Sunita Rani
-
పర్యావరణహితం: ఈ బ్యాగు... బాగు బాగు!
దేవాలయానికి వెళ్తే... వచ్చిన భక్తులందరి చేతిలో కొబ్బరికాయ, పూజసామగ్రి కవర్లో నుంచి తొంగి చూస్తుంటాయి. కాలనీలో పెట్టిన చిన్న ఎగ్జిబిషన్‌కు వెళ్తే అక్కడ జుట్టుకు పెట్టుకునే పిన్నుల నుంచి వంటగదిలో ఉపయోగించే జాడీలు, స్పూన్లు, బీటర్లు, గ్రేటర్లు వంటివెన్నో ఉంటాయి. వాటిని చూసిన తర్వాత మనకు అవసరమైనవన్నీ గుర్తుకు వస్తాయి. కొన్న వెంటనే స్టాల్ వాళ్లు వాటిని ఒక పాలిథిన్ కవర్లో వేసిస్తారు. ఓ బర్త్‌డే ఫంక్షన్‌కు వెళ్తాం. వెళ్లిన వాళ్లందరికీ రిటర్న్ గిఫ్ట్‌లు ఓ చిన్న క్యారీ బ్యాగ్‌లో వేసిస్తారు. పర్యావరణం పట్ల చైతన్యం కలిగిన వాళ్లు పాలిథిన్ స్థానంలో పేపర్బ్యాగ్లను వాడుతున్నారు. అది మట్టిలో కలిసిపోతుంది, కానీ పేపర్ తయారీకి పెద్ద మొత్తంలో నీరు కావాలి. పేపర్ బ్యాగ్ సహజవనరుల వృథాను అరికట్టేది మాత్రం కాదు. వైశెట్టి సునీతా రాణికి వీటన్నింటికీ ప్రత్యామ్నాయం కేరళలో కనిపించింది. కేరళ ఇచ్చిన ఆలోచన! ‘‘కేరళ వాళ్ల జీవనశైలి ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. భూమాతకు హాని కలిగించని జీవన విధానం వారిది. కొబ్బరిపీచు నుంచి తాటాకు, జ్యూట్ వరకు అన్నింటినీ ఉపయోగిస్తారు. అప్పటికి మన తెలుగు రాష్ట్రాల్లో జ్యూట్ వాడకం పెరగలేదు. దుస్తులు కొన్నప్పుడు కొంతమంది వస్త్రాల దుకాణదారులు కర్రల హ్యాండిల్స్ ఉన్న జ్యూట్ బ్యాగులను ఇచ్చేవారు. అంతే తప్ప బయో డీగ్రేడబుల్ ప్రోడక్ట్స్ దైనందిన జీవనంలోకి పెద్దగా రాలేదు. వచ్చిన అతికొద్ది ఉత్పత్తులు కూడా కోల్‌కతా మోడల్ సింగిల్ వీవింగ్ జ్యూట్ బ్యాగ్‌లే. వాటికి లోపల వైపు ల్యామినేషన్ ఉంటుంది. పైకి మాత్రం ఎకో ఫ్రెండ్లీ అనే ముసుగు వేసి లోపల కెమికల్ ల్యామినేషన్ వాడితే మనం ఏం సాధించినట్లు? పైగా మన దగ్గర ఏలూరులో డబుల్ వీవింగ్ జనపనార అందుబాటులో ఉండగా బయటి నుంచి ల్యామినేషన్ అతికిన జ్యూట్ వాడాల్సిన పనేంటి? ఇంతగా అధ్యయనం చేసిన తర్వాత నేషనల్ జ్యూట్ బోర్డు సహకారంతో నేను బయోడీగ్రేడబుల్ బ్యాగ్‌ల తయారీ మొదలుపెట్టాను’’ అంటూ తాను సోషల్ప్రెన్యూర్గా మారిన వైనాన్ని వివరించారు సునీతారాణి. గ్రీన్ లీఫ్ పుట్టింది! ‘‘మాది విజయవాడ. బాల్యం, చదువు అంతా అక్కడే. ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ పూర్తి కాగానే పెళ్లయింది. హైదరాబాద్‌కి వచ్చాను. షాదాన్, అరోరా కాలేజీల్లో లెక్చరర్‌గా ఉద్యోగం చేశాను. పెద్ద పాప పుట్టిన తర్వాత ఫుల్‌టైమ్ జాబ్ వీలు కాకపోవడంతో కొంతకాలం మెడికల్ ట్రాన్స్క్రిప్టర్గా చేశాను. మా వారు యూఎస్ వెళ్లాలనే ఆలోచన చేశారు. అనుకున్నట్లుగా వెళ్లారు కానీ అక్కడ కొనసాగలేదు. ఇండియా వచ్చిన తర్వాత ప్రింటింగ్‌లో భవిష్యత్తును వెతుక్కున్నాం. ఇంట్లోనే ఒక గదిలో 2002లో