summer olympics
-
గాల్లో ఎగిరే సూపర్ కార్ల సేవలు! దేనికోసమంటే..
ది జెట్సన్స్ అనే ఓ అమెరికన్ యానిమేషన్ సిరీస్ ఉంటుంది. 60వ దశాబ్దంలో సూపర్ హిట్ అయిన సిట్కామ్ ఇది. గాల్లో ఎగిరే వాహనాల ఊహకు ఒక రూపం తెచ్చింది ఈ సిరీస్. మరి ఇదంతా రియల్‌గా జరుగుతుందా? గాల్లో ఎగిరే కార్లు ఈ టెక్నాలజీ గురించి దశాబ్దంపై నుంచే చర్చ నడుస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ముందడుగు వేశాయి కూడా. కానీ, ఆచరణలో రావడానికి కొంచెం టైం పట్టొచ్చని భావించారంతా. ఈ తరుణంలో ఫ్రాన్స్ ఓ అడుగు ముందుకేసింది. 2024 ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్ కోసం ఎగిరే ట్యాక్సీల సేవలను ఉపయోగించాలనుకుంటోంది. భారీ సైజులో ఉండే ఎలక్ట్రిక్ డ్రోన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను క్రీడాభిమానుల కోసం ఉపయోగించబోతున్నారు. వీటిద్వారా ప్రేక్షకులను క్రీడాసమరాలు జరిగే ఒక వేదిక నుంచి మరో వేదికకు తీసుకెళ్తారు. అంతర్జాతీయ ఈవెంట్లకు జనాలు క్యూ కడుతున్న(సగటున 60 లక్షల మంది టికెట్లు కొంటున్నారు.కానీ, కరోనాకి ముందు లెక్కలు ఇవి) తరుణంలో.. బిజీ నగరం ప్యారిస్ ట్రాఫిక్ ఇక్కట్లను తప్పించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 30 ఎయిరోనాటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు టెస్ట్ ఫ్లైట్స్ నిర్వహించేందుకు ముందుకొచ్చాయి. ప్యారిస్‌లోని కార్మెల్లెస్ ఎన్ వెక్సిన్లోని పోంటాయిస్ ఎయిర్‌ఫీల్డ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ టెస్ట్ ఫ్లైట్స్ కేవలం ఒలంపిక్స్ కోసం మాత్రమేనని, భవిష్యత్తులో వీటిని పూర్తి స్థాయిలో వినియోగించాలనే ప్రతిపాదనతో తమకేం సంబంధం లేదని ఒలింపిక్స్ నిర్వాహకులు చెప్తున్నారు. ఈ టెస్ట్ ఫ్లైట్ ఈవెంట్లో స్లోవేకియాకు చెందిన క్లెయిన్ విజన్ ఎయిర్‌కార్ కేవలం మూడు నిమిషాల్లో కారు నుంచి విమానంగా మారిపోయి అమితంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే జపాన్‌కు చెందిన స్కైడ్రైవ్ కంపెనీ 2020లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లైయింగ్ కారును విజయవంతంగా పరీక్షించింది. అయితే వీటిని 2023లోనే మార్కెట్లోని తెచ్చే యోచనలో ఉంది. ఇక సంప్రదాయ కార్ల కంపెనీలు హుండాయ్, రెనాల్ట్ కూడా ఎయిర్‌స్పేస్ రేసులో అడుగుపెడుతున్నాయి. ఫ్లైయింగ్ కార్లను మార్కెట్లోని తేవాలనే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాయి. చదవండి: మెషిన్ అరుస్తోంది అక్కడ.. నిజం చెప్పు -
పతకధారి పేస్...
