ఖమ్మం లీగల్: ఖమ్మం ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి(పీసీ నెంబర్ 800)పై క్రిమినల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు నివేదికను కోర్టుకు ఆగస్టు 22వ తేదీలోగా ఇవ్వాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఖమ్మం రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ సునితారాణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘సురేష్ చంద్రజైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్’ కేసులో సుప్రీంకోర్టు తీర్పును న్యాయమూర్తి మార్గదర్శకంగా తీసుకుని, నేర తీవ్రతనుబట్టి ఈ కేసులో ఆదేశాలు జారీ చేశారు.
న్యాయవాద వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఈ కేసులోని వివరాలు...
ఖమ్మంలోని జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న మద్దినేని నాగేశ్వరరావుకు, అతని బంధువులకు మధ్య రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలోగల ఓ ఇంటి విషయమై వివాదం నెలకొంది. నాగేశ్వరరావు బంధువులు ఆ ఇంటి తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించారు. దీనిపై, 2013 సెప్టెంబర్‌లో ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్‌లో మద్దినేని నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాలని కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి(పీసీ నెంబర్ 800)ని ఎస్‌ఐ గణేష్ ఆదేశించారు. ఆ కానిస్టేబుల్ విచారణ జరిపి, ఫిర్యాదుదారుడైన నాగేశ్వరరావు బంధువులే తాళం పగలగొట్టారని ఎస్‌ఐతో చెప్పాడు. కుటుంబ సభ్యుల శ్రేయస్సు దృష్ట్యా రాజీకి రావాలని న్యాయవాదికి ఎస్‌ఐ సూచించారు.
ఈ నేపథ్యంలో... నాగేశ్వరరావు ప్రత్యర్థులతో కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి కుమ్మక్కయ్యాడు. అతడు నాగేశ్వరరావును ‘‘నువ్వు లాయరువైతే నాకేంటి..? నిన్ను ఇప్పుడే లోపల వేయిస్తా. రాజీ పడకపోతే నీ అంతు తేలుస్తా. క్రిమినల్ కేసుల్లో ఇరికిస్తా. ఎన్‌కౌంటర్ పేరిట కాల్చేస్తా’’ అంటూ బెదిరించాడు. అంతేకాదు.. ‘‘వీడిపై ఎస్పీకి ముందుగానే ఫిర్యాదు చేయండి. ముందు ఫిర్యాదు చేసిన వారి వైపే ఎస్పీ మొగ్గు చూపుతారు. వీడి సంగతి అప్పుడు తేలుస్తా’’ అంటూ, ప్రత్యర్థులతో చెప్పాడు. దీనిపై ఎస్పీకి, డీఎస్పీకి నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు.
అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మద్దినేని నాగేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. ‘నా హత్యకు కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి కుట్ర పన్నారు. దుర్భాషలాడారు. రకరకాలుగా బెదిరించారు. పరువు నష్టానికి భంగం కలిగించారు’ అని పేర్కొంటూ, ఖమ్మం రెండో అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో ప్రయివేటు కేసు దాఖలు చేశారు. ఎస్పీకి, డీఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు నకళ్లను జత చేశారు. కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డిని ఐపీసీ సెక్షన్ 307, 294(బి), 500, 506, 341, 120(బి) కింద శిక్షించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
ఈ ఫిర్యాదును న్యాయమూర్తి పరిశీలించి, అభియోగాల్లో తీవ్రత ఉన్నందున దర్యాప్తు చేసి, ఆగస్టు 22వ తేదీలోగా కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఖానాపురం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఖమ్మం రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ సునితారాణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదుదారుడు మద్దినేని నాగేశ్వరరావు తరఫున న్యాయవాదిగా కొల్లి సత్యనారాయణ వ్యవహరించారు.
కానిస్టేబుల్‌పై కేసుకు కోర్టు ఆదేశం
Published Sat, Jul 12 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM
Advertisement
Advertisement