Super Specialty Medicine
-
ప్రభుత్వ వైద్యమూ.. పేదలకు దూరం!
సాక్షి, అమరావతి : వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పేదలకు చేరువైన సూపర్ స్పెషాలిటీ వైద్యం.. కూటమి ప్రభుత్వ తీరుతో ఇక క్రమంగా దూరం కాబోతుంది. ప్రభుత్వ వైద్యానికీ, చికిత్సలకు కూడా డబ్బులు కట్టే పరిస్థితులు రాబోతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను అడ్డుకుంటూ.. ఎంబీబీఎస్ సీట్లు రద్దు చేయిస్తూ.. ప్రైవేటీకరణ దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. తద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన వైద్య విప్లవానికి పూర్తిగా తూట్లు పొడుస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు ద్వారా ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను పేద ప్రజలకు చేరువ చేసేందుకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ఏకంగా 17 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా బోధనాస్పత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి వైద్య విప్లవానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా తొలిదశలో 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఈ విద్యా సంవత్సరంలో మరో ఐదు కాలేజీలను ప్రారంభించాల్సి ఉంది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణపై మోజుతో ఈ ఒక్క విద్యా సంవత్సరంలోనే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను పోగొట్టి నీట్ విద్యార్థులకు తీవ్ర నష్టం చేకూర్చింది. అలాగే బోధనాస్పత్రుల ఏర్పాటుకు అడ్డుపడి పేదల వైద్యానికి గండి కొట్టింది. టెరిషరీ కేర్ బలోపేతమే లక్ష్యంగా..ప్రభుత్వ వైద్య రంగంలో ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అని మూడు లేయర్లుగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ విస్తరించి ఉంది. ప్రైమరీ కేర్‌లో విలేజ్ క్లీనిక్‌లు, పీహెచ్‌సీలు, సెకండరీ కేర్‌లో సీహెచ్ïÜలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులుంటాయి. టెరిషరీ కేర్‌లో బోధనాస్పత్రులు, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ఉంటాయి. ప్రజలు తీవ్రమైన జబ్బుల బారినపడినప్పుడు మెరుగైన చికిత్సలు అందించడంలో టెరిషరీ కేర్ కీలక పాత్ర పోషిస్తుంది. 2019 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వీటికి అనుబంధంగా బోధనాస్పత్రులు ఉండేవి. దీంతో గ్రామీణ ప్రజలు మెరుగైన చికిత్సల కోసం 50 నుంచి 100 కి.మీ పైగా దూరం ప్రయాణించి టెరిషరీ కేర్ ఆస్పత్రులను చేరుకోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తద్వారా అప్పటి వరకు జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు ఉన్న చోట.. ప్రభుత్వం ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో బోధనాస్పత్రులు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక రచించింది. గుండె, మెదడు, కిడ్నీ, క్యాన్సర్ తదితర రోగాలకు ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు.. వైద్యులు, అధునాత పరికరాలు, సిబ్బందిని సమకూర్చేలా కార్యాచరణ రూపొందించి ఆ దిశగా చర్యలు చేపట్టింది. విద్య, వైద్యంతో ప్రజలకు మేలు..కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెరగడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువవుతాయి. ఇప్పటివరకూ జిల్లా, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు ఉన్న చోట్ల బోధనాస్పత్రులు ఏర్పాటైతే నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వస్తారు. అధునాతన వైద్య పరికరాలు, ల్యాబ్‌లు సమకూరి.. వైద్య సేవలు, రోగనిర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగుతుంది. ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థులు నాలుగేళ్ల తర్వాత హౌస్ సర్జన్లుగా అందుబాటులోకి వస్తారు. వీరు నిరంతరం ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండటం వల్ల రోగులకు సేవలు మరింత మెరుగవుతాయి. నాలుగైదేళ్ల తర్వాత పీజీ సీట్లు కూడా సమకూరితే.. స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య పెరిగేది. పేదల్లో ఆందోళనచంద్రబాబు చెబుతున్న గుజరాత్ పీపీపీ విధానంతో ఉచిత వైద్య సేవలపై పేదల్లో ఆందోళన మొదలైంది. ప్రైవేట్ వ్యక్తులకు కొత్త మెడికల్ కాలేజీలను అప్పగిస్తే వారి అజమాయిషీలో నడిచే బోధనాస్పత్రుల్లో వైద్య సేవల కోసం ప్రజలు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టి పేదల ప్రయోజనాలకు తూట్లు పొడిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చేరువలోనే మెరుగైన వైద్యసేవలువందల ఏళ్ల చరిత్ర కలిగిన బందరు నగరంలో 2019 ముందు వరకూ సరైన వైద్య సేవలు అందుబాటులో లేవు. తీవ్ర అనారోగ్యం పాలైన వారు 70 కి.మీ ప్రయాణించి విజయవాడకు వెళ్లేవాళ్లు. ఈ పరిస్థితిని గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కొత్త మెడికల్ కాలేజీ నెలకొల్పింది. అప్పటి వరకు 300 పడకలుగా ఉన్న జిల్లా ఆస్పత్రిని.. 600 పడకల బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసింది. 150 ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీని ప్రారంభించింది. 60కి లోపు వైద్యులు ఉండే ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం వంద మంది వరకూ వైద్యులు అందుబాటులోకి వచ్చారు. స్టాఫ్ నర్సులు, ఇతర సహాయక సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు 700 మేర ఓపీలు నమోదు అవుతున్నాయి.వ్యయ ప్రయాసలు తగ్గాయిగతంలో మచిలీపట్నంలో జిల్లా ఆస్పత్రి ఉండేది. కానీ అనుభవజ్ఞులైన వైద్యులు ఉండేవారు కాదు. దీంతో చిన్నచిన్న సమస్యలకు కూడా విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులు, ఇతర రోగులు 70 కి.మీ దూరం ప్రయాణించి విజయవాడకు వెళ్లేలోగా ప్రాణాపాయం సంభవించేది. వైఎస్ జగన్ ప్రభుత్వం బోధనాస్పత్రి ఏర్పాటు చేయడంతో అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులోకి వచ్చారు. గతంతో పోలిస్తే సేవలు మెరుగయ్యాయి. ప్రైవేట్‌పై మోజుతో ఆస్పత్రిని నిర్లక్ష్యం చేస్తే పేదలకు తీరని నష్టం జరుగుతుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆస్పత్రి నడిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. – ఎ. గాంధీ, మచిలీపట్నంప్రైవేటీకరణ నిర్ణయంతో పేదలకు చేటు.ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమా జానికి హానికరం. ప్రభుత్వం ఏదైనా కానీ.. ప్రజల శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయాలు, పనులను కొనసాగించాలి.అలా చేయకుండా మంజూరైన ఎంబీబీఎస్ సీట్లు వద్దనడం, కాలేజీల నిర్మాణాలను ఆపేయడం వంటి పనులు హర్షణీయం కాదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని ఏర్పాటైతే.. అంతగా పేదలకు మేలు జరుగుతుంది. ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీలోకి బోధనాస్పత్రులు వెళ్లడం వల్ల.. పేదల ప్రయోజనాలు దెబ్బతింటాయి. చికిత్సలకు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. – డాక్టర్ ఎంవీ రమణయ్య,చైర్మన్, రాష్ట్ర ప్రజారోగ్య వేదిక -
ఏపీ వైద్య విద్యలో వందేళ్ల రికార్డు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైద్య నియామకాల నుంచి మెడికల్ కాలేజీల నిర్మాణం వరకు అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంతోపాటు రాష్ట్రంలో 95% కుటుంబాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ప్రారంభించనున్నారు. తద్వారా వైద్య విద్యలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి వచ్చాయి. విజయనగరం వైద్య కళాశాల వద్ద నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని అక్కడి నుంచే మిగిలిన నాలుగు కళాశాలలను కూడా ప్రారంభించనున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చింది. అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను మెరుగుపరుస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలకు ప్రభుత్వ రంగంలో శ్రీకారం చుట్టడం ద్వారా సీఎం జగన్ నూతన అధ్యాయాన్ని లిఖించారు. 17 కొత్త కళాశాలలు.. 