ఆండ్రాయిడ్స్లోకి వచ్చేసిన సూపర్ మారియో
నీలం రంగు జుబ్బా.. ఎరుపు రంగు టోపి పెట్టుకుని పరుగెత్తుకుంటూ అడ్వెంచర్లతో దూసుకెళ్లే బుడతడి గేమ్ సూపర్ మారియో ఎవరికి తెలియదు చెప్పండి. టీవీ వీడియో గేమ్స్ లో ఎక్కువగా పాపులర్ అయిన ఈ గేమ్ ను నిటెండో కంపెనీ సూపర్ మారియో రన్ పేరుతో ఐఓఎస్ లోకి తీసుకొచ్చింది. ఐఓఎస్ లో ఈ గేమ్ సూపర్ సక్సెస్ కావడంతో, నేటి నుంచి దీన్ని ఆండ్రాయిడ్ లోకి అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ఆండ్రాయిడ్ వెర్షన్లలో కూడా ఇక నుంచి సూపర్ మారియో రన్ అందుబాటులోకి వచ్చిందని కంపెనీ పేర్కొంది. గతేడాది ఐఓఎస్ లోకి వచ్చిన ఈ గేమ్ కు అనూహ్య స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
లాంచ్ అయిన తొలి నాలుగు రోజుల్లోనే 40 మిలియన్ల సార్లు డౌన్ లోడ్ అయింది. జనవరి వరకు 78 మిలియన్ల సార్లు డౌన్ లోడ్ నమోదుచేసింది. ప్రస్తుతం స్వల్పమార్పులతో ఆండ్రాయిడ్ లోకి తీసుకొచ్చారు. అయితే ఈ మార్పులు గేమ్ సేల్ పై ప్రభావం చూపే అవకాశముందని కొందరంటున్నారు. ఆండ్రాయిడ్ లో లాంచ్ చేసిన ఈ కంపెనీ ముందస్తుగా గూగుల్ ప్లే స్టోర్ లో ప్రీ-రిజిస్టర్లు అందుబాటులో ఉంచింది. ఒకవేళ డౌన్ లోడ్ కావాలనుకునే వారు ఏపీకే మిర్రర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఆండ్రాయిడ్ లో ఈ గేమ్ లాంచ్ తో పాటు ఐఓఎస్ లోనూ దీన్ని అప్ డేట్ చేశారు. ఐఓఎస్ లో మాదిరిగా ఆండ్రాయిడ్ లోనూ ఇది సక్సెస్ సాధిస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తంచేస్తోంది.