Summer remembered
-
మామిడి పళ్లూ... పెసర గుగ్గిళ్లు
వేసవి జ్ఞాపకం... వేసవి ఉక్కపోతను తట్టుకోలేక చాలామంది తిట్టుకుంటూ ఉంటారు కానీ నాకు మాత్రం ఎండాకాలమంటే ఇష్టం ఎందుకంటే మగ్గిన మామిడి పళ్ల వాసనలు, మల్లెపూల పరిమళాలూనూ. లేత తాటిముంజలు, ఈతపళ్ల తియ్యదనాన్ని రుచి చూడాలంటే వేసవి కాలం రావలసిందే కదా. చిన్నప్పుడు ఎండాకాలం మొదలవడంతోటే అమ్మా, అమ్మమ్మా, నాయనమ్మా, అత్తలు కలిసి పెట్టిన అప్పడాలు, వడియాలను కాకులు ఎత్తుకుపోకుండా, కుక్కలు ముట్టుకోకుండా కాపలా కాసే డ్యూటీ పడేది! మధ్యమధ్యలో ఎండినయ్యో లేదో చూసే వంకతో పచ్చిపచ్చిగా ఉన్న వడియాలను రుచి చూడటం ఒక పచ్చి జ్ఞాపకం. అన్నట్టు అప్పడాలు ఎండినయ్యో లేదో కనుక్కోవడానికి మా అమ్మమ్మ ఒక చిట్కా చెప్పింది. అదేమంటే అప్పడాలు వాటంతట అవి బోర్లాపడుకోబెట్టినట్టుగా కొద్దిగా పైకి లేస్తే అవి ఎండినట్టు. ఆరేసిన బట్ట కింద చిన్నగా చెయ్యి పోనివ్వగానే ఊడి వస్తుంటే గనక వడియాలు ఆరినట్టు. వాటి సంగతి ఏమోగాని వాటి వంకతో చెట్టు కింద కూచుని చందమామ పుస్తకంలో విక్రమార్కుడి భుజాన వేళ్లాడే తెల్ల తోకదెయ్యం బొమ్మను చూస్తూ కూచోవడం ఒక జ్ఞాపకం. పొద్దున్న పదింటికల్లా అన్నం తినేసి, ఒక రౌండు ఆటలు ఆడుకునేవాళ్లం. మధ్యాన్నం పన్నెండున్నరా ఒంటిగంటకల్లా మా తాతయ్య ఇంట్లో కిటికీలన్నింటికీ తడిబట్టలు కట్టించి ఇంటిని ఏసీలా మార్చేసేవాడు. నాలుగున్నరా అయిదు వరకూ పిల్లలెవరూ ఇంట్లో నుంచి బయటకు కదలడానికి వీల్లేదు. నిద్దరొచ్చేదాకా తాతయ్య చెప్పిన కబుర్లు వింటూ వాసాలు లెక్కిస్తూ ఎండకు చివ్వుచివ్వుమనే పిచ్చుక కూతలను వింటూ చాపల మీద పడి దొర్లేవాళ్లం. కాసేపు బజ్జోని లేచేసరికి మామిడిపళ్ల వాసన గాలిలోంచి తేలుతూ వచ్చి పలకరించేది. ఒక చిన్నగిన్నెలో మామిడిపండు పెట్టి ఇచ్చేది మా నానమ్మ. అది తినకుండానే ఆశగా రెండో పండు వైపు చూసేవాణ్ణి. ‘ముందు ఇది తిను, దాని సంగతి తర్వాత చూద్దువుగానీ’ అనేది నవ్వుతూ. మామిడిపండో, ఈతకాయలో, సపోటా పళ్లో... ఇలా ఏవో ఒక చిరుతిళ్లు సిద్ధంగా ఉండేవి ఇంట్లో ఎప్పుడూ! ఏవీ లేకపోతే కందులో పెసలో ఉడకబెట్టి, ఉప్పూకారం కొత్తిమీర, కరివేపాకు వేసి ఘుమఘుమలాడే గుగ్గిళ్లు చేసి పెట్టేది. ఇక సాయంత్రం పూట ఆడపిల్లలకు పూలజడలు వేసేవాళ్లు. జడతో ఫొటోలు తీయించేవాళ్లు. పూలజడ వేయించుకుని వచ్చి, పెద్దవాళ్లకు దణ్ణం పెట్టడం వాళ్లు ప్రేమగా బుగ్గలు పుణికి పదో పరకో చేతిలో పెట్టడం ఒక రూపాయి కాసులాంటి జ్ఞాపకం. ఇప్పుడు అప్పడాలూ వడియాలూ పెట్టడం, పూలజడలు వేయించుకోవడం పల్లెటూళ్లలో కూడా చాలా అరుదుగా కనిపించే దృశ్యమే అయింది. పెద్దోళ్లేమో ఏసీలు, కూలర్లు పెట్టుకుని టీవీ చూస్తూ ఇంట్లో పడుకోవడం, పిల్లలేమో కంప్యూటర్లోనో, స్మార్ట్ ఫోన్లలోనో గేమ్స్ ఆడుకోవడం సర్వసాధారణమైపోయింది. ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ నవ్వులు, ఉట్టుట్టి ఆటలు... అంతా ఉట్టుట్టికే! అసలు ఉబ్బరింత ఇదే కదా. - బాచి -
నాలుగు ముంజెలు చారెడు చక్కెర....
