Super Woman
-
కల్లోల ఇజ్రాయెల్‌లో ఇండియన్ సూపర్ ఉమెన్
బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చు... అనుకునే భయానక పరిస్థితుల్లో ఉండి కూడా, తమకు ఏమైనా ఫరవాలేదు, నిస్సహాయులైన వృద్ధదంపతులకు ఏమీ కాకూడదని వారిని కంటికి రెప్పలా కాపాడారు ఇజ్రాయెల్‌లో హోమ్ నర్స్‌లుగా పనిచేస్తున్న కేరళకు చెందిన సబిత, మీరా మోహన్‌లు... దక్షిణ ఇజ్రాయెల్... గాజా సరిహద్దుకు రెండో కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్ ఓజ్ కిల్బట్జ్ పట్టణంలో ఒక ఇంట్లో... 85 సంవత్సరాల షౌలిక్, 76 సంవత్సరాల రహెల్ దంపతులకు నలుగురు పిల్లలు. పిల్లలు వేరు వేరు ప్రాంతాలలో ఉంటున్నారు. రహెల్ అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమెను చూసుకోవడానికి ఆరోజు ఆ ఇంట్లో సబిత, మీరా మోహన్ అనే ఇద్దరు హోమ్నర్స్లు ఉన్నారు. ఉదయం ఆరున్నర ప్రాంతంలో సైరన్ మోత వినిపించింది. ప్రజలు బాంబ్ షెల్టర్లలో తల దాచుకోవాలని చెప్పే సైరన్ అది. ‘ఆ ఉదయం సైరన్ మోగేసరికి గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. సెకండ్ల వ్యవధిలో సేఫ్టీరూమ్లోకి వెళ్లాలి. ఇంతలో రహెల్ కుమార్తె నుంచి ఫోన్ వచ్చింది. బయట పరిస్థితి భయానకంగా ఉంది అని ఆమె చెప్పింది. మాకు ఏం చేయాలో తోచలేదు. ఇంటిముందు, వెనుక తలుపులకు తాళాలు వేసి అమ్మానాన్నలను తీసుకొని, పాస్‌పోర్ట్, డైపర్లు, యూరిన్ పాట్, మందులతో సెక్యూర్ రూమ్‌లోకి వెళ్లాలని ఆమె చెప్పింది. షౌలిక్, అనారోగ్యంతో ఉన్న రహేల్‌ను నడిపించుకుంటూ షెల్టర్ రూమ్‌లోకి వెళ్లాం. ఈలోపే మిలిటెంట్లు ఇంట్లోకి ప్రవేశించారు. అద్దాలు బద్దలు కొట్టారు. వస్తువులు ధ్వంసం చేశారు. షెల్టర్రూమ్పై కాల్పులు జరుపుతున్నారు. ఐరన్ డోర్ వెనకే మా శరీరాలను గట్టిగా ఆనించి ఎన్నో గంటలపాటు నిల్చున్నాం. అదృష్టవశాత్తు ఐరన్ డోర్ ధ్వంసం కాలేదు. ధ్వంసం అయి ఉంటే ఎవరి ప్రాణాలు మిగిలేవి కావు’ అంటూ ఆ భయానక ఘటనను గుర్తు తెచ్చుకుంది 39 సంవత్సరాల సబిత. కేరళకు చెందిన సబిత, మీరా మోహన్ల సాహసం, మానవత్వం గురించి దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ‘ఇండియన్ సూపర్ ఉమెన్’ అంటూ ప్రశంసించింది. -
Eksha Hangma Subba: సూపర్ ఉమన్!
ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు విమానాలను కూడా అవలీలగా నడిపేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో నైపుణ్యంతో రాణిస్తూంటే ‘ఇక్షా హంగ్మా సుబ్బ’ మాత్రం నాలుగు నైపుణ్యాలతో వందమందిలో ఒక్కటిగా దూసుకుపోతుంది. ఇక్షా హంగ్మా సుబ్బ.. ఏంటీ అనిపిస్తుంది కదూ! అవును ఈ పేరు పలకడానికి, వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నట్టుగానే ఇక్షా వృత్తినైపుణ్యాలు ఒకదానికి ఒకటి పొంతన లేకపోయినప్పటికీ, తనదైన శైలిలో రాణిస్తూ అందరిచేత సూపర్ ఉమన్ అనిపిస్తోంది. బోల్డ్ అండ్ బ్యూటిపుల్‌గా పేరొందిన ఇక్షా.. సిక్కిం పోలీస్ ఆఫీసర్, జాతీయ స్థాయి బాక్సర్, బైకర్, ఎమ్‌టీవీ సూపర్ మోడల్. సిక్కిం రాష్ట్రంలోని పశ్చిమ జిల్లా సొంబారియా గ్రామంలో ఐతరాజ్, సుకర్ణి సుబ్బా దంపతులకు 2000 సంవత్సరంలో ఇక్షా జన్మిచింది. ఒక సోదరుడు ఉన్నాడు. ప్రైమరీ,సెకండరీ విద్యాభ్యాసం అంతా సొంతూరులోనే పూర్తి చేసింది. తరువాత గ్యాంగ్‌టక్‌లోని బహదూర్ భండారీ కాలేజీలో డిగ్రీలో చేరింది. ఈ సమయం లోనే ఎన్ఎస్ఎస్లోలో చేరింది. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే ఇక్షాకు నటన అన్నా... మోడలింగ్ అన్నా అమితాసక్తి. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల మూలంగా డిగ్రీ చదువుతూనే పోలీసు ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యి మంచి మార్కులతో సిక్కిం పోలీస్ విభాగంలో చేరింది. 14 నెలల శిక్షణ తరువాత ‘యాంటీ రైట్ ఫోర్స్’ విభాగంలో పోలీస్ ఆధికారిగా చేరింది. ఉద్యోగంలో చేరి, కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడుతున్నప్పటికీ చిన్నప్పటినుంచి ఉన్న మోడలింగ్ ఆసక్తి వెలితిగా తోచింది తనకు. మిస్ సిక్కిం.. పోలీస్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్కూల్లో ఉన్నప్పుడు వివిధ మోడలింగ్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లలో పాల్గొని గెలిచిన సందర్భాలు, కాలేజీలో ‘మిస్ ఫ్రెషర్’గా టైటిల్‌ను గెలుచుకున్న సందర్భాలు తనకి గుర్తొచ్చేవి. తన గ్రామం నుంచి రాష్ట్రస్థాయి మోడలింగ్ పోటీలలో పాల్గొని మిస్ సిక్కిం టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో ఇక్షాకు మోడలింగ్‌లోకి వెళ్లేందుకు నమ్మకం కుదిరింది. అక్కడి నుంచి వివిధ రకాల మోడలింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొనేది. ఈ క్రమంలోనే ఎమ్‌టీవీ సూపర్ మోడల్ –2 రియాల్టీ షో ఆడిషన్స్‌కు హాజరై సెలక్ట్ అయింది. ఈ సెలక్షన్స్ ద్వారా ఇక్షా గురించి అందరికీ తెలిసింది. మొత్తం పదిహేనుమంది పాల్గొన్న ఈ షోలో మొదట టాప్ నైన్లో చోటు సంపాదించుకుని పాపులర్ అయ్యింది. పోటాపోటీగా జరుగుతున్న ఈ షోలో ప్రస్తుతం మూడవ స్థానంలో కొనసాగుతూ అందర్ని ఆకట్టుకుంటోంది. టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా సూపర్ మోడల్‌గా ఇక్షాను పొగుడుతూ ట్వీట్ చేయడం, షో న్యాయనిర్ణేతలు కూడా ఇక్షాను అభినందిస్తుండంతో అంతా ఆమెను అభినందనలలో ముంచెత్తుతున్నారు. ఇక్షా ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు ఆటలు బాగా పనికొస్తాయని ప్రోత్సహించడంతో స్థానికంగా నిర్వహించే బాక్సింగ్ తరగతులకు హాజరై బాక్సింగ్ నేర్చుకుని జాతీయస్థాయి బాక్సర్‌గా ఎదిగింది. అలా ఒకపక్క బాక్సింగ్ చేస్తూనే మరోపక్క ఉద్యోగం చేస్తూ తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ సూపర్ ఉమన్‌గా నిలుస్తోంది. ఇక్షాకు మోడలింగ్‌తోపాటు డ్రైవింగ్ కూడా చాలా ఇష్టం. అందుకే ఆమె కేటీఎమ్ ఆర్సీ 200 మోటర్ బైక్ నడుపుతూ లాంగ్ రైడ్స్‌కు వెళ్తుంటుంది. చిన్న వయసులో ఇన్ని రకాల నైపుణ్యాలతో దూసుకుపోతూ ఎంతోమంది యువతీయువకులకు ప్రేరణగా నిలుస్తోంది ఇక్షా. -
Viral Video: సూపర్ ఉమెన్ స్మృతి మంధాన.. జస్ట్ వావ్
ఉత్కంఠభరితంగా సాగిన చివరి వన్డేలో టీమిండియా, ఇంగ్లండ్ మహిళల జట్టుపై విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు ఇంగ్లండ్ బ్యాటింగ్ టైంలో టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్ఉమెన్ స్మృతి మంధాన ఒడిసి పట్టిన క్యాచ్.. మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. 59 బంతుల్లో 5 ఫోర్లతో 49 పరుగులు చేసిన నాట్ స్కివర్ (49; 5 ఫోర్లు).. దీప్తి బౌలింగ్‌లో లాంగ్ షాట్ కోసం ప్రయత్నించింది. ఆ టైంలో బౌండరీ లైన్ దగ్గర స్మృతి మంధాన డైవ్ చేస్తూ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకుని పెవిలియన్‌కు చేర్చింది. Out of 10, how much would you rate this stunner by Smriti Mandhana? 😍🙌 #ENGvIND #ENGWvINDW pic.twitter.com/M66ivgC88v — Female Cricket (@imfemalecricket) July 3, 2021 కాగా, ఈ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ ఉమెన్ అంటూ తెగపొగిడేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే 2-1తేడాతో సిరీస్ ఓడిన టీమిండియా.. జులై 9న మొదలుకాబోయే టీ20 సమరానికి సిద్ధమవుతోంది. -
సరికొత్త సూపర్ ఉమన్!
