'సూపర్-30'కి సూపర్ అవకాశం!
న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ పరీక్షలకు శిక్షణనిస్తూ దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన సూపర్-30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ ను ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫాం 'ఎడ్ఎక్స్' గణితశాస్త్రం బోధించాలని ఆహ్వానించింది. ఈ వెబ్ సైట్ ను మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్ఐటీ), హార్వర్డ్ యూనివర్సిటీలు ప్రమోట్ చేస్తున్నాయి. ఈ మేరకు ఎమ్ఐటీ ప్రొఫెసర్ అనంత అగర్వాల్.. ఆనంద్ కు లేఖ రాశారు.
'ఎడ్ఎక్స్' కొన్ని కోర్సులను ఉచితంగా అందిస్తోందని, ఎడ్ఎక్స్, సూపర్-30 కలిసి పనిచేయడం వల్ల ప్రపంచంలో ఎక్కువమంది విద్యార్థులు లాభపడతారని ఆయన లేఖలో చెప్పారు. లేఖపై స్పందించిన ఆనంద్ కుమార్ ఎమ్ఐటీ, హార్వర్డ్ లాంటి విద్యాసంస్థలు సూపర్-30ని తమతో కలుపుకుపోవాలని అనుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఎడ్ఎక్స్ లాంటి సంస్థలు పేదల కోసం విద్యను అందిస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. కచ్చితంగా ఎడ్ఎక్స్ తో కలిసి నడుస్తానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఏ మేరకు సాయం చేయగలనో ముందు ముందు చూడాలని అన్నారు. ఆనంద్ కుమార్ కు కేంబ్రిడ్జి యూనివర్సిటీలో సీటు దొరికినా ఆర్ధిక కారణాల వల్ల అక్కడకు వెళ్లలేకపోయారు. 2002లో సూపర్-30ని ప్రారంభించిన ఆనంద్ ఐఐటీలో చేరేందుకు ఆసక్తి కలిగిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్న విషయం తెలిసిందే.