గాంధీ ఆస్పత్రి.. 24/7
ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యం
ప్రతిష్టాత్మక గాంధీ జనరల్ ఆస్పత్రిలో ఇకపై 24/7 సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆపదలో అత్యవసర విభాగానికి చేరుకుంటున్న క్షతగాత్రులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర సేవలను విస్తరించి.. ఆ మేరకు అత్యాధునిక వసతులను సమకూర్చింది. అంతేకాదు దీనికి జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరో,
గ్యాస్ట్రో ఎంటరాలజీ, çపల్మొనాలజీ వైద్య నిపుణులను అనుసంధానించి రౌండ్ ద క్లాక్ రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. – సాక్షి, హైదరాబాద్
110 పడకలకు ఐసీయూ విస్తరణ
ప్రస్తుతం పది పడకలతో కొనసాగుతున్న గాంధీ ఐసీయూని 110 పడకలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతలో 65 పడకలను సిద్ధం చేసింది. త్వరలోనే మిగిలినవి కూడా అందుబాటులోకి తీసుకురానుంది. అత్యాధునిక హైడ్రాలిక్ పడకలతో ఏర్పాటు చేసిన ఈ ఐసీయూని కార్పొరేట్ ఆస్పత్రులకు తీసిపోని విధంగా తీర్చిదిద్దింది. బెడ్‌సైడ్ మానిటర్లు, ఆక్సిజన్ పైప్‌లైన్లు, ఏసీ, సెలైన్ స్టాండ్లు, రోగి వస్తువులను భద్రపరుచుకునేందుకు అవసరమైన ర్యాక్‌తో పాటు సహాయకుల కోసం ఓ కుర్చీని కూడా ఏర్పాటు చేసింది.
వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య పరీక్షల కోసం అత్యాధునిక ఆల్ట్రాసౌండ్, ఎక్సరే మిషన్లను సిద్ధం చేసింది. గతంలో ఆపదలో అత్యవసర విభాగానికి చేరుకున్న బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందేవికావు. ఐసీయూలో సీనియర్లు లేకపోవడంతో అక్కడ ఉన్న పీజీలు కేవలం బాధితుల వివరాలు నమోదు చేసుకుని సంబంధిత విభాగానికి తరలించాల్సి వచ్చేది. వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్‌గా చెప్పుకునే 30 నుంచి 60 నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రికి తీసుకొచ్చినా రోగి ప్రాణాలు దక్కేవికావు. దీంతో ఒక్కోసారి వైద్యులు బాధితుల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చేది. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయి.
ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి
నిరుపేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం గాంధీలో రూ.10 కోట్ల వ్యయంతో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 110 పడకల సామర్థ్యం కలిగిన అత్యాధునిక ఐసీయూ సిద్ధం చేసింది. దీనిని ఈ నెల 11న గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించి ఏర్పాట్లపై సమీక్షించారు.