భారత బృందం ఎప్పుడు ఒలింపిక్స్‌కు వెళుతున్నా ఎవరిలోనూ పెద్దగా ఆశలు లేని రోజులవి... పతకాల సంగతి దేవుడెరుగు, మనవాళ్లు కనీసం పరువు నిలబెట్టుకునే ప్రదర్శన చేసినా గొప్పే అనిపించేది. 1980 మాస్కో ఒలింపిక్స్‌తోనే టీమ్ ఈవెంట్ హాకీ జోరు ముగిసింది. ఆ తర్వాత వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో 5, 6, 7 స్థానాల్లో నిలవడంతో దానినీ ఎవరూ పట్టించుకోలేదు. ఇక వ్యక్తిగత విభాగంలో విజయం అంటే సుదూర స్వప్నం. కానీ ఇలాంటి సమయంలో 23 ఏళ్ల కుర్రాడి సంచలన ప్రదర్శన ఒక్కసారిగా దేశంలో అమితానందం నింపింది. ఎవరూ ఊహించని విధంగా టెన్నిస్ సింగిల్స్‌లో కాంస్యం సాధించి లియాండర్ పేస్ అద్భుతం చేసి చూపించాడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో అతను గెలుచుకున్న కంచు పతకం అందరి దృష్టిలో బంగారమైంది. దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పుడల్లా అసమాన ఆటతీరు కనబర్చడం లియాండర్ పేస్‌లో కనిపించే ప్రత్యేక లక్షణం. ఆసియా క్రీడల్లో, డేవిస్కప్లాంటి పోటీల్లో అతని రికార్డులే చెబుతాయి. భారత్‌కు ఆడుతున్న సమయంలో ప్రత్యర్థి ఎంత బలమైనవాడో, ఏ ర్యాంకులో ఉన్నాడో అతనికి కనిపించదు. తన అత్యుత్తమ ఆటతీరుతో చెలరేగిపోయే తత్వంతో పేస్ పలు సంచలన విజయాలు నమోదు చేశాడు. సరిగ్గా ఇదే శైలితో అతను ఒలింపిక్స్‌లో భారత జాతీయ పతకాన్ని ఎగురవేశాడు. సన్నాహాలు... లియాండర్ పేస్‌కు ఇది రెండో ఒలింపిక్స్. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో అతను రమేశ్ కృష్ణన్‌తో కలిసి డబుల్స్ బరిలోకి దిగాడు కానీ పెద్దగా ఫలితం దక్కలేదు. దాంతో తర్వాతి ఒలింపిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అతను ఆ తర్వాత వెల్లడించాడు. 1996 ఒలింపిక్స్ కోసం నాలుగేళ్లు ప్రత్యేకంగా సన్నద్ధమయ్యాడు. ఇందుకోసం ప్రొఫెషనల్ టూర్లో కొన్ని టోర్నీలను వదిలేసుకున్నాడు. ఒలింపిక్స్ జరిగే అట్లాంటాలోని స్టోన్ మౌంటెయిన్ను పోలి ఉండే వాతావరణంలో (సముద్ర మట్టానికి ఎక్కువ ఎత్తులో ఉంటుంది) జరిగే టోర్నీలలో, అదీ హార్డ్‌కోర్టు టోర్నీలలో మాత్రమే పాల్గొన్నాడు. ప్రతిభ ప్లస్ అదృష్టం... అయితే ఇంతగా శ్రమించినా ఒలింపిక్స్ ‘డ్రా’ చూడగానే అతనిలో ఉత్సాహం ఆవిరైంది. తొలి రౌండ్ ప్రత్యర్థిగా దిగ్గజ ఆటగాడు పీట్ సంప్రాస్ ఎదురయ్యాడు. దాంతో సహచరులు కూడా అయ్యో అంటూ ఓదార్చారు. కానీ అతని కష్టం వృథా పోలేదు. అనూహ్యంగా సంప్రాస్ ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. దాంతో ఊపిరి పీల్చుకొని వరుసగా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ పోయాడు. ఆ సమయంలో పేస్ ప్రపంచ ర్యాంక్ 126. కానీ అతని పట్టుదల ముందు ర్యాంక్‌లు పని చేయలేదు. వరుస రౌండ్లలో రికీ రెనెబర్గ్ (వరల్డ్ నంబర్ 20), నికోలాస్ పెరీరా (వరల్డ్ నంబర్ 74), థామస్ ఎన్క్విస్ట్ (వరల్డ్ నంబర్ 10), రెంజో ఫుర్లాన్ (వరల్డ్ నంబర్ 26)లను పడగొట్టి పేస్ ముందుకు దూసుకుపోయాడు. నాలుగు విజయాల తర్వాత లియాండర్ దిగ్విజయంగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. అక్కడ అతనికి మరో సూపర్ స్టార్, అప్పటి ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆండ్రీ అగస్సీ ఎదురయ్యాడు. అయితే అప్పటికే ఆత్మవిశ్వాసంతో ఉన్న పేస్ బెదరలేదు. తొలి సెట్‌ను టైబ్రేక్ వరకు తీసుకెళ్లగలిగాడు. అయితే చివరికు అగస్సీ ముందు 6–7 (5/7), 3–6తో తలవంచక తప్పలేదు. అసలు సమరం... సెమీస్ మ్యాచ్‌లోనే పేస్ కుడి మణికట్టుకు గాయమైంది. అది తగ్గకుండానే తర్వాతి రోజు కాంస్య పతకం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆడాల్సి ఉంది. బ్రెజిల్‌కు చెందిన వరల్డ్ 93వ ర్యాంకర్ ఫెర్నాండో మెలిగినీ ప్రత్యర్థిగా నిలబడ్డాడు. ఇక అటో ఇటో తేల్చుకోవాల్సిన సమరంలో గాయాలను పట్టించుకునే స్థితిలో అతను లేడు. నొప్పిని భరిస్తూనే మైదానంలోకి దిగాడు. ఆ రోజు పేస్ తన కోసం కాకుండా దేశం కోసం ఆడినట్లు కనిపించాడు. భారత జాతి యావత్తూ కూడా అన్నీ ఆపేసి అతని విజయం కోసం ఎదురుచూసింది. గెలుపు దక్కాలని కోరుకుంది. కానీ తొలి సెట్‌ను పేస్ 3–6తో కోల్పోయాడు. కోర్టు మొత్తం నిశ్శబ్దం. అదే సమయంలో వాన రావడంతో ఆట ఆగిపోయింది. అయితే ఒక్కసారి వర్షం వెలిశాక పేస్ కొత్తగా కనిపించాడు. రెండో సెట్లో 1–2తో వెనుకబడి 30–40తో మరో గేమ్ కోల్పోయే దశలో ఒక్కసారిగా ఎదురుదాడికి దిగాడు. అంతే... అతడిని ఆపడం మెలిగినీ వల్ల కాలేదు. వరుసగా రెండు సెట్లు పేస్ ఖాతాలో చేరాయి. చివరకు 3–6, 6–2, 6–4తో అద్భుత విజయం అందుకొని కన్నీళ్లపర్యంతమయ్యాడు. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో రెజ్లర్ ఖాషాబా జాదవ్ తర్వాత వ్యక్తిగత విభాగంలో పతకం గెలిచిన రెండో భారతీయుడిగా పేస్ నిలిచాడు. కోట్లాది భారతీయులు ఈ విజయం తామే సాధించినంతగా సంబరపడ్డారు. పేస్ తండ్రి వీస్ పేస్ 1972 మ్యూనిక్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడు. దాంతో ఒకే కుటుంబంలో రెండు ఒలింపిక్ పతకాలు చేరడం విశేషం. -
బంగారు కల నెరవేరిన వేళ...
ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఎనిమిది బంగారు పతకాల స్వర్ణయుగం 1980తోనే ముగిసింది. తర్వాతి మూడు ఒలింపిక్స్‌లలోనూ మన దేశం రిక్తహస్తాలతోనే వెనుదిరిగింది. ఆ తర్వాత లియాండర్ పేస్, కరణం మల్లేశ్వరి, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ల ప్రదర్శనతో రెండు కాంస్యాలు, ఒక రజతం మాత్రం వచ్చాయి. కానీ వ్యక్తిగత స్వర్ణం... ఇన్నేళ్లయినా అది భారత్‌కు స్వప్నంగా మారిపోయింది. ఎట్టకేలకు 2008లో ఆ రాత మారింది. పాతికేళ్ల కుర్రాడి తుపాకీ నుంచి దూసుకొచ్చిన ఒక బుల్లెట్ సరిగ్గా పసిడి లక్ష్యాన్ని తాకింది. దాంతో విశ్వ క్రీడల్లో మన దేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని అందించిన అభినవ్ బింద్రా చరిత్రకెక్కాడు. అతని ప్రదర్శన కారణంగా ఆ క్షణాన పోడియంపై వినిపించిన జనగణమన ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేసింది. ‘నా జీవితంలో ఇది ఎప్పటికీ మరిచిపోలేని చీకటి రోజు’... 