సరికొత్త సూపర్ ఉమన్!
స్పైడర్‌మాన్, సూపర్‌మాన్, హీమ్యాన్, శక్తిమాన్, ఆర్యమాన్... ఇలా అద్వితీయ శక్తులన్నీ టోకుగా పురుషులకు మాత్రమే పరిమితమా? మహిళలు కేవలం రక్షించబడడానికి మాత్రమే పరిమితమా? మహిళల్లో సూపర్ ఉమన్‌లు లేరా? బహుశా ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా కావచ్చు... ‘ప్రియ’ అనే సరికొత్త (కామిక్ బుక్) సూపర్ ఉమన్ రంగం మీదికి వచ్చింది.
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను దృష్టిలో పెట్టుకొని చిత్ర నిర్మాత రామ్ దేవ్‌నేని ధీరోదత్తమైన ఈ ‘ప్రియ’ పాత్రకు రూపకల్పన చేశారు. సాధారణంగా కామిక్ పుస్తకాల్లో వినోదం అధిక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ‘ప్రియ’ మాత్రం సామాజిక స్పృహను దృష్టిలో పెట్టుకొని, మహిళల్లో ఆత్మస్థైర్యం నింపడానికి రూపొందిన కామిక్ పుస్తకం. ఈ పుస్తకానికి డాన్ గోల్డ్‌మాన్ వేసిన ఇలస్ట్రేషన్లు అత్యద్భుతం అని చెప్పుకోవాలి.
ఇక కథ విషయానికి వస్తే...
ప్రియ అనే అందమైన యువతి పార్వతీదేవి భక్తురాలు. ఉపాధ్యాయురాలు కావాలనేది ప్రియ లక్ష్యం. పరిస్థితులు బాగో లేక చిన్నతనంలోనే చదువుకు స్వప్తి చెప్పి ఇంటి పనికే పరిమితమవుతుంది.
ఒకానొక దురదృష్టకరమైన రోజు కొందరు దుర్మార్గుల చేతిలో ప్రియ అత్యాచారానికి గురవుతుంది. ఇంటికి దూరమవుతుంది.
కొన్ని రోజుల తరువాత ఆమె పులిపై సవారీ చేస్తూ ఊరికి తిరిగి వస్తుంది. తనపై అత్యాచారానికి ఒడిగట్టిన దుర్మార్గులను శిక్షిస్తుంది. అంతేకాదు... స్త్రీలపై జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాలు, భౌతిక, మానసిక హింసలను నిరోధించడానికి కంకణం కట్టుకుంటుంది. ప్రపంచానికి సరికొత్త సందేశం ఇవ్వడానికి పూనుకుంటుంది. పార్వతిదేవి ప్రియకు అండగా ఉంటుంది.
ప్రియ పాత్రకు విస్తృత ప్రాచుర్యం కల్పించడానికి ముంబాయి వీధుల్లోని గోడలపై చేయితిరిగిన సినీ చిత్రకారులతో ఆకర్షణీయంగా బొమ్మలు గీయిస్తున్నారు రామ్ దేవ్‌నేని. తెల్లటి గోడలపై గంభీరంగా, ధైర్యసాహసాలు ఉట్టిపడేట్లు కనిపించే ప్రియ చిత్రాలు... కేవలం వర్ణచిత్రాలుగా మాత్రమే కనిపించవు... మహిళల్లో ఆత్మవిశ్వాసం, సాహసం నింపడానికి ఉద్దేశించిన సరికొత్త ఆయుధాలుగా కనిపిస్తాయి.
సామాజికస్పృహను దృష్టిలో పెట్టుకొని, మహిళల్లో ఆత్మస్టైర్యం నింపడానికి రూపొందిన కామిక్ పుస్తకం ‘ప్రియాశక్తి’ స్త్రీలపై జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాలు, భౌతిక, మానసిక హింసలు నిరోధించడానికి కంకణం కట్టుకుంటుంది ఈ పుస్తకంలోని ప్రియ పాత్ర.