స్పైడర్మాన్, సూపర్మాన్, హీమ్యాన్, శక్తిమాన్, ఆర్యమాన్... ఇలా అద్వితీయ శక్తులన్నీ టోకుగా పురుషులకు మాత్రమే పరిమితమా? మహిళలు కేవలం రక్షించబడడానికి మాత్రమే పరిమితమా? మహిళల్లో సూపర్ ఉమన్లు లేరా? బహుశా ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా కావచ్చు... ‘ప్రియ’ అనే సరికొత్త (కామిక్ బుక్) సూపర్ ఉమన్ రంగం మీదికి వచ్చింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను దృష్టిలో పెట్టుకొని చిత్ర నిర్మాత రామ్ దేవ్నేని ధీరోదత్తమైన ఈ ‘ప్రియ’ పాత్రకు రూపకల్పన చేశారు. సాధారణంగా కామిక్ పుస్తకాల్లో వినోదం అధిక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ‘ప్రియ’ మాత్రం సామాజిక స్పృహను దృష్టిలో పెట్టుకొని, మహిళల్లో ఆత్మస్థైర్యం నింపడానికి రూపొందిన కామిక్ పుస్తకం. ఈ పుస్తకానికి డాన్ గోల్డ్‌మాన్ వేసిన ఇలస్ట్రేషన్లు అత్యద్భుతం అని చెప్పుకోవాలి. ఇక కథ విషయానికి వస్తే... ప్రియ అనే అందమైన యువతి పార్వతీదేవి భక్తురాలు. ఉపాధ్యాయురాలు కావాలనేది ప్రియ లక్ష్యం. పరిస్థితులు బాగో లేక చిన్నతనంలోనే చదువుకు స్వప్తి చెప్పి ఇంటి పనికే పరిమితమవుతుంది. ఒకానొక దురదృష్టకరమైన రోజు కొందరు దుర్మార్గుల చేతిలో ప్రియ అత్యాచారానికి గురవుతుంది. ఇంటికి దూరమవుతుంది. కొన్ని రోజుల తరువాత ఆమె పులిపై సవారీ చేస్తూ ఊరికి తిరిగి వస్తుంది. తనపై అత్యాచారానికి ఒడిగట్టిన దుర్మార్గులను శిక్షిస్తుంది. అంతేకాదు... స్త్రీలపై జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాలు, భౌతిక, మానసిక హింసలను నిరోధించడానికి కంకణం కట్టుకుంటుంది. ప్రపంచానికి సరికొత్త సందేశం ఇవ్వడానికి పూనుకుంటుంది. పార్వతిదేవి ప్రియకు అండగా ఉంటుంది. ప్రియ పాత్రకు విస్తృత ప్రాచుర్యం కల్పించడానికి ముంబాయి వీధుల్లోని గోడలపై చేయితిరిగిన సినీ చిత్రకారులతో ఆకర్షణీయంగా బొమ్మలు గీయిస్తున్నారు రామ్ దేవ్నేని. తెల్లటి గోడలపై గంభీరంగా, ధైర్యసాహసాలు ఉట్టిపడేట్లు కనిపించే ప్రియ చిత్రాలు... కేవలం వర్ణచిత్రాలుగా మాత్రమే కనిపించవు... మహిళల్లో ఆత్మవిశ్వాసం, సాహసం నింపడానికి ఉద్దేశించిన సరికొత్త ఆయుధాలుగా కనిపిస్తాయి. సామాజికస్పృహను దృష్టిలో పెట్టుకొని, మహిళల్లో ఆత్మస్టైర్యం నింపడానికి రూపొందిన కామిక్ పుస్తకం ‘ప్రియాశక్తి’ స్త్రీలపై జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాలు, భౌతిక, మానసిక హింసలు నిరోధించడానికి కంకణం కట్టుకుంటుంది ఈ పుస్తకంలోని ప్రియ పాత్ర.