ఐఐటీ జేఈఈ ఫలితాల్లో ‘సూపర్ 30’ హవా
పట్నా: ప్రతిభగల నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ కోచింగ్ అందించే బిహార్‌లోని ‘సూపర్ 30’ సంస్థ ఈ ఏడాదీ సత్తా చాటింది. ఐఐటీ-జేఈఈ 2016 ఫలితాల్లో సంస్థలోని 30 మంది విద్యార్థులకుగాను ఏకంగా 28 మంది అర్హత సాధించారు. వారిలో దినసరి కూలీ, సన్నకారు రైతు, వలస కార్మికుల పిల్లలు ఉన్నట్లు సూపర్ 30 వ్యవస్థాపక డెరైక్టర్ ఆనంద్ కుమార్ ఆదివారం పట్నాలో తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకుల కష్టానికి దక్కిన ఘనత ఇది అని వ్యాఖ్యానించారు.
సరైన అవకాశాలు కల్పిస్తే పేద కుటుంబాల పిల్లలు కూడా ఐఐటీలలో సీట్లు సాధించగలరని ఈ ఏడాది ఫలితాలు మరోసారి నిరూపించాయన్నారు. ఏటా పోటీ పరీక్ష ద్వారా 30 మంది పేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా కోచింగ్‌తోపాటు భోజన, వసతి సౌకర్యాలను సూపర్ 30 కల్పిస్తోంది. రోజుకు 16 గంటల చొప్పున ఏడాదిపాటు విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ‘ద బెస్ట్ ఆఫ్ ఆసియా 2010’ జాబితాలో సూపర్ 30ని ఎంపిక చేసింది.’