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో ప్రదర్శన తర్వాత అభినవ్ బింద్రా తన సన్నిహితులతో చేసిన వ్యాఖ్య ఇది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో 7వ స్థానంలో నిలిచిన తర్వాత అతను ఈ మాట అన్నాడు. మరి ఇలా అయితే తర్వాతి లక్ష్యం ఏమిటి... వెంటనే మిత్రులు అడిగారు. ఏముంది, మరో నాలుగేళ్లు శ్రమించడమే అంటూ బింద్రా చిరునవ్వుతో జవాబిచ్చాడు. అంతకుముందు నాలుగేళ్ల క్రితమే 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కూడా అత్యంత పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా బింద్రా పాల్గొన్నాడు. అయితే అప్పుడు క్వాలిఫయింగ్‌లో 11వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయాడు. ఇలాంటి స్థితిలో మరో నాలుగేళ్లు కష్టపడాలంటే ఎంతో ఓపిక, పట్టుదల, పోరాటతత్వం ఉండాలి. కానీ బింద్రా అన్నింటికీ సిద్ధపడ్డాడు. ఒకే లక్ష్యంతో... బింద్రా కలవారి బిడ్డ. డబ్బుకు ఎలాంటి లోటు లేదు. ప్రాక్టీస్‌కు సమస్య రాకుండా ఇంట్లోనే తండ్రి సొంతంగా షూటింగ్ రేంజ్ కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఇది మాత్రమే సరిపోదు. ఇంకా బయటకు కనిపించని, తనకు మాత్రమే తెలిసిన ఇతర లోపాలున్నాయనేది బింద్రా గుర్తించాడు. అన్నింటికి మించి తన ఫిట్నెస్ స్థాయికి తగినట్లుగా లేదని అతనికి అర్థమైంది. 4 కిలోల షూటింగ్ సూట్, 5 కిలోల గన్‌తో గురి కుదరడం లేదని తెలిసింది. అంతే... ఆరు నెలలు రైఫిల్‌కు విరామం ఇచ్చి పూర్తిగా ఫిట్‌గా మారడంపై దృష్టి పెట్టాడు. శరీరాన్ని దృఢంగా మార్చుకున్నాడు. బింద్రాకు కోచ్ గాబ్రియేలా అభినందన ఒక దశలో విరామం లేకుండా పది నిమిషాలు పరుగెత్తడమే కష్టంగా కనిపించిన అతను కనీసం గంటన్నర పాటు ఆగకుండా పరుగెత్తసాగాడు. కీలక సమయంలో బింద్రా లోపాలను సరిదిద్ది అతని షూటింగ్‌ను తీర్చి దిద్దడంలో స్విట్జర్లాండ్ మహిళా కోచ్ గాబ్రియేలా బుల్మన్ పాత్ర కీలకమైంది. 1988 నుంచి 2004 వరుసగా ఐదు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న గాబ్రియేలా... ముఖ్యంగా బింద్రా వెన్నుపై భారం పడకుండా సరైన పొజిషనింగ్‌తో షూటింగ్ చేయడంలో అతడిని తీర్చిదిద్దింది. ఇక బీజింగ్‌కు అతను ఏమాత్రం ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా వెళ్లాడు. ఈసారి ఫలితం గురించి ఆలోచించను, నేను షూటింగ్ చేసేందుకు మాత్రమే వెళుతున్నా అని ముందే చెప్పేశాడు. అలా సాధించాడు... విజయానికి, పరాజయానికి మధ్య వెంట్రుకవాసి తేడా మాత్రమే ఉండే షూటింగ్లో మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు అభినవ్ సిద్ధమయ్యాడు. క్వాలిఫయింగ్‌లో 596 పాయింట్లు సాధించిన భారత షూటర్ నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఫైనల్లో బింద్రా అత్యుత్తమ ప్రదర్శన ముందు మిగతా షూటర్లు వెనుకబడ్డారు. మొత్తం పది రౌండ్లలోనూ ఒక్కసారి కూడా 10 పాయింట్లకు తగ్గకుండా బింద్రా మాత్రమే షూట్ చేయగలిగాడు. ఓవరాల్‌గా 700.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచిన బింద్రా భారత జాతి గర్వపడే ఘనతను సృష్టించాడు. 9వ రౌండ్ ముగిసేసరికి హెన్రీ హకినెన్ (ఫిన్లాండ్), బింద్రా సమాన పాయింట్లతో ఉన్నారు. చివరి రౌండ్లో బింద్రా 10.8 పాయింట్లు స్కోరు చేయగా... తీవ్ర ఒత్తిడిలో హకినెన్ 9.7 పాయింట్లు మాత్రమే స్కోరు చేసి మూడో స్థానానికి పడిపోయాడు. ఆగస్టు 11, 2008న బింద్రా సాధించిన ఘనతతో భారత్ యావత్తూ పులకించింది. 