2,550 ఎంబీబీఎస్ సీట్లు రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త కళాశాలల ఏర్పాటు ద్వారా అదనంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా విద్యార్థులు అడ్మిషన్లు కూడా పొందారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్ కళాశాలలను ప్రారంభించనున్నారు. ఇక మిగిలిన 7 వైద్య కళాశాలలను 2025–26లో ప్రారంభించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులను 330 పడకల జిల్లా ఆస్పత్రులుగా ప్రభుత్వం నోటిఫై చేసింది. మూడేళ్లలోనే సీట్లు రెట్టింపు రాష్ట్రంలో ఆంధ్రా వైద్య కళాశాల 1923లో మొదటిసారిగా ఏర్పాటైంది. ఆ తరువాత మరో పది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు ద్వారా 2,185 ఎంబీబీఎస్ సీట్లు సమకూరాయి. అంటే 2,185 సీట్లు సమకూరడానికి వందేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు 17 వైద్య కళాశాలలను అందుబాటులోకి తేవడం ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లను సీఎం జగన్ మన విద్యార్థులకు అదనంగా సమకూరుస్తుండటం గమనార్హం. అంటే కేవలం మూడేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ రంగంలో రెట్టింపు దాటనున్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి అత్యాధునికంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ కాలేజీ కంటే మెరుగ్గా ఉంది. అత్యాధునిక ల్యాబ్స్, టీచింగ్ హాల్స్, లెక్చర్ హాల్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలో తొలి బ్యాచ్‌లో చదవడం చక్కటి అనుభూతి. ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయకపోయి ఉంటే మేం ప్రైవేట్ కాలేజీలకు వెళ్లాల్సి వచ్చేది. – సీహెచ్, ఢిల్లీరావు, వైద్య విద్యార్థి, ఏలూరు వైద్య కళాశాల గొప్ప వరంలా భావిస్తున్నా మాది విశాఖపట్నం. మధ్యతరగతి కుటుంబం. నీట్లో కొంత మెరుగైన ర్యాంక్ వచ్చింది. అయినప్పటికీ బీసీ ‘ఏ’ కేటగిరీలో గతంలో ఈ ర్యాంకుకు మెడిసిన్‌లో సీటు రావటం సాధ్యమయ్యేది కాదు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడంతో నా ర్యాంక్‌కు సీట్ దక్కింది. లేదంటే మళ్లీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఒత్తిడితోపాటు విలువైన సమయం, డబ్బు వృథా అయ్యేది. కార్పొరేట్ వైద్య కళాశాలలకు ధీటుగా మా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం గొప్ప వరంలా నాలాంటి ఎందరో విద్యార్థులు భావిస్తున్నారు. – బమ్మిడి లక్ష్మీజ్యోత్న్స, వైద్య విద్యార్థిని, ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల రెండు రకాల లాభాలు.. వైద్యవిద్య డిమాండ్‌కు తగ్గట్టుగా రాష్ట్రంలో కళాశాలలు లేకపోవడంతో మన విద్యార్థులు వలస వెళుతున్నారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలతో మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెరుగుతున్నాయి. జిల్లా, ఏరియా ఆస్పత్రులున్న చోట బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. వైద్య సేవలు, రోగనిర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగుతుంది. ఇలా విద్య, వైద్యంలో రెండురకాలుగా లాభాలుంటాయి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్ ఉన్నత స్థాయి వైద్యం కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా వాటికి అనుబంధంగా బోధనాస్పత్రులు పని చేస్తాయి. వీటిద్వారా ప్రజలకు ఉన్నత స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు అభివృద్ధి చెందుతాయి. ఆయా ప్రాంతాల్లో జబ్బులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై పరిశోధనలు పెరుగుతాయి. సేవలు రెట్టింపు అవుతాయి. అన్ని ప్రాంతాల్లో బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తే ప్రజలకు వ్యయ ప్రయాసలు తొలగి అనుభవజ్ఞులైన వైద్యుల సంరక్షణ లభిస్తుంది. రోగులు మరింత త్వరగా కోలుకోవడానికి ఇది దోహదపడుతుంది. – డాక్టర్ జి.