ఒక్క మెషీన్‌తో ప్రింటింగ్ మొదలుపెట్టాం. నేను ఇంట్లో పిల్లలను, ప్రింటింగ్ పనులను చూసుకుంటూ ఉంటే మా వారు మార్కెటింగ్ చూసేవారు. ఆ ప్రయత్నం విజయవంతమైంది. జీవితం సౌకర్యవంతంగా సాగుతోంది. మా చిన్న పాప చెస్ ఆడుతుంది. తనకు తోడుగా టోర్నమెంట్లకు నేనే వెళ్లేదాన్ని. అనేక ప్రదేశాలను, వారి జీవనశైలిని చూశాను. ఓ సారి మా ఫ్యామిలీ మొత్తం కేరళ టూర్ వెళ్లాం. అప్పుడు వచ్చిన ఆలోచనే ‘జస్ట్ గ్రీన్ లీఫ్’ రూపంలో హైదరాబాద్‌లో ఆవిష్కృతమైంది. ముగ్గు పరిచయం! చిన్న జీయర్ స్వామిగారు ధనుర్మాస దీక్ష కోసం లడ్డు ప్రసాదం, పసుపు కుంకుమలు వేసివ్వడానికి పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇచ్చారు. వాటిని చూసిన సింగపూర్ టీటీడీ వాళ్లు ప్రత్యేకంగా చేయించుకున్నారు. ఇక బ్యాగ్ మీద ముగ్గు ముద్రించడం వెనుక ఉద్దేశం... ఈ తరం పిల్లలకు మన ముగ్గులను పరిచయం చేయడం. ముగ్గు వేయడం నేర్చుకోమంటే ఎవరు శ్రద్ధ పెడతారు? ఇలా కనిపిస్తూ ఉంటే సరదాగా కాగితం మీద అయినా ఓ ప్రయత్నం చేస్తారని నా ఆశ. పర్యావరణహితమైన జీవనశైలితోపాటు తెలుగుదనాన్ని కూడా అలవాటు చేస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలకే నాకు గో గ్రీన్ పురస్కారం లభించింది’’ అన్నారు వైశెట్టి సునీతారాణి. పిల్లలకు అలవాటు చేయాలి! నా యూనిట్ ఉద్దేశం... జ్యూట్ బ్యాగ్ తయారు చేయడం, ఖర్చులతోపాటు లాభం చూసుకుని అమ్మడం కాదు. మన అవసరాన్ని తీర్చిన తర్వాత ఆ మెటీరియల్ భూమిలో కలిసి పోవాలి. ప్లాస్టిక్లాగ పల్లపు ప్రదేశాలకు కొట్టుకువచ్చి వరదలకు కారణం కాకూడదు. ఇక ప్లాస్టిక్ వినియోగం ఎక్కడ ఎక్కువగా ఉంటోందో గమనించి అక్కడి అవసరాలకు సరిపోయే విధంగా బ్యాగ్‌లను డిజైన్ చేశాను. మార్కెట్‌కి వెళ్లేటప్పుడు తమ వెంట బ్యాగ్ తీసుకెళ్లడం పిల్లలకు అలవాటు చేయాలనేది నా లక్ష్యం. అందుకోసం చేసిన ప్రయోగమే స్క్రీన్ ప్రింటింగ్‌లో జ్యూట్ మీద పిల్లల పేర్లను ముద్రించడం. రిటర్న్ గిఫ్ట్‌గా తమ పేరున్న బ్యాగ్‌ను అందుకున్నప్పుడు వారి సంతోషం వర్ణనాతీతం. ఆ పేరును స్నేహితులకు చూపించుకోవడానికి ఆ బ్యాగ్‌ను ఇష్టంగా వాడడం మొదలుపెడతారు. ఈ ప్రయోగం విజయవంతం అయింది. ఇక నా సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే... ఆన్లైన్లో రకరకాల ఉత్పత్తులను అప్లోడ్ చేస్తాం. అందులో త్వరగా అమ్ముడైన మోడల్ ఏమిటో గమనించి ఆ డిజైన్‌లో ఎక్కువ పీస్‌లు తయారు చేయడం అన్నమాట. