Health Tips: ఎండలో ఎంతసేపుంటే సరిపడా విటమిన్ ‘డి’ అందుతుంది?
సుకుమారంగా ఉండే వారిని ఎండ కన్నెరగరని వారంటారు. సౌకుమార్యం విషయంలో చెప్పుకోవడానికి ఈ పోలిక బాగున్నా, నిజానికి శరీరానికి ఎండ తగలకపోతే రకరకాల వ్యాధుల బారిన పడటం ఖాయమని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే శరీరానికి సూర్యరశ్మి తాకితే విటమిన్ డీ ఉత్పత్తవుతుంది. ఇది ఎముకలు గట్టిపడటానికి అవసరమైనది. అలా అని గంటల తరబడి ఎండలో గడపటం, ఎండలో తిరగడం వల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
మరి, మనకు సూర్యరశ్మి ఎంత అవసరం?
శరీరంలోని ఎముకలకే కాకుండా, శరీర రోగ నిరోధక వ్యవస్థకు కూడా సూర్యరశ్మి చాలా అవసరం. ఉత్తర భారతదేశానికి చెందిన 69 శాతం మంది మహిళల్లో విటమిన్–డి లోపం ఉంది. వారి శరీరానికి సూర్యరశ్మి సరైన మోతాదులో అందకపోవడం అందుకు ఒక కారణం. ఎండ వల్ల శరీరంలో ఉత్తేజాన్ని పెంచే సెరోటోనిన్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తవుతుందని ఓ అధ్యయనం తెలిపింది.
తగినంత సూర్యరశ్మిని ఎలా పొందాలి?
►ఎంతసేపు ఎండలో ఉండాలి? అన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదు. ఏ కాలం, ఏ రోజు, ఏ సమయం అనేది ఆయా వ్యక్తుల చర్మం తీరు లాంటి అనేక విషయాలపై అది ఆధారపడి ఉంటుంది.
►ఏ ఎండకాగొడుగు అన్నట్టు ఏ ఎండ పడితే ఆ ఎండ వంటికి మంచిది కాదు. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఉండే సూర్యరశ్మి ఆరోగ్యకరమంటారు.
►ఒక్కో వ్యక్తికి ఒక్కో మోతాదు సూర్యరశ్మి అవసరమవుతుంది. ఎండతో వచ్చే సమస్యల తీవ్రత కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది.
►చర్మం పలుచగా ఉంటే, వేసవి కాలంలో రోజూ ఓ 20 నిమిషాలు ఎండలో ఉంటే సరిపోతుందని కొందరు వైద్యులు చెబుతున్నారు.
చదవండి: చర్మసౌందర్యానికి మరింత మేలు చేసే విటమిన్ ‘ఎ’ ఆహారం..