రవికృష్ణ,ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న చోటే వైద్య విద్యలో చేరా.. ప్రభుత్వం మా ప్రాంతంలో కొత్త వైద్య కళాశాలను ప్రారంభించడంతో అక్కడే ఆప్షన్ ఇచ్చా. అందులోనే సీటు వచ్చింది. ఇటీవలే తరగతులు ప్రారంభం అయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. మేం ఉంటున్న ప్రాంతంలోనే వైద్య విద్య అభ్యసిస్తున్నా. లేదంటే దూర ప్రాంతాలు వెళ్లాల్సి వచ్చేది. మనవద్ద మెడికల్ సీట్లు పెరగడంతో చాలా మందికి అవకాశాలు లభించాయి. – మహ్మద్ హర్సిన బేగం, వైద్య విద్యార్థిని, రాజమండ్రి వైద్య కళాశాల నాలుగేళ్లలో వైద్యం బలోపేతం ఇలా.. నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 53 వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలు అప్పుడే యుద్ధప్రాతిపదికన నియామకం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు. రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులకు జవసత్వాలు. గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా సరఫరా. టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి ఏకంగా 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం. 108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. మరో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలతో కలిపి మొత్తం 2,204 వాహనాలతో ప్రజలకు ఉచిత వైద్య సేవలు. టీడీపీ హయాంలో 108 అంబులెన్స్‌లు కేవలం 531 మాత్రమే ఉండగా ఇందులో కేవలం 336 మాత్రమే మనుగడలో ఉండేవి. పీజీ మెడికల్ సీట్ల సంఖ్యను నాలుగేళ్లలో 966 నుంచి 1,767కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. జాతీయస్థాయిలో స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులు ఖాళీలు 61 శాతం కాగా మన రాష్ట్రంలో అది కేవలం 3.96% మాత్రమే. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద దీర్ఘకాలిక రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రతి నెలా ఇంటి వద్దే పెన్షన్లు గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో 6 క్యాన్సర్ కేర్ సెంటర్ల ఏర్పాటు దిశగా అడుగులు. -
గాంధీ ఆస్పత్రి.. 24/7
ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యం ప్రతిష్టాత్మక గాంధీ జనరల్ ఆస్పత్రిలో ఇకపై 24/7 సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆపదలో అత్యవసర విభాగానికి చేరుకుంటున్న క్షతగాత్రులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర సేవలను విస్తరించి.. ఆ మేరకు అత్యాధునిక వసతులను సమకూర్చింది. అంతేకాదు దీనికి జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరో, గ్యాస్ట్రో ఎంటరాలజీ, çపల్మొనాలజీ వైద్య నిపుణులను అనుసంధానించి రౌండ్ ద క్లాక్ రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. – సాక్షి, హైదరాబాద్ 110 పడకలకు ఐసీయూ విస్తరణ ప్రస్తుతం పది పడకలతో కొనసాగుతున్న గాంధీ ఐసీయూని 110 పడకలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతలో 65 పడకలను సిద్ధం చేసింది. త్వరలోనే మిగిలినవి కూడా అందుబాటులోకి తీసుకురానుంది. అత్యాధునిక హైడ్రాలిక్ పడకలతో ఏర్పాటు చేసిన ఈ ఐసీయూని కార్పొరేట్ ఆస్పత్రులకు తీసిపోని విధంగా తీర్చిదిద్దింది. బెడ్‌సైడ్ మానిటర్లు, ఆక్సిజన్ పైప్లైన్లు, ఏసీ, సెలైన్ స్టాండ్లు, రోగి వస్తువులను భద్రపరుచుకునేందుకు అవసరమైన ర్యాక్‌తో పాటు సహాయకుల కోసం ఓ కుర్చీని కూడా ఏర్పాటు చేసింది. వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య పరీక్షల కోసం అత్యాధునిక ఆల్ట్రాసౌండ్, ఎక్సరే మిషన్లను సిద్ధం చేసింది. గతంలో ఆపదలో అత్యవసర విభాగానికి చేరుకున్న బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందేవికావు. ఐసీయూలో సీనియర్లు లేకపోవడంతో అక్కడ ఉన్న పీజీలు కేవలం బాధితుల వివరాలు నమోదు చేసుకుని సంబంధిత విభాగానికి తరలించాల్సి వచ్చేది. వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్‌గా చెప్పుకునే 30 నుంచి 60 నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రికి తీసుకొచ్చినా రోగి ప్రాణాలు దక్కేవికావు. దీంతో ఒక్కోసారి వైద్యులు బాధితుల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చేది. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయి. ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి నిరుపేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం గాంధీలో రూ.10 కోట్ల వ్యయంతో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 110 పడకల సామర్థ్యం కలిగిన అత్యాధునిక ఐసీయూ సిద్ధం చేసింది. దీనిని ఈ నెల 11న గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించి ఏర్పాట్లపై సమీక్షించారు.