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సునీతారాణి పదవికి రాజీనామా చేశారు. సునీతారాణిపై 29 మంది సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం ఓటింగ్ జరగాల్సి ఉంది. దీనికి ఒక రోజు ముందే బుధవారం సాయంత్రం ఆమె తన రాజీనామాను కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం రాకుండా చూసేందుకు, క్యాంపులో ఉన్న కౌన్సిలర్లను వెనక్కి రప్పించేందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంత్రుల స్థాయిలో ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. అవిశ్వాస తీర్మా నంపై ప్రత్యేకంగా కౌన్సిల్‌ను సమా వేశపరిచే అర్హత కలెక్టర్‌కు లేదని హైకోర్టును ఆశ్రయించారు. 28 మంది సభ్యులు కలసి ఒక కౌన్సిలర్ ను కిడ్నాప్ చేశారని కోర్టుకు నివేదిస్తూ తనపై అవిశ్వాసం పెట్టిన తీర్మానాన్ని తిరస్కరించాలని కోరారు. అయితే, కోర్టులో కూడా ఆమెకుచుక్కెదురైంది. పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో గురువారం జరిగే కౌన్సిల్ సమావేశంలో ఓటమి తప్పదని నిర్ణయించుకున్న ఆమె కలెక్టర్ కార్యాలయంలో రాజీనామా అందజేశారు. -
మేం తలచుకుంటే.. ఏముందమ్మా!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘మేం తలచుకున్నంక ఏముంటదమ్మా.. డీజీపీకి చెప్పి ఎక్కడున్నదో క్యాంపు చూడుమంటే ఏంచేస్తడు. బస్సును తీసుకపోయి పోలీస్‌స్టేషన్ లోపల పెడతడు’ ‘యూసఫ్ది లాండ్ ఇష్యూ ఉంది. దాన్ల ప్రాబ్లం క్రియేటవుతది. గవర్నమెంట్ కబ్జా చేస్తది. రమేష్ లాండ్ గుడ గవర్నమెంట్ హాండోవర్ అవుతది. ఆడ బోర్డు బెడతరు’ ‘సుధ వాళ్ల భర్త బెల్లంపల్లి ఓసీల జాబ్ చేస్తుండు. ఆయన్ను రెండు రోజు లల్ల తీసుకుపోయి మణుగూరుల పడేస్తం. కేటీఆర్ తలచుకున్నంక ఎంతసేపమ్మ. ఒక్క మాట చెప్తే రేప్పొద్దున ట్రాన్స్ఫర్ చేసేస్తడు’ ‘కలెక్టర్ ఏం జేస్తడు. గవర్నమెంట్‌కు ఫేవర్గ చేస్తడు కద. అఫీషియల్‌గ ప్రొలాంగ్ చేపించుడో, పోస్ట్‌పోన్ చేయించుడా ఏదో చేస్తం’ బెల్లంపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ కొప్పుల సత్యవతి కూతురుతో స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడిన మాటలు ఇవి. బెల్లంపల్లి మున్సి పల్ చైర్పర్సన్ సునీతారాణిపై అవిశ్వాసం పెట్టేందుకు పార్టీలకు అతీతంగా పాలకమండలిలోని 29 మంది కౌన్సిలర్లు కొద్దిరోజులుగా అజ్ఞాతంగా క్యాంపులో ఉన్నారు. అవిశ్వాసాన్ని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే చిన్నయ్య క్యాంప్‌ను విచ్ఛిన్నం చేయడానికి రంగంలోకి దిగారు. కౌన్సిలర్ల ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ ఉండటంతో వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి క్యాంపు నుంచి తిరిగి వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా 34వ వార్డు కౌన్సిలర్ సత్యవతి కూతురుతో తొలుత మాట్లాడిన ఎమ్మెల్యే క్యాంపు నుంచి తిరిగి వచ్చేలా ఒప్పిం చమని చెప్పారు. తల్లితో మాట్లాడిన కూతురు ఆ విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పేందుకు ఫోన్ చేయగా మంత్రి కేటీఆర్ పేరును ఉపయోగిస్తూ భయ పెట్టేలా సంభాషణ జరిపారు. కేటీఆర్ తలచుకుం టే