దేవాలయానికి వెళ్తే... వచ్చిన భక్తులందరి చేతిలో కొబ్బరికాయ, పూజసామగ్రి కవర్‌లో నుంచి తొంగి చూస్తుంటాయి. కాలనీలో పెట్టిన చిన్న ఎగ్జిబిషన్‌కు వెళ్తే అక్కడ జుట్టుకు పెట్టుకునే పిన్నుల నుంచి వంటగదిలో ఉపయోగించే జాడీలు, స్పూన్‌లు, బీటర్‌లు, గ్రేటర్‌లు వంటివెన్నో ఉంటాయి. వాటిని చూసిన తర్వాత మనకు అవసరమైనవన్నీ గుర్తుకు వస్తాయి.
కొన్న వెంటనే స్టాల్ వాళ్లు వాటిని ఒక పాలిథిన్ కవర్‌లో వేసిస్తారు. ఓ బర్త్‌డే ఫంక్షన్‌కు వెళ్తాం. వెళ్లిన వాళ్లందరికీ రిటర్న్ గిఫ్ట్‌లు ఓ చిన్న క్యారీ బ్యాగ్‌లో వేసిస్తారు. పర్యావరణం పట్ల చైతన్యం కలిగిన వాళ్లు పాలిథిన్ స్థానంలో పేపర్‌బ్యాగ్‌లను వాడుతున్నారు. అది మట్టిలో కలిసిపోతుంది, కానీ పేపర్ తయారీకి పెద్ద మొత్తంలో నీరు కావాలి. పేపర్ బ్యాగ్ సహజవనరుల వృథాను అరికట్టేది మాత్రం కాదు. వైశెట్టి సునీతా రాణికి వీటన్నింటికీ ప్రత్యామ్నాయం కేరళలో కనిపించింది.
కేరళ ఇచ్చిన ఆలోచన!
‘‘కేరళ వాళ్ల జీవనశైలి ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. భూమాతకు హాని కలిగించని జీవన విధానం వారిది. కొబ్బరిపీచు నుంచి తాటాకు, జ్యూట్ వరకు అన్నింటినీ ఉపయోగిస్తారు. అప్పటికి మన తెలుగు రాష్ట్రాల్లో జ్యూట్ వాడకం పెరగలేదు. దుస్తులు కొన్నప్పుడు కొంతమంది వస్త్రాల దుకాణదారులు కర్రల హ్యాండిల్స్ ఉన్న జ్యూట్ బ్యాగులను ఇచ్చేవారు. అంతే తప్ప బయో డీగ్రేడబుల్ ప్రోడక్ట్స్ దైనందిన జీవనంలోకి పెద్దగా రాలేదు. వచ్చిన అతికొద్ది ఉత్పత్తులు కూడా కోల్‌కతా మోడల్ సింగిల్ వీవింగ్ జ్యూట్ బ్యాగ్‌లే. వాటికి లోపల వైపు ల్యామినేషన్ ఉంటుంది. పైకి మాత్రం ఎకో ఫ్రెండ్లీ అనే ముసుగు వేసి లోపల కెమికల్ ల్యామినేషన్ వాడితే మనం ఏం సాధించినట్లు? పైగా మన దగ్గర ఏలూరులో డబుల్ వీవింగ్ జనపనార అందుబాటులో ఉండగా బయటి నుంచి ల్యామినేషన్ అతికిన జ్యూట్ వాడాల్సిన పనేంటి? ఇంతగా అధ్యయనం చేసిన తర్వాత నేషనల్ జ్యూట్ బోర్డు సహకారంతో నేను బయోడీగ్రేడబుల్ బ్యాగ్‌ల తయారీ మొదలుపెట్టాను’’ అంటూ తాను సోషల్‌ప్రెన్యూర్‌గా మారిన వైనాన్ని వివరించారు సునీతారాణి.
గ్రీన్ లీఫ్ పుట్టింది!
