కుడిచేతికి, ఎడమచేతికి వేర్వేరు డాక్టర్లు!
దేశంలో సూపర్ స్పెషాలిటీ వైద్యం బాగా పెరిగిపోయిందని, ఇప్పుడు కళ్లకో డాక్టర్, కాళ్లకో డాక్టర్, చేతులకో డాక్టర్.. ఇలా వస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రాబోయే రోజుల్లో కుడిచేతికి ఒక డాక్టర్, ఎడమ చేతికి మరో డాక్టర్ వస్తారేమోనని ఆయన చమత్కరించారు. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాత రోజుల్లో ఊరి మొత్తానికి ఒకరే వైద్యుడు ఉండేవారని, ఆయన నాడి పట్టుకుని చూసి ఏం సమస్య ఉందో చెప్పేవారని గుర్తు చేశారు. ఆ తర్వాతి కాలంలో ఎంబీబీఎస్ డాక్టర్లు వచ్చారని.. వాళ్లు పది పదిహేను రకాల ప్రశ్నలు అడిగి ఆరోగ్య సమస్య ఏంటో తెలుసుకునేవారని చెప్పారు.
ఇప్పుడు సూపర్ స్పెషాలిటీతో పాటు.. డాక్టర్ల పాత్ర తగ్గి టెక్నాలజీ పాత్ర పెరిగిందని ఆయన అన్నారు. రోగిని మిషన్ లోపలకు పంపేసి, ఏం సమస్య వచ్చిందో చెబుతున్నారన్నారు. అయితే.. వైద్య రంగంలో టెక్నాలజీ రావడం వల్లే కచ్చితత్వం కూడా పెరిగిందని, సరైన చికిత్సలు అందుతున్నాయని వివరించారు. కేవలం వైద్య సేవలు మాత్రమే కాదని.. ఈ రంగంలో పరిశోధనలు కూడా పెరగాలని సూచించారు. ఏయే మార్పులు వస్తున్నాయో తెలుసుకోవాలని, వాటిపై పరిశోధించాలని మోదీ తెలిపారు. భారత్ లాంటి దేశాల్లో కూడా అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతున్నాయని, ఇందుకు బెనారస్ హిందూ యూనివర్సిటీ, టీఐఎఫ్ఆర్ లాంటి సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయని ప్రశంసించారు.