ఏమైనా జరుగుతుందని, కౌన్సిలర్లకు ఇబ్బం దులు కలుగుతాయని స్పష్టం చేశారు. మాట వినకపోతే కౌన్సిలర్ల అధీనంలో ఉన్న వివాదాస్పద భూములను సర్కార్ కబ్జా చేసుకుంటుందని, బెల్లంపల్లి ఓపెన్‌కాస్ట్‌లో పనిచేస్తున్న సుధ అనే కౌన్సిలర్ భర్తను మణుగూరుకు రెండు రోజుల్లో బదిలీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ ఫోన్ కాల్ లీక్ అయి గురువారం ఉదయాన్నే వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫోన్ సంభాషణ ద్వారా వెల్లడి కావడంతో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. బెల్లంపల్లి ప్రిస్టేజ్ ఇష్యూ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన సంభాషణలో మంత్రి కేటీఆర్ పేరును పలుమార్లు వాడుకున్నారు. ‘గవర్నమెంట్ తలచుకుంటే ఏమన్న అయితది. కేటీఆర్ ప్రిస్టేజ్ ఇష్యూ బెల్లంపల్లి క్యాంప్ అయింది’ అని ఎమ్మెల్యే సంభాషణ సాగించారు. ‘క్యాంపు నుంచి రాకుంటే ఎవరెవరికి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ టైట్ చేసేసి తీసు కొస్తం’ అని మాట్లాడటం చర్చనీయాంశమైంది. అవిశ్వాసానికి ఏడుగురు సభ్యుల నోటీసు బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవి శ్వాసం ప్రకటిస్తూ పాలక మండలిలోని ఏడు గురు సభ్యులు జాయింట్ కలెక్టర్ సురేందర్‌రావు కు నోటీసు అందజేశారు. గురువారం కలెక్ట ర్ కార్యాలయంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ నూనే టి సత్యనారాయణ (టీఆర్ఎస్) నేతృత్వంలోని సభ్యులు సతీష్, ఆర్.శారద (కాంగ్రెస్), బి.రాజేశ్, డి.సుజాత (టీఆర్ఎస్), టి.వంశీకృష్ణారెడ్డి, పి.రాజ్‌కుమార్ (ఇండిపెండెంట్లు) జేసీని కలసి అవిశ్వాసం నోటీసు అందజేశారు. చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం కోసం పాలకమండలిని సమావేశపర్చాలని వారు కోరారు. 29 మంది సభ్యులు అవిశ్వాసం నోటీస్‌పై సంతకాలు చేశారు. -
కానిస్టేబుల్‌పై కేసుకు కోర్టు ఆదేశం
ఖమ్మం లీగల్: ఖమ్మం ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి(పీసీ నెంబర్ 800)పై క్రిమినల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు నివేదికను కోర్టుకు ఆగస్టు 22వ తేదీలోగా ఇవ్వాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఖమ్మం రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ సునితారాణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘సురేష్ చంద్రజైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్’ కేసులో సుప్రీంకోర్టు తీర్పును న్యాయమూర్తి మార్గదర్శకంగా తీసుకుని, నేర తీవ్రతనుబట్టి ఈ కేసులో ఆదేశాలు జారీ చేశారు. న్యాయవాద వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఈ కేసులోని వివరాలు... ఖమ్మంలోని జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న