చికెన్‌తో చిక్కులెన్నో!
న్యూఢిల్లీ: తందూరీ చికెన్, బటర్ చికెన్.. ఇలాంటి చికెన్ వంటకాల పేర్లు వింటేనే నోరూరుతుంది కదూ ? రుచికి మారుపేరైన చికెన్‌తోపాటు గుడ్లతోనూ ఎన్నో అనర్థాలు ఉన్నాయట. మన భారతీయ కోళ్ల కారణంగా మన వాళ్లకే కాదు ప్రపంచానికి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడి కోళ్లలో వ్యాధి నిరోధక వ్యవస్థకు కూడా లొంగని సూపర్‌బగ్స్/బ్యాక్టీరియాలు ఉన్నట్టు భారత్–అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.
పంజాబ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎన్నో పెద్ద పెద్ద పౌల్ట్రీఫారాలు ఉంటాయి. వీటిలోనే సరికొత్త బ్యాక్టీరియాలు ఉత్పత్తి అవుతున్నాయి. కోళ్లు అనారోగ్యం బారినపడకుండా చూడడానికి, త్వరగా బరువు పెరగడానికి యాంటీబయోటిక్ మందులు ఎక్కువగా ఇస్తుండడంతో హానికారక బ్యాక్టీరియాలు ఉత్పత్తి అవుతున్నాయి. యాంటీబయోటిక్ సత్తా క్రమంగా తగ్గిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ అధికారి, ఈ పరిశోధనలో పాలుపంచుకున్న మార్గరెట్ చాన్ అన్నారు. ఇలాంటి చికెన్ తినేవాళ్లకు ఏదైనా జబ్బు సోకితే సాధారణ యాంటీబయోటిక్స్ పనిచేయవని తెలిపారు.
వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ డిసీజెస్ డైనమిక్స్, ఎకనమిక్స్ అండ్ పాలసీ సంస్థ పరిశోధకులు పంజాబ్‌లోని ఆరు జిల్లాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. పంజాబ్‌లోని మెజారిటీ పౌల్ట్రీఫారాల్లో పెరిగే కోళ్లు, గుడ్లలో సూపర్‌బగ్స్ ఉంటున్నాయని సంస్థ డైరెక్టర్ రామనన్ లక్ష్మీనారాయణ్ చెప్పారు. అనారోగ్యం బారినపడ్డ జంతువులు మినహా మిగతా వాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ యాంటీబయోటిక్స్ ఇవ్వకూడదని స్పష్టం చేశారు.