వేసవి జ్ఞాపకం... ఎండాకాలంలో వీధుల్లో తాటిముంజల మనిషి తిరగడం ఒక కళ. పచ్చివాసనలేసే తాటి ఆకుల్లో వొలిచిన తాటి ముంజెల్ని చుట్టి కావడి బద్దకు వేళ్లాడగట్టి అటూ ఇటూ పచ్చటి కట్టలను భుజాన మోస్తూ ‘తాటి ముంజలో’ అని తిరగడం ఎండ పూట మెరిసే ఒక ఊరి కళ. కాని అమ్మేవాళ్లలో చాలా మందికి ఈ ఓపిక ఉండదు. చెట్టు నుంచి దించిన గెలల్ని నేరుగా తీసుకొని బజారుకు వచ్చేస్తారు. కొడవలితో తీపి చిలకరింతలు పెట్టడానికి సిద్ధమవుతారు. తినేవారికి కొదవా? చుట్టూ మూగుతారు. నాకొకటి నాకొకటి అని తాటిముంజెల్ని అందుకుని పొడిచి తినడానికి బొటనవేలును స్పూన్‌లా మార్చేస్తారు. మూడు కన్నులు తేలిన తాటికాయను ఒక చేతిలో బౌల్‌లాగా పట్టుకొని మరో చేతి బొటనవేలుతో ఒక్కో ముంజెను పొడిచి పొడిచి తింటారు. కొన్ని ముంజెల్లో నీళ్లు నిండుగా ఉంటాయి. వేలు పొడవగానే చివ్వున లేచి ముఖాన కొడతాయి. అవి నేల పాలు కాకుండా నోటికి పట్టి గుటకాయస్వాహా చేయడం పెద్ద నైపుణ్యం. ఇక పిల్లలకైతే ముంజెల బండి దగ్గర నిలుచోవడం సరదా. ఎండ పూట ఏదో ఒక కూడలిలో చెట్టు నీడన బండి ఆపి ముంజెలమ్మే మనిషి ఒక్కో తాటికాయను కోరిన వారికి కొట్టి కొట్టి ఇస్తూ ఉంటే చూడటం పిల్లలకు వేడుక. ఒక్కోసారి దయదలిచిన వారు వాళ్లకూ ఒక కాయ ఆఫర్ చేయవచ్చు. రెండు ముంజెలు తిని మూడోదాన్ని వాళ్లకు వదిలిపెట్టవచ్చు. ఖాళీ చేసిన తాటికాయను బండి చక్రంగా మార్చుకోవడం ఒక ఆట. రెండు తాటికాయలను రెండు చక్రాలుగా చేసి మధ్యలో పుల్ల గుచ్చి తాటి ఆకు చీలికను పుల్లకు ముడి వేసి ముడి చివరన పురికోస కట్టి లాక్కూంటూ వెళ్లడం ఇన్నోవా క్రిస్టా కంటే తక్కువ లగ్జరీ కాదు. కొందరు ఒక పంగా కర్ర చివరన ఒక తాటికాయను గచ్చి దానిని స్టీరింగ్‌లా వాడుతూ పంగతో బండి తోసుకెళ్లడం కూడా ముద్దులొలికే ఆట. ముదురు బెండకాయే కాదు ముదురు తాటిముంజ కూడా తినడానికి పనికి రాదు. తింటే కడుపులో నొప్పి పడుతుంది. అసలు వైభోగం అంటే ఏమిటంటే మంచి ఎండపూట తాటి ముంజెలు కొనుక్కొని వచ్చి భోజనం చేశాక తీరిగ్గా వొలిచి చిన్న ముక్కలుగా చేసి ఒక స్టీలు పాత్రలో పోసి పైన చక్కెర జల్లి ఫ్రిజ్‌లో పెట్టి మధ్యాహ్నం కునుక్కు ఉపక్రమించాలి. నిద్ర లేచే సరికి ముంజెలు చల్లబడి చక్కెరపట్టి నోటికి హాయిగా కడుపుకు చల్లగా సిద్ధంగా ఉంటాయి. కెఎఫ్సి, మెక్డొనాల్డ్స్లా తాటిముంజెలు ప్రచారం చేసుకోలేకపోవచ్చు. సమ్మర్ ఆఫర్స్ ప్రకటించకపోవచ్చు. కాని వేళ్లు దిగిన సంస్కృతి