మద్దినేని నాగేశ్వరరావుకు, అతని బంధువులకు మధ్య రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలోగల ఓ ఇంటి విషయమై వివాదం నెలకొంది. నాగేశ్వరరావు బంధువులు ఆ ఇంటి తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించారు. దీనిపై, 2013 సెప్టెంబర్‌లో ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్లో మద్దినేని నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాలని కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి(పీసీ నెంబర్ 800)ని ఎస్ఐ గణేష్ ఆదేశించారు. ఆ కానిస్టేబుల్ విచారణ జరిపి, ఫిర్యాదుదారుడైన నాగేశ్వరరావు బంధువులే తాళం పగలగొట్టారని ఎస్ఐతో చెప్పాడు. కుటుంబ సభ్యుల శ్రేయస్సు దృష్ట్యా రాజీకి రావాలని న్యాయవాదికి ఎస్ఐ సూచించారు. ఈ నేపథ్యంలో... నాగేశ్వరరావు ప్రత్యర్థులతో కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి కుమ్మక్కయ్యాడు. అతడు నాగేశ్వరరావును ‘‘నువ్వు లాయరువైతే నాకేంటి..? నిన్ను ఇప్పుడే లోపల వేయిస్తా. రాజీ పడకపోతే నీ అంతు తేలుస్తా. క్రిమినల్ కేసుల్లో ఇరికిస్తా. ఎన్కౌంటర్ పేరిట కాల్చేస్తా’’ అంటూ బెదిరించాడు. అంతేకాదు.. ‘‘వీడిపై ఎస్పీకి ముందుగానే ఫిర్యాదు చేయండి. ముందు ఫిర్యాదు చేసిన వారి వైపే ఎస్పీ మొగ్గు చూపుతారు. వీడి సంగతి అప్పుడు తేలుస్తా’’ అంటూ, ప్రత్యర్థులతో చెప్పాడు. దీనిపై ఎస్పీకి, డీఎస్పీకి నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మద్దినేని నాగేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. ‘నా హత్యకు కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి కుట్ర పన్నారు. దుర్భాషలాడారు. రకరకాలుగా బెదిరించారు. పరువు నష్టానికి భంగం కలిగించారు’ అని పేర్కొంటూ, ఖమ్మం రెండో అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో ప్రయివేటు కేసు దాఖలు చేశారు. ఎస్పీకి, డీఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు నకళ్లను జత చేశారు. కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డిని ఐపీసీ సెక్షన్ 307, 294(బి), 500, 506, 341, 120(బి) కింద శిక్షించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ ఫిర్యాదును న్యాయమూర్తి పరిశీలించి, అభియోగాల్లో తీవ్రత ఉన్నందున దర్యాప్తు చేసి, ఆగస్టు 22వ తేదీలోగా కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఖానాపురం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఖమ్మం రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ సునితారాణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదుదారుడు మద్దినేని నాగేశ్వరరావు తరఫున న్యాయవాదిగా కొల్లి సత్యనారాయణ వ్యవహరించారు.