28 ఏళ్ల తర్వాత సాంకేతికంగా భారత్ ఖాతాలో స్వర్ణపతకం చేరినా... వ్యక్తిగత విభాగంలో బంగారం గెలిచిన ఏకైక అథ్లెట్‌గా అతను చరిత్రలో నిలిచిపోయాడు. ఆ తర్వాత అభినవ్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో క్వాలిఫయింగ్ దశలోనే వెనుదిరగ్గా, 2016 రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో రెండో పతకాన్ని చేజార్చుకున్నాడు. అయితే బీజింగ్‌లో అతను స్వర్ణపతకాన్ని అందుకున్న క్షణం మన క్రీడాభిమానుల మదిలో ఎప్పటికీ చిరస్మరణీయం. సాక్షి క్రీడా విభాగం -
కింబర్లీ రోడ్ కొత్త చరిత్ర
ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు... వరుసగా ఆరు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడమే కాకుండా అన్నింట్లోనూ పతకాలు నెగ్గి అమెరికా మహిళా షూటర్ కింబర్లీ సుసాన్ రోడ్ కొత్త చరిత్ర సృష్టించింది. అటు పురుషుల్లో గాని... ఇటు మహిళల్లోగాని సమ్మర్ ఒలింపిక్స్ చరిత్రలో వ్యక్తిగత విభాగంలో వరుసగా ఆరు ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది. వింటర్ ఒలింపిక్స్‌లో అర్మీన్ జొయెగ్లర్ (ఇటలీ) లూజ్ క్రీడాంశంలో మాత్రమే వరుసగా ఆరు ఒలింపిక్స్‌లలో (1994 నుంచి 2014) పతకాలు సాధించాడు. శుక్రవారం రాత్రి ముగిసిన మహిళల షూటింగ్ స్కీట్ ఈవెంట్లో 37 ఏళ్ల రోడ్ కాంస్య పతకాన్ని సాధించింది. ఐదు వేర్వేరు ఖండాల్లో ఒలింపిక్ పతకాలు నెగ్గిన తొలి ప్లేయర్‌గా కూడా కింబర్లీ రోడ్ గుర్తింపు పొందింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ పాల్గొంటానని, అక్కడా పతకం గెలుస్తానని రోడ్ వ్యాఖ్యానించింది. -
గర్భిణులకు బ్రెజిల్ హెచ్చరికలు...
బ్రసీలియా: జికా వైరస్ లాటిన్ అమెరికా దేశాలను హడలెత్తిస్తోంది. ముఖ్యంగా బ్రెజిల్ పై జికా మహమ్మారి గతేడాది తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. బ్రెజిల్ అధ్యక్షురాలు ఈ విషయంపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది బ్రెజిల్ లోని రియోడిజనీరోలో సమ్మర్ ఒలింపిక్స్ జరగున్నాయి. అయితే, గర్భిణులు ఒలింపిక్ గేమ్స్ చూసేందుకు బ్రెజిల్ రావద్దని ఆ దేశ క్యాబినెట్ చీఫ్ జాక్వెస్ వాంగెర్ హెచ్చరించారు. అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ నిర్ణయం మేరకు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. జికా వైరస్ గర్భిణులకు వ్యాపించినట్లయితే వారికి పుట్టబోయే పిల్లలు చిన్న తలతో పుట్టడం, ఇతర ప్రమాదకర వ్యాధులు చిన్నారులకు సంక్రమిస్తాయని తెలిపారు. దోమల కారణంగా వ్యాపిస్తున్న జికా వైరస్ పెను సవాలుగా మారిందని భావించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంపై ఎమర్జెన్సీ ప్రకటించింది. 1947లో ఆఫ్రికాలో కనుగొన్న జికా వైరస్ ఇటీవల కాలంలో వైద్యశాస్త్రానికి ఓ ప్రశ్నగా మిగిలింది. 2014లో 147 కేసులు నమోదవ్వగా, 2015లో 4000 వేల మంది జికా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో జికా వ్యాప్తిని అరికట్టడానికి, ముఖ్యంగా గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఒలింపిక్స్ కోసం ఇక్కడకు రావద్దంటూ క్యాబినెట్ చీఫ్ జాక్వెస్ వాంగెర్ హెచ్చిరికలు జారీచేశారు.