వందలఏళ్లైనా పోదు. కాకుంటే గుర్తు పెట్టుకొని ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించాలి. ఈ వేసవిలో పిల్లలకు తాటి చెట్టు చూపించండి. తాటి ఆకు చూపించండి. తాటి ముంజె చూపించండి. బండి దగ్గర ఆగి కొట్టిన తాటి ముంజెన చేతికి ఇస్తే బొటన వేలు గుచ్చగానే నీళ్లు వారి ముఖాన జివ్వున కొడుతూ ఉంటే వారు నవ్వుతూ ఉంటే మీరూ ఫక్కున నవ్వండి. వేసవికి ఇవ్వదగ్గ మర్యాద ఇదే అని గ్రహించండి. -
సన్‌స్క్రీన్ లోషన్ అవసరం లేని బాల్యం...
వేసవి జ్ఞాపకం ‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’, ‘సుకుమారుడు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకున్నారు ఆది(ఆదిత్య). ‘ప్యార్ మే పడిపోయానే’, ‘గాలిపటం’ సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్న ఆది బాల్యంలో తన వేసవి ముచ్చట్ల గురించి ఇలా తెలిపారు... ‘నా చిన్నప్పుడు 7వ తరగతి వరకు చెన్నైలోనే ఉన్నాం. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేశాం. ఇప్పుడంటే ఎండలో తిరిగితే నల్లబడతామని మానేస్తాం. తప్పదంటే సన్‌స్క్రీన్ లోషన్ రాసుకొని వెళతాం. కానీ, చిన్నప్పుడు అలా కాదు.. ఎండలో విపరీతంగా తిరిగేసేవాళ్లం. నాన్నగారు(సాయికుమార్) సినిమా షూటింగ్స్ కారణంగా బిజీగా ఉండేవారు. అందుకే ఊళ్లు వెళ్లేవాళ్లం కాదు. బోర్ కొడుతుందని కొన్ని రోజులు సమ్మర్ క్యాంప్‌కి వెళ్లేవాడిని. మా నాన్నగారికి ఇద్దరు చెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములు. వారు పిల్లలతో సహా వేసవిలో మా ఇంటికే వచ్చేవారు. మా పిల్లల సంఖ్యే 15 వరకు ఉండేది. ఇంకా తాతగారు, నానమ్మ... అంతమందితో వేసవిలో ఇల్లంతా పండగ వాతావరణమే! వీరికి తోడు బయట మా స్నేహితులు... అంతా కలిసి బయట క్రికెట్, బ్యాడ్మింటన్.. పగలు ఇంట్లోనే క్యారమ్స్, చెస్... ఆడేవాళ్లం. మారుతీ వ్యాన్‌లో అందరం కలిసి సినిమాలకు, షికార్లకు వెళ్లేవాళ్లం. ఆటలు, అల్లరి, షికార్లతో.. సెలవులు ఇట్టే గడిచిపోయేవి. తర్వాత అంతా వెళ్లిపోయేవారు. ఇల్లంతా బోసిపోయినట్టుగా అనిపించేది. మళ్లీ త్వరగా వేసేవి వచ్చేస్తే బాగుండు అనుకునేవాడిని. పెద్దయ్యాక వేసవి సెలవుల ఎంజాయ్మెంట్ అంతగా ఉండదు. ఈ మధ్యే కొత్తగా ఇల్లు కొనుక్కున్నాం. ఇంటి పనుల్లో అందరం బిజీ. ఈ నెల 23న బంధువులు, వారి పిల్లలు మా కొత్తింటికి వస్తున్నారు. వాళ్లతో మళ్లీ నా చిన్ననాటి వేసవిని గుర్తుతెచ్చుకుంటూ ఆనందించనున్నాను.’