‘‘మాది విజయవాడ. బాల్యం, చదువు అంతా అక్కడే. ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ పూర్తి కాగానే పెళ్లయింది. హైదరాబాద్‌కి వచ్చాను. షాదాన్, అరోరా కాలేజీల్లో లెక్చరర్‌గా ఉద్యోగం చేశాను. పెద్ద పాప పుట్టిన తర్వాత ఫుల్‌టైమ్ జాబ్ వీలు కాకపోవడంతో కొంతకాలం మెడికల్ ట్రాన్‌స్క్రిప్టర్‌గా చేశాను. మా వారు యూఎస్ వెళ్లాలనే ఆలోచన చేశారు. అనుకున్నట్లుగా వెళ్లారు కానీ అక్కడ కొనసాగలేదు. ఇండియా వచ్చిన తర్వాత ప్రింటింగ్‌లో భవిష్యత్తును వెతుక్కున్నాం. ఇంట్లోనే ఒక గదిలో 2002లో ఒక్క మెషీన్‌తో ప్రింటింగ్ మొదలుపెట్టాం. నేను ఇంట్లో పిల్లలను, ప్రింటింగ్ పనులను చూసుకుంటూ ఉంటే మా వారు మార్కెటింగ్ చూసేవారు. ఆ ప్రయత్నం విజయవంతమైంది. జీవితం సౌకర్యవంతంగా సాగుతోంది. మా చిన్న పాప చెస్ ఆడుతుంది. తనకు తోడుగా టోర్నమెంట్‌లకు నేనే వెళ్లేదాన్ని. అనేక ప్రదేశాలను, వారి జీవనశైలిని చూశాను. ఓ సారి మా ఫ్యామిలీ మొత్తం కేరళ టూర్ వెళ్లాం. అప్పుడు వచ్చిన ఆలోచనే ‘జస్ట్ గ్రీన్ లీఫ్’ రూపంలో హైదరాబాద్‌లో ఆవిష్కృతమైంది.
ముగ్గు పరిచయం!
చిన్న జీయర్ స్వామిగారు ధనుర్మాస దీక్ష కోసం లడ్డు ప్రసాదం, పసుపు కుంకుమలు వేసివ్వడానికి పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇచ్చారు. వాటిని చూసిన సింగపూర్ టీటీడీ వాళ్లు ప్రత్యేకంగా చేయించుకున్నారు. ఇక బ్యాగ్ మీద ముగ్గు ముద్రించడం వెనుక ఉద్దేశం... ఈ తరం పిల్లలకు మన ముగ్గులను పరిచయం చేయడం. ముగ్గు వేయడం నేర్చుకోమంటే ఎవరు శ్రద్ధ పెడతారు? ఇలా కనిపిస్తూ ఉంటే సరదాగా కాగితం మీద అయినా ఓ ప్రయత్నం చేస్తారని నా ఆశ. పర్యావరణహితమైన జీవనశైలితోపాటు తెలుగుదనాన్ని కూడా అలవాటు చేస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలకే నాకు గో గ్రీన్ పురస్కారం లభించింది’’ అన్నారు వైశెట్టి సునీతారాణి.
పిల్లలకు అలవాటు చేయాలి!
నా యూనిట్ ఉద్దేశం... జ్యూట్ బ్యాగ్ తయారు చేయడం, ఖర్చులతోపాటు లాభం చూసుకుని అమ్మడం కాదు. మన అవసరాన్ని తీర్చిన తర్వాత ఆ మెటీరియల్ భూమిలో కలిసి పోవాలి. ప్లాస్టిక్‌లాగ పల్లపు ప్రదేశాలకు కొట్టుకువచ్చి వరదలకు కారణం కాకూడదు. ఇక ప్లాస్టిక్ వినియోగం ఎక్కడ ఎక్కువగా ఉంటోందో గమనించి అక్కడి అవసరాలకు సరిపోయే విధంగా బ్యాగ్‌లను డిజైన్ చేశాను. మార్కెట్‌కి వెళ్లేటప్పుడు తమ వెంట బ్యాగ్ తీసుకెళ్లడం పిల్లలకు అలవాటు చేయాలనేది నా లక్ష్యం. అందుకోసం చేసిన ప్రయోగమే స్క్రీన్ ప్రింటింగ్‌లో జ్యూట్ మీద పిల్లల పేర్లను ముద్రించడం. రిటర్న్ గిఫ్ట్‌గా తమ పేరున్న బ్యాగ్‌ను అందుకున్నప్పుడు వారి సంతోషం వర్ణనాతీతం. ఆ పేరును స్నేహితులకు చూపించుకోవడానికి ఆ బ్యాగ్‌ను ఇష్టంగా వాడడం మొదలుపెడతారు. ఈ ప్రయోగం విజయవంతం అయింది. ఇక నా సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే... ఆన్‌లైన్‌లో రకరకాల ఉత్పత్తులను అప్‌లోడ్ చేస్తాం. అందులో త్వరగా అమ్ముడైన మోడల్ ఏమిటో గమనించి ఆ డిజైన్‌లో ఎక్కువ పీస్‌లు తయారు చేయడం అన్నమాట.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment