రెడ్డి తెలిపారు. వ్యవస్థాపకత, కొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు అవసరమైన విధానాలను నూతన ప్రభుత్వం ప్రవేశపెడుతుందన్న విశ్వాసం తమకుందని ద ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ మురళి బుక్కపట్నం తెలిపారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు వెన్నుతట్టేందుకు ఇంక్యుబేషన్ కేంద్రాలను విరివిగా స్థాపించాలని కోరారు.
పరిశోధనను తదుపరి స్థాయికి చేర్చే రీసర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని విన్నవించారు. హైదరాబాద్ వెలుపల మరిన్ని పారిశ్రామిక కారిడార్లు, క్లస్టర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించాలని ఇట్స్‌ఏపీ ప్రెసిడెంట్, ప్రోగ్రెస్ సాఫ్ట్వేర్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ లోగనాథన్ తెలిపారు. స్టార్టప్‌లను ఉత్తేజ పరిచేలా ప్రోత్సాహం అవసరమని